priyanka Mallik: బ్రిటిష్‌ రాజ దంపతుల్ని మెప్పించింది

ఫ్యాషన్‌ డిజైనర్లు తమ సృజనాత్మకతతో అందరి ప్రశంసలూ పొందాలని కలలు కంటారు. ప్రియాంక మల్లిక్‌ మాత్రం తన డిజైన్లతో ఏకంగా బ్రిటన్‌ రాజు, రాణితోనే శభాష్‌ అనిపించుకుంది.

Updated : 07 May 2023 08:17 IST

ఫ్యాషన్‌ డిజైనర్లు తమ సృజనాత్మకతతో అందరి ప్రశంసలూ పొందాలని కలలు కంటారు. ప్రియాంక మల్లిక్‌ మాత్రం తన డిజైన్లతో ఏకంగా బ్రిటన్‌ రాజు, రాణితోనే శభాష్‌ అనిపించుకుంది. మారుమూల కుగ్రామం నుంచి బకింగ్‌హాం ప్యాలెస్‌కు కొనసాగిన ఈమె ప్రయాణం...

పశ్చిమ్‌బంగలోని మారుమూల గ్రామం బదినాన్‌ ప్రియాంక వాళ్లది. చిన్నప్పటి నుంచి దుస్తుల డిజైనింగ్‌పై ఆసక్తి. దీంతో ఇంటర్‌ తర్వాత ఇటలీ మిలన్‌ విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్‌ డిజైన్‌లో మాస్టర్స్‌ చేసింది. ఆ తర్వాత డిజైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టి తన సృజనాత్మకతతో రాణిస్తోంది. ‘రాజకుటుంబానికి దుస్తులు రూపొందించాలనే ఆలోచన ఉండేది. ఎప్పటికైనా రాజు, రాణిని నా డిజైన్స్‌లో చూడాలని కలలు కనేదాన్ని. అలా ఓసారి ఆ కుటుంబానికి దుస్తులు తయారు చేసే ఏజన్సీని సంప్రదించా. వారు పరిశీలిస్తామనడంతో నా డిజైన్లు పంపా. వాటిలో రాణికి ఎరుపు వర్ణంలో గులాబీ నమూనాతో చేసిన గౌను, రాజు కోసం చేసిన బటర్‌ఫ్లై బ్రూచ్‌ నచ్చాయని మెయిల్‌ వచ్చింది. ప్రశంసాపత్రంలా వచ్చిన ఆ మెయిల్‌ చూసి మొదట నమ్మలేకపోయా. ఇంకా విశేషమేంటంటే లండన్‌లో జరిగిన పట్టాభిషేక మహోత్సవానికి కెమెల్లా నేను డిజైన్‌ చేసిన గౌను, ఛార్లెస్‌ బ్రూచ్‌ ధరించి హాజరు కానున్నట్లు తెలిసింది. ఆ ఉత్సవానికి రమ్మని ఆహ్వానమూ పంపారు. ఇదంతా కలలాగా అనిపిస్తోంది. అయితే అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోవడం బాధగా ఉంది. అయినా నాకల నెరవేరిందని చాలా సంతోషంగా ఉందం’టున్న ప్రియాంకను కోల్‌కతా బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నైనా పాల్గొనమని ఆహ్వానించారు.

ఇబ్బందులెన్నో...

కెరియర్‌లో అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే ప్రియాంక తన సృజనాత్మకతతో పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించింది. ‘మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అంతర్జాతీయ డిజైనర్స్‌ గురించి తెలుసుకొనేదాన్ని. సమస్యలను దాటి విజేతలుగా నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకోవడం మొదలుపెట్టా. దాంతో విద్యార్థి దశలో ఉన్నప్పుడే 2019లో మిలన్‌లో ‘ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌’ అవార్డు అందుకోగలిగా. అది ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది. తర్వాత సొంత బ్రాండ్‌ ప్రారంభించా. ఇటలీలో 2020లో జరిగిన ‘స్టైలిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోటీలో అవార్డు అందుకొన్నా. మన దేశంలో గతేడాది ‘రియల్‌ సూపర్‌ వుమెన్‌’ అవార్డు దక్కించుకోగలిగా. కలలు కనండి. మనసు చెప్పిందే వినండి. విమర్శలెన్నెదురైనా పట్టించుకోకుండా, నచ్చిన మార్గంలో అడుగులేస్తే చాలు. శ్రమించే తత్వం, కృషితోపాటు స్మార్ట్‌గా చేసే పనేదైనా మనల్ని విజయంవైపు నడిపిస్తుంద’ని చెబుతున్న ప్రియాంక ఐక్యరాజ్యసమితి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్ఫూర్తిదాయకంగానూ నిలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్