Vaishali kulkarni more: అయిదు పదుల వయసులో బైక్ రైడింగ్
ప్రతి అమ్మాయికీ కలలున్నా.. అందరికీ అవి నెరవేరవు. పెళ్లయ్యాక, తల్లిగా మరో ప్రపంచం. అలానే తన కలలన్నీ అలవోకగా పక్కన పెట్టారావిడ.
ప్రతి అమ్మాయికీ కలలున్నా.. అందరికీ అవి నెరవేరవు. పెళ్లయ్యాక, తల్లిగా మరో ప్రపంచం. అలానే తన కలలన్నీ అలవోకగా పక్కన పెట్టారావిడ. అమ్మగా బాధ్యతలు నెరవేర్చాక.. తన కలల్ని సాకారం చేసుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన వైశాలి కులకర్ణి మోరే. ఆ అమ్మ వసుంధరతో పంచుకున్న అనుభూతులివీ..
ఇంటర్‌లో ఫ్రెండ్స్ కొందరు బైక్‌తో విన్యాసాలు చేస్తుంటే నాకూ నేర్పించమన్నా. ‘నువ్వు అమ్మాయివి. నీకెందు’కన్నా.. బతిమాలితే నేర్పించారు. ఆ విషయం నాన్నకి తెలిసి కొట్టారు. మళ్లీ అటువైపు చూడలేదు. ఆ తర్వాత పెళ్లి, బాబు. మావారు నేవీలో పని చేసేవారు. చిన్నపిల్లలకు పాఠాలు చెబుతూ.. బీఎడ్, ఎంఎడ్ పూర్తిచేశా. బాబు నేవీలో చేరాడు. మా 25వ పెళ్లిరోజుకి 2015లో మావారు, బాబు కలిసి నాకిష్టమైన ద్విచక్ర వాహనం కొన్నారు. 220 సీసీ బజాజ్ అవెంజర్స్ అది. 47 ఏళ్ల వయసులో తిరిగి బైక్ నడపడానికి భయమేసింది. వైజాగ్ నుంచి షిర్డీ.. నా తొలి యాత్ర. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రకాణి పాస్‌ను అధిరోహించా. ఫిట్‌గా ఉండటం కోసం రోజూ 10 కిలోమీటర్లు నడుస్తా. వ్యాయామం, ఈత, సైక్లింగ్ చేస్తుంటా. దక్షిణ భారతంతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ్ బంగ ఇలా 20 రాష్ట్రాలు తిరిగి 50 వేల కి.మీ పైగా పూర్తి చేశా. జాతీయ రహదారుల కన్నా గ్రామీణ ప్రాంత రోడ్లనే ఎంచుకుంటా. హోటళ్లలో బస చేయను. గ్రామాల్లో, రోటరీ, బైకర్స్ క్లబ్‌ల సభ్యులకు తెలిసిన వారిళ్లలో రాత్రుళ్లు నిద్రపోతా. ఓసారి రైల్వే స్టేషన్ నుంచి వాహనం తెచ్చుకుంటూ ట్రాక్‌పై పడిపోయాను. కాలికి ఏడు చోట్ల ఫ్యాక్చర్ అయింది. ఏడాదిన్నర బండి తీయలేకపోయా.
ఉమెన్ క్లబ్ ప్రారంభం...
మా నాన్న క్యాన్సర్‌తో చనిపోయాక అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో వాలంటీర్ కోర్సు చేశా. తొలి దశలోనే క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలో అక్కడ నేర్పించారు. గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సహకారంతో గ్రామాల్లో క్యాన్సర్ అవగాహన కల్పిస్తుంటా. నెలసరి సమయంలో జాగ్రత్తలు, మహిళా సాధికారత గురించి వివరిస్తా. పాఠశాలలో సరైన సదుపాయాలు లేకపోవడంతో రుతుస్రావం ప్రారంభమైన తర్వాత బాలికలు చదువు మానేసేవారు. అలాంటి వాళ్లకు బాలికా విద్య ప్రయోజనాలను వివరిస్తుంటా. వైజాగ్‌లో ఉమెన్ మోటార్ క్లబ్‌ను ప్రారంభించా. మెకానిక్ కోర్సు చేశాను. నా వాహనానికి సొంతంగా మరమ్మతులు చేసుకుంటా. బాలికలకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పిస్తున్నాం. ప్రపంచ యాత్ర చేయాలన్నది నా లక్ష్యం.
- కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.