margaret helen shepherd: మధుమేహంపై పోరుబాట..
మధుమేహం ముదిరినప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం చూస్తూనే ఉంటాం. రోగ నిర్ధరణ సరిగా ఉంటే చాలామందికి ఆ అవసరం ఉండదు అంటారు లండన్‌కి చెందిన మార్గరెట్ హెలెన్ షఫర్డ్. మధుమేహానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రతిష్ఠాత్మక ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్’ అవార్డుతోపాటు రూ.2 కోట్ల నగదు బహుమతినీ అందుకున్నారు..
మధుమేహం ముదిరినప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం చూస్తూనే ఉంటాం. రోగ నిర్ధరణ సరిగా ఉంటే చాలామందికి ఆ అవసరం ఉండదు అంటారు లండన్‌కి చెందిన మార్గరెట్ హెలెన్ షఫర్డ్. మధుమేహానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రతిష్ఠాత్మక ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్’ అవార్డుతోపాటు రూ.2 కోట్ల నగదు బహుమతినీ అందుకున్నారు..
మార్గరెట్‌కి చిన్నప్పట్నుంచీ రోగులకు సేవలందించడమే ఆశయం. లండన్ లండన్‌లోని కింగ్స్ కాలేజీలో నర్సింగ్ చేసి, జనరల్ నర్సుగా ఓ ప్రభుత్వాసుపత్రిలోని డయాబెటిస్ వార్డులో ఎనిమిదేళ్లు పనిచేశారీమె. ‘మధుమేహంతో ఇక్కడికి పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వస్తుంటారు. అందులో ఇన్సులిన్ వాడేవారే ఎక్కువ. ఈ విషయాన్ని లోతుగా తెలుసుకోవాలని డయాబెట్స్ జెనెటిక్స్ రిసెర్చ్ టీంలో 1995లో చేరా. మధుమేహంలో జన్యువుల పాత్రని తెలుసుకోవడం కోసం మెడికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ, జెనెటిక్ కౌన్సెలింగ్‌లోనూ కోర్సులు చేశా. జెనెటిక్ డయాబెటిస్‌పై నా పరిశోధనా ఫలితాలు ప్రముఖ నర్సింగ్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. మధుమేహంపై పరిశోధనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న వారందరినీ ఒకే వేదికపై తీసుకురావాలని 2002లో ఒక నెట్‌వర్క్‌ను ప్రారంభించా’అంటున్నారు మార్గరెట్.
పరీక్షలు చేయించుకుంటే..
‘మధుమేహానికి సంబంధించి మొత్తం 33 రకాల జన్యువులుంటే వీటి కారణంగా పలురకాలైన మధుమేహాలు వస్తుంటాయి. సరిగా వ్యాధినిర్ధరణ చేస్తే అందరికీ ఇన్సులిన్ అవసరం ఉండదు. ఆరు నెలల్లోపు శిశువులకు వచ్చేది నియోనాటల్ డయాబెటిస్. వీరికి టాబ్లెట్‌ను వినియోగిస్తే చాలు. వారి శరీరానికి కావాల్సిన ఇన్సులిన్‌ను తయారుచేసుకొనేలా రక్తంలో చక్కెర స్థాయులను ఇదే స్థిరీకరిస్తుంది. అయితే ఏ రకమైన మధుమేహమో ముందుగా గుర్తించగలగాలి. ఓసారి చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్న 43 ఏళ్ల మహిళను జెనెటిక్ టెస్ట్ చేయించుకోమని సూచించా. వైద్యుల సలహా మేరకు ఆమె ఇన్సులిన్ వినియోగించడం మానేసి, ట్యాబ్లెట్ మాత్రమే తీసుకుంటోంది. ఇలా 80శాతానికి పైగా కేసుల్లో సరైన నిర్ధరణ లేదు. మోనోజెనిక్ డయాబెటిస్ ఉన్నవారిలో సరైన రోగ నిర్ధరణ లేక టైప్1, టైప్2 డయాబెటిస్‌గా భావించి చికిత్సనిస్తున్నారు. దీనిపై అందరిలో అవగాహన మరింత పెరగాలి. నా పరిశోధనలో లక్షల మందిని పరిశీలించా. ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించిన వైద్యులను సంప్రదించి అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నాన’ని చెప్పే మార్గరెట్ ఈ అధ్యయానికి ‘ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫౌండేషన్ లీడర్‌షిప్ స్కాలర్‌షిప్’ కూడా అందుకున్నారు. ప్రస్తుతం రాయల్ డేవన్ యూనివర్శిటీ హెల్త్‌కేర్‌లో విధులు నిర్వహిస్తున్న మార్గరెట్ లండన్‌లో మోనోజెనిక్ డయాబెటిస్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు సలహాదారు అయ్యారు. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ సంస్థ రోగుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన వారికి ఏటా అవార్డునందించి గౌరవిస్తుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 202 దేశాలకు చెందిన 50 వేలమంది నర్సులు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.