Published : 16/09/2021 16:17 IST

జీవచ్ఛవంలా బతికే బదులు చనిపోవడం మేలన్నారు!

(Photo: Instagram)

కాళ్లకు చక్రాలున్నట్లు నిత్యం ఉరుకులు పరుగులు పెట్టే ఆమెను ఓ ప్రమాదం శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. ఆరేళ్ల పాటు ఆస్పత్రిలోనే గడిపేలా చేసి.. తన జీవితాన్ని మరింత శూన్యంలోకి నెట్టాలనుకుంది. అయితే ఆమె అందుకు అవకాశమివ్వలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. బ్యాంకు మేనేజర్‌గా, క్రీడాకారిణిగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమే జైపూర్‌కు చెందిన శతాబ్ది అవస్థి. ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం తలవంచక తప్పదంటోన్న ఆమె.. తన స్ఫూర్తిదాయక ప్రయాణంలోని కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ప్రముఖ సోషల్‌ మీడియా బ్లాగ్‌ ద్వారా పంచుకుంది.

 

‘ఇంకెప్పుడూ నడవలేవు’ అన్నారు!

‘నేను చిన్నప్పటి నుంచి హైపర్‌ యాక్టివ్. కాళ్లు ఒక్కచోట స్థిమితంగా ఉండేవి కావు. అందుకేనేమో అమ్మానాన్నలు దేశంలో అత్యంత వేగంగా నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు పేరును నాకు పెట్టారు. చదువుకునే వయసులో నేను ఆర్మీ ఆఫీసర్‌ అవ్వాలని కలలు కనేదాన్ని. అయితే 21 ఏళ్ల వయసులో జరిగిన ఓ ప్రమాదం నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. దురదృష్టవశాత్తూ టెర్రస్‌పై నుంచి పడిపోవడంతో అమ్మానాన్న నన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 5 గంటలయ్యాక కానీ స్పృహ రాలేదు. అప్పుడు డాక్టర్లు ‘ప్రమాదంలో నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. ఇక జీవితంలో నడవలేవు’ అన్నారు. ఆ మాటలతో నా ప్రపంచం మొత్తం కూలిపోయినట్లు అనిపించింది. తీవ్ర విషాదంలో మునిగిపోయాను.

 

వాళ్ల మాటలు మరింత గాయపరిచాయి!

ప్రమాదం తర్వాత నా పరిస్థితి దీనాతిదీనంగా మారిపోయింది. ఇతరుల సాయం లేకుండా నా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోయాను. చాలా సిగ్గుగా అనిపించింది. క్రమంగా నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అలాంటి సమయంలో మాకు అండగా నిలవాల్సిన బంధువులు సూటిపోటి మాటలతో మరింత ఇబ్బంది పెట్టారు. ‘ఇలాంటి కూతురు వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు.. ఇలాంటి దీనస్థితిలో ఉండడం కంటే చనిపోవడమే మంచిది’ అని వారు అమ్మానాన్నలతో చెప్పిన మాటలు నా మనసును మరింత గాయపరిచాయి. అయితే నా కుటుంబం మాత్రం నాకు అండగా నిలిచింది. ‘మా కూతురుకు మంచి భవిష్యత్తు ఉంది. జీవితంలో ఏదో ఒకటి సాధిస్తుంది’ అని అమ్మానాన్నలు బంధువులతో చెప్పేవారు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల వరకు ఆస్పత్రే నా ఇల్లుగా మారిపోయింది. ఆస్పత్రి బిల్లులు కట్టడానికి బంధువుల దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. అమ్మకు వచ్చే పెన్షన్‌ డబ్బులు కూడా నా వైద్యానికే ఖర్చయ్యేవి.

 

ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నా!

