Potineni padmaja bala: దాని కోసం.. ద్రోణాచార్య వదులుకున్నా!

కబడ్డీలో జాతీయస్థాయి క్రీడాకారిణి.. మట్టిలో మాణిక్యాలైన ఎందరో అమ్మాయిలను ఆటలో మెరికలుగా తీర్చిదిద్దిన శిక్షకురాలు. అంతకుమించి.. పనిచేసే చోట లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ధీశాలి.. పోతినేని పద్మజా బాల.

Published : 29 May 2023 00:11 IST

కబడ్డీలో జాతీయస్థాయి క్రీడాకారిణి.. మట్టిలో మాణిక్యాలైన ఎందరో అమ్మాయిలను ఆటలో మెరికలుగా తీర్చిదిద్దిన శిక్షకురాలు. అంతకుమించి.. పనిచేసే చోట లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ధీశాలి.. పోతినేని పద్మజా బాల. వంకర చూపులు, తప్పుడు మాటలు, అసభ్య చేష్టలతో తనను వేధించిన కీచకులపై ఏళ్లతరబడి ఒంటరిగా పోరాడి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె. తనని వసుంధర పలకరించింది..

అంతర్జాతీయ స్థాయిలో ఎంపికవ్వడం.. ద్రోణాచార్య అవార్డు అందుకోవడం ఏ కోచ్‌కైనా కలే! కానీ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌లో కొందరి వికృత చేష్టల కారణంగా ఏషియన్‌ గేమ్స్‌కి కోచ్‌నయ్యే అవకాశాన్నీ, ఆత్మాభిమానాన్ని ఫణంగా పెట్టలేక ద్రోణాచార్య అవార్డునూ వదులుకున్నా. మాది విజయవాడ దగ్గర పునాదిపాడు. ఇంటర్‌లో సీనియర్‌ స్ఫూర్తితో కబడ్డీలోకి వచ్చా. కాలేజీ తరపున ఆడిన తొలిమ్యాచ్‌లోనే రాణించడంతో రాష్ట్ర జట్టులో త్వరగా అవకాశమొచ్చింది. మా జట్టు జిల్లా నుంచి జాతీయస్థాయి వరకూ ఎన్నో పతకాలు అందుకుంది. ఆట మీదున్న ఇష్టంతో దాన్నే కెరియర్‌గా ఎంచుకున్నా. బెంగళూరు ఎన్‌ఐఎస్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌)లో కోర్సు చేసి, 1987లో ‘సాయ్‌’ కోచ్‌గా ఏలూరులో చేరా.

ఒక్కమాట అడగలేదు

మైదానంలో అడుగుపెట్టాక ఎన్నో సవాళ్లు. ‘కబడ్డీ ఆడవాళ్ల ఆట కాదు. మీరు మగవాళ్లలా ఆడలేరు...’ అనేవారు. ఓసారి సాయ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మా కేంద్రానికి వచ్చారు. అతని చూపూ, మాటా ఇబ్బందిపెట్టేవి. ఓరోజు గెస్ట్‌హౌస్‌లో డిన్నర్‌కి పిలిస్తే కుదరదని గట్టిగానే చెప్పా. అహం దెబ్బతిందేమో! నాపై అధికారులకు లేనిపోని ఫిర్యాదులు చేశాడు. వాళ్లూ ఒక్కమాటా అడగకుండా సస్పెండ్‌ చేశారు. ఏం జరిగిందో తెలియక నాలుగు నెలలు మానసికంగా నలిగిపోయా. బదిలీపై వచ్చిన కొత్త అధికారి తిరిగి విచారణ చేసి పోస్టింగు ఇచ్చారు. అలా మొదలైంది నా పోరాటం. తర్వాత వరంగల్‌కి బదిలీ! అక్కడా తోటి కోచ్‌లు సహకరించేవారు కాదు. ఆటతో సంబంధం లేనివాళ్లు మైదానంలో పెత్తనం చేసేవారు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవారు. నా వద్ద శిక్షణకి వచ్చిన ఇతర ప్రాంతాల వాళ్లకి టీసీలు ఇవ్వకుండా, జట్లకు ఎంపిక చేయకుండా వేధించేవారు. ఇలాంటివెన్నో ఎదుర్కొంటూనే పదేళ్లలో వరంగల్‌ని మొదటిస్థానంలో నిలిపా.

తొమ్మిదేళ్లలో మూడు..

ఆపై మెదక్‌ వెళ్లా. అకౌంట్స్‌లో పనిచేసే అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. నా గురించిన ఆరాలు, మైదానానికి రావడం, సమావేశాల్లో చెడుగా మాట్లాడటం.. వంటివెన్నో చేసేవాడు. వ్యక్తిత్వం మీద మచ్చపడుతుందని ఎదురు తిరిగితే అతనితో పోరాటమే చేయాల్సి వచ్చింది. ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే అధికారులకు కంప్లైంట్‌ ఇచ్చాడు. రెండింటినీ విచారించడానికి కమిటీ ఏర్పాటైంది. వాళ్లేమో నెలకి రెండుమూడుసార్లు బెంగళూరు పిలిపించేవారు. ఇలా సంవత్సరాలు గడిచాయి, పదోన్నతీ ఆగింది. అయినా ఓర్పుగా భరించా. చివరికి తప్పు ఆ వ్యక్తిదేననీ, అతని ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. అతనేమో ‘కమిటీ సరిగా పనిచేయలేదు.. మరోదాన్ని ఏర్పాటు చేయమ’ని కోరాడు. రెండేళ్ల విచారణ తర్వాత అదీ నాకు అనుకూలంగా రిపోర్టిచ్చింది. అయినా ఇంకో ఎంక్వయిరీ కోరడంతో.. తొమ్మిదేళ్లలో మూడు కమిటీలు నన్ను విచారించాయి. చివరికి మహిళా డైరెక్టరు చేరాక వీఆర్‌ఎస్‌ ఇచ్చి అతన్ని, మరో నలుగురినీ విధుల్లోంచి తప్పించారు. కానీ అతను కోర్టుకి వెళ్లాడు. విజయవాడకు బదిలీ అయినా.. కోర్టు తిరుగుళ్లు తప్పలేదు. ఈ వేధింపులు పదవీ విరమణ అయ్యేవరకూ కొనసాగాయి. ‘భార్యాపిల్లలు ఉన్నవాడు, మానవత్వంతో శిక్ష తగ్గించ’మని కోర్టు తీర్పిచ్చినా.. ఆడవాళ్లను ఇబ్బంది పెట్టినవాళ్లని క్షమించలేమని మా డిపార్ట్‌మెంట్‌ హైకోర్టులో కేసేసింది. అతనింకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఫెడరేషన్లలో తిష్ఠవేసిన ఇలాంటి వాళ్లనుంచి ఎదుర్కొన్న ఇబ్బందులెన్నో. 33 ఏళ్లలో నన్ను కాపాడుకుంటూనే మరెందరో ఆడపిల్లలకు అండగా నిలబడగలిగానన్న సంతృప్తితోనే ముందుకు సాగుతున్నా. ఏ రంగంలోనైనా ఇలాంటి వేధింపులుంటాయి. వెన్ను చూపకుండా పోరాడమనే నా సలహా.

- గీతాన్విక

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్