Ankita Shrivastava: అమ్మను బతికించుకోలేకపోయా…
అమ్మ కోసం 19 ఏళ్ల వయసులో కాలేయదానం చేసింది. అయినా తల్లిని కాపాడుకోలేకపోయారు. నాన్న చెయ్యొదిలేశాడు. అయినా కుంగిపోలేదామె. క్రీడాకారిణిగా ప్రపంచరికార్డులు సాధించారు.
అమ్మ కోసం 19 ఏళ్ల వయసులో కాలేయదానం చేసింది. అయినా తల్లిని కాపాడుకోలేకపోయారు. నాన్న చెయ్యొదిలేశాడు. అయినా కుంగిపోలేదామె. క్రీడాకారిణిగా ప్రపంచరికార్డులు సాధించారు. వ్యాపారవేత్తగా, టెడెక్స్ స్పీకర్‌గా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న 28 ఏళ్ల అంకిత శ్రీవాస్తవ ప్రయాణమిది.
పుట్టింది గ్వాలియర్‌లోనైనా అంకిత శ్రీవాస్తవ బాల్యమంతా భోపాల్‌లోనే గడిచింది. తల్లికి తీవ్ర అనారోగ్యం. కాలేయమార్పిడి అవసరమన్నారు వైద్యులు. దాత కోసం ఎదురుచూడటంలోనే ఏడేళ్లు గడిచాయి. తల్లి అనారోగ్యం ఎక్కువవడంతో 19 ఏళ్ల వయసులో అంకిత తనే కాలేయదానం చేయాలనుకున్నారు. ‘అమ్మను బతికించుకోవడానికి వేరే మార్గం కనిపించలేదు. అదృష్టం కొద్దీ నా బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవడంతో 2014 ఫిబ్రవరిలో శస్త్ర చికిత్స జరిగింది. నా కాలేయంలో 75శాతాన్ని అమ్మకు అమర్చారు. ఇక తనకు నయం అవుతుందనుకున్నాం. తీరా సర్జరీ జరిగిన నాలుగు నెలల్లోనే అమ్మకు అనారోగ్యం తిరగబెట్టి, మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయింది. దాంతో మా జీవితం తలకిందులైంది. అమ్మ లేని లోటు తెలియకుండా చూడాల్సిన నాన్నే మమ్మల్ని వదిలేసి రెండోపెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకున్నాడు. నా సోదరి, నేను ఒంటరివాళ్లమయ్యాం’ అని గుర్తు చేసుకుంటారు అంకిత.
మంచాన పడ్డా..
కాలేయ దానమిచ్చిన తర్వాత అంకిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దానికి కుంగుబాటు తోడై ఏడాది వరకు కోలుకోలేకపోయారు. ‘అమ్మ జీవితంలో మరో నాలుగునెలల కాలాన్ని పెంచగలిగాననే ఆనందం మాత్రం ఇప్పటికీ ఉంది. స్కూల్‌లో చదివేటప్పుడు ఈత, బాస్కెట్‌బాల్‌లో జాతీయస్థాయి క్రీడాకారిణిని. అమ్మ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి తిరిగి క్రీడలే మార్గమనిపించింది. కానీ శస్త్రచికిత్స తర్వాత క్రీడల్లో అడుగుపెట్టగలనా అనే సందేహం. అవయవదానం చేసినవారికి, తీసుకున్నవారికి ప్రపంచస్థాయి క్రీడాపోటీలుంటాయని గుండెను దానంగా అందుకున్న ఒకామె చెప్పారు. అది విన్నాక సంకల్పం ఉంటే సాధించొచ్చు అనిపించింది’ అంటారీమె.
ఆరు గంటలు..
రోజుకి ఫిట్‌నెస్ కోసమే అంకిత ఆరు గంటలు శ్రమించేవారు. ‘అవయవదాతలు పోటీల్లో పాల్గొనాలంటే చాలా కష్టపడ్డాలి. శారీరక వ్యాయామంతోపాటు ఆహారపరంగా జాగ్రత్తలెన్నో తీసుకోవాలి. భోపాల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో ఉదయం, సాయంత్రం వ్యాయామాలు, సాధన చేసేదాన్ని. ఆర్థిక ఇబ్బందులను దాటడానికి ఒక యానిమేషన్ సంస్థలో ఉద్యోగానికీ చేరానని’ చెప్పే అంకిత 2019లో లండన్‌లో జరిగిన వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ లాంగ్ జంప్, బాల్ త్రోలో రెండు ప్రపంచరికార్డులు సాధించి సత్తా చాటారు. ఐపీ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌లో సీరియల్ ఆంత్రప్రెన్యూర్‌గా మారారు. ఎయిర్‌ఫిట్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ స్టార్టప్‌కు పనిచేస్తున్నారు. నేషనల్ స్పోర్ట్స్ టైమ్స్ అవార్డు-2019 అందుకున్నారు అంకిత. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రీడ, మాతాశిశు అభివృద్ధి, ఆరోగ్యవిభాగాలకు బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఆర్గాన్ ఇండియా, నోట్టో, రోట్టో వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ అవయవదానంపై అవగాహన కలిగిస్తున్నారు. టెడెక్స్ వేదికగా స్ఫూర్తి ప్రసంగాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.