ఇవన్నీ చూస్తూ చూస్తూ నేను మానసికంగా మరింత దృఢంగా మారిపోయాను. చికిత్స పూర్తయ్యాక ‘ఈ దుర్ఘటనకు నా జీవితాన్ని చీకటి చేసే అవకాశం ఇవ్వకూడదు’ అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. నన్ను నేను నిరూపించుకోవడం కోసం బ్యాంక్‌ పరీక్షలకు ప్రిపేరయ్యాను. మొదటి ప్రయత్నంలోనే మేనేజర్‌గా ఉద్యోగం తెచ్చుకున్నాను. ‘ఇప్పుడు నేను మేనేజర్‌ తండ్రిని’ అంటూ గర్వంగా చెప్పుకొని నాన్న మురిసిపోయారు. అప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు. కానీ నా సంతోషాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో..! హార్ట్ అటాక్‌ కారణంగా ఉద్యోగం వచ్చిన ఆరు నెలల్లోపే నాన్న కన్నుమూశారు. ఆయన మరణం నా మనసును బాగా కుంగదీసింది. నేను మేడ మీద నుంచి పడినప్పుడు కూడా అంతటి బాధను అనుభవించలేదు. అప్పుడే మానసిక ప్రశాంతత కోసం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. అదేవిధంగా దేశానికి పేరు తీసుకొచ్చేలా నా వంతుగా ఏదైనా చేయాలనుకున్నా.

 

ఆమె స్ఫూర్తితో..!

టీవీల్లో పారాలింపిక్స్‌ చూసిన నేను పారా అథ్లెట్ దీపా మాలిక్‌ను చూసి స్ఫూర్తి పొందాను. ‘ఆమె సాధించినప్పుడు నేను కూడా సాధించగలను’ అని మనసులో గట్టిగా సంకల్పించుకున్నా. దీపలాగే నేనూ క్రీడల్లో రాణించాలనుకున్నా. అలా 31 ఏళ్ల వయసులో షాట్‌పుట్‌, జావెలిన్ త్రో, డిస్కస్‌ త్రోలో శిక్షణ తీసుకున్నా. రోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ప్రాక్టీస్‌ మొదలుపెట్టేదాన్ని. 9-6 గంటల మధ్య ఆఫీస్‌... ఆ తర్వాత మళ్లీ ఇంటికి వచ్చి సాధన చేసేదాన్ని. శిక్షణ ప్రారంభంలో కాస్త కష్టమనిపించినా... వెనకడుగు వేయలేదు. రాష్ట్ర స్థాయి పోటీల కోసం మరింత కఠినంగా సాధన చేశాను. నా శ్రమకు తగ్గట్లుగానే ఆ టోర్నీలో షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో, డిస్కస్‌ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాను. నా విజయాలను చూసి అమ్మ మురిసిపోయింది. ‘నాన్న బతికుంటే ఎంతో సంతోషించే వారని’ అమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నాన్న లేని లోటు మాకు తీర్చలేనిది. అందుకే ఆయనను ఎప్పుడూ మిస్సవుతుంటాం.

 

‘నా తలరాత ఇంతే’ అనుకోలేదు!

‘ఇలాంటి అమ్మాయి బతికుండి ఏం ప్రయోజనం’ అన్న వారికి.. న్యూస్‌ పేపర్లలో నా విజయాల గురించిన వార్తలు, కథనాలే సరైన సమాధానం. ప్రస్తుతం నేను 2022లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల కోసం సాధన చేస్తున్నాను. ఈ పోటీల్లో బంగారు పతకం తీసుకురావడమే నా లక్ష్యం. ఒకే ఒక్క దుర్ఘటన నన్ను జీవచ్ఛవంలా మార్చింది. ఆరేళ్ల పాటు ఆస్పత్రిలో ఉండేలా చేసింది. అయితే నన్ను పూర్తిగా విచ్ఛిన్నం చేసే అవకాశం మాత్రం నేను ఇవ్వలేదు. ‘నా తలరాత ఇంతే’ అని సరిపెట్టుకోకుండా ముందుకు అడుగేశాను. చక్రాల కుర్చీలోనే కూర్చొని నా కలలు, ఆశయాలను నెరవేర్చుకుంటున్నాను..’ అని అంటోందీ సూపర్‌ ఉమన్.

విధి వంచితులైన ఎంతోమందికి అవస్థి జీవితం స్ఫూర్తిదాయకం!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని