Tami munnisa jabbar: అమ్మాయిల్ని గ్రౌండులో చూడాలనుకున్నా..
మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల్ని ఇప్పటికీ బయటికి రానివ్వరు. అలాంటిది కొంత మంది అమ్మాయిలకి ఫుట్‌బాల్‌లో శిక్షణనిస్తూ వారితో గోల్స్ కొట్టిస్తున్నారు.. ఓ మహిళ. సంప్రదాయాల గోడలు బద్దలు కొట్టి వారికి స్వేచ్ఛనివ్వాలనే సంకల్పంతో ఫుట్‌బాల్‌ను ఆడిస్తున్నారు.
మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల్ని ఇప్పటికీ బయటికి రానివ్వరు. అలాంటిది కొంత మంది అమ్మాయిలకి ఫుట్‌బాల్‌లో శిక్షణనిస్తూ వారితో గోల్స్ కొట్టిస్తున్నారు.. ఓ మహిళ. సంప్రదాయాల గోడలు బద్దలు కొట్టి వారికి స్వేచ్ఛనివ్వాలనే సంకల్పంతో ఫుట్‌బాల్‌ను ఆడిస్తున్నారు.. ఆవిడే చెన్నైకి చెందిన తమీమున్నీసా జబ్బర్..
మున్నీసాది చెంగల్ పేట. 1997లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఈమె ఫుట్‌బాల్ వైపు అడుగులేశారట. ఆట ప్రారంభించిన రెండేళ్లలోపే కాంచీపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గెలిచారు. కానీ 1999లో ఊటీలో జరిగిన తమిళనాడు రాష్ట్ర టోర్నమెంట్‌లో ఆడేందుకు మాత్రం ఇంట్లో వాళ్లతో ఓ చిన్నపాటి యుద్ధమే చేశారామె. ఆడపిల్ల బయటికెళ్లి ఆటలాడితే అంతా ఏమనుకుంటారోనని భయపడ్డారు ఆమె తల్లిదండ్రులు. చివరకు ఆమె పట్టుదల చూసి ఒప్పుకోక తప్పలేదు. ‘ఆ టోర్నమెంట్‌లో నేను గెలిచాను. ‘లేడీ భైచంగ్ భుటియా’ అనే బిరుదిచ్చారు. పత్రికలో నా వార్త చదివిన నాన్న చాలా సంతోషించారు. నువ్వు ఈ స్థాయిలో నిలబడినందుకు నాకు చాలా గర్వంగా ఉందన్నారు. అయినా సరే 18 ఏళ్లు రాగానేే వివాహం చేశారు. ఈ వెనుకబడిన ప్రాంతంలోని అమ్మాయిలకు ఏదో ఒక దారి చూపించాలనుకున్నాను. అలా ఎమ్‌డబ్ల్యూఏ పాఠశాలలో కోచ్‌గా, పీఈటిగా చేరాను. నాకు తెలిసిన విద్యనే వారికి నేర్పేందుకు ఓ అడుగు ముందుకేశా. పాఠశాల విద్యార్థినులకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇవ్వటం ప్రారంభించా.
పౌష్టికాహారాన్ని అందిస్తూ..
మా ప్రాంతంలో ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తారు. మొదట్లో నాతో పంపేవారు కాదు. అమ్మాయిల రక్షణకు ఎటువంటి భంగం కలగదని, చదువులో, పరీక్షల్లో ముందుండి నడిపిస్తానని ధైర్యం చెప్పాను. ఇలా శిక్షణ తీసుకున్న వారు రెండింటిలో విజయాలు సాధించటం గమనించారు వారి తల్లిదండ్రులు. ఇప్పుడు వారి పిల్లలకి కోచింగ్ ఇప్పించేందుకు వారే ధైర్యం చేస్తున్నారు. ఒక వేళ ఆ అమ్మాయిలు భయపడినా అమ్మానాన్నలే ప్రోత్సహించి కోచింగ్‌కు పంపిస్తున్నారు. అయినా కొంతమంది ఇతర రాష్ట్రాలకు టోర్నమెంట్ ఆడేందుకు పిల్లల్ని పంపించాలంటే భయపడేవారు. మరికొందరు అమ్మాయిలు ఎండలో ఆడితే నల్లగా అయిపోతారనేవారు’ అంటారీమె. మున్నీసా దగ్గర కోచింగ్ తీసుకుంటున్న అమ్మాయిల్లో చాలామంది పేదవాళ్లే. పోషకాహారం అందించే స్థోమతా లేదు. అది గమనించిన మున్నీసా వారికోసం తన ఇంటి నుంచే మంచి పోషకాహారాన్ని కూడా వండి తీసుకెళ్తుంటారు.
‘ప్రస్తుతం నా దగ్గర ఉన్న అమ్మాయిలంతా 18 ఏళ్లలోపు వాళ్లే, కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే 21 సంవత్సరాలున్న షమ్నారెహమన్. ఇప్పుడీమె ఇంకొంత మందికి శిక్షణ ఇస్తోంది. నా తర్వాత ఈ కోచింగ్ అకాడమీని షమ్నానే ముందుకు తీసుకెళ్తుంద’ంటున్నారు మున్నీసా. ‘ కుటుంబం, సమాజం ఆడపిల్లలు ఆటల్లో పాల్గొనటాన్ని ఒప్పుకోలేదు. కానీ మీరు దేశం తరఫున ఆడి గెలిస్తే అప్పుడు మిమ్మల్ని అందరూ అభినందిస్తారు. తలెత్తుకొని గర్వంగా నేనొక ఫుట్‌బాల్ ఛాంపియన్‌ను అనిచెప్పుకోవచ్చు. అప్పుడు ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసేందుకు ఉరకలేస్తుంద’ంటారీమె. తక్కువ వ్యవధిలోనే అమ్మాయిలను ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దడం ఈమెకి కొత్త విషయమేమీ కాదు. అలాంటి మున్నీసా కథ మనందరికీ స్ఫూర్తిదాయకమే కదా...
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.