Vijayalaxmi- Laxmi sujatha: సేంద్రియంతో.. కోట్లు కురిపిస్తున్నారు!

‘రైతే రాజు’ అన్నది ఒకప్పటి మాట. పండిన పంటని మార్కెటింగ్‌ చేసుకోలేని పరిస్థితే చాలామందిది. సేంద్రియ వ్యవసాయం చేస్తూనే అలాంటి ఎంతోమంది రైతులకు ఆసరాగా నిలుస్తున్నారు అక్కాచెల్లెళ్లు రామరాజు లక్ష్మీసుజాత, బద్దులూరి విజయలక్ష్మి.

Published : 15 May 2023 00:38 IST

‘రైతే రాజు’ అన్నది ఒకప్పటి మాట. పండిన పంటని మార్కెటింగ్‌ చేసుకోలేని పరిస్థితే చాలామందిది. సేంద్రియ వ్యవసాయం చేస్తూనే అలాంటి ఎంతోమంది రైతులకు ఆసరాగా నిలుస్తున్నారు అక్కాచెల్లెళ్లు రామరాజు లక్ష్మీసుజాత, బద్దులూరి విజయలక్ష్మి. తమ ఉత్పత్తులను విదేశాలకూ ఎగుమతి చేస్తూ రూ.కోట్ల వ్యాపారంగానూ మలిచారు.
ఆ ప్రయాణాన్ని లక్ష్మీసుజాత
వసుంధరతో పంచుకున్నారిలా..

రైతు కుటుంబం.. వ్యవసాయంపై ఆసక్తి సహజమే! పైగా అందరిలోనూ తినేది రసాయన రహిత ఆహారమేనా అన్న సందేహం. ఇవే సేంద్రియ వ్యవసాయంవైపు నడిపించాయి. మాది ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం. ఉద్యోగరీత్యా కొన్నేళ్లు హైదరాబాద్‌లో ఉన్నాం. ఓ ప్రైవేటు పాఠశాలకి ప్రిన్సిపల్‌గా చేశా. తర్వాత తిరిగి సొంతూరొచ్చి 2018లో సాగు మొదలుపెట్టాం. ఆలోచన 2012లోనే వచ్చింది. చెల్లితో పంచుకుంటే తనూ చేయి కలిపింది. మాకున్న పొలానికి కొంత సమకూర్చుకున్నాం. సాగు పద్ధతులు, వివిధ పంటలు, రైతుల ఇబ్బందులు తెలుసుకోవడం, హార్టికల్చర్‌, శాస్త్రవేత్తల సలహాలతో సహజ ఎరువులతో భూమిని సారవంతం చేసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. ఆడవాళ్లలో చిన్నవయసుకే అనారోగ్యాలు, రక్తహీనత వంటివి చూశాక దానిమ్మ పండించాలనుకున్నాం. పాతిక ఎకరాల్లో దానిమ్మ, పదెకరాల్లో జామ, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలు వంటివి వేశాం. మాకున్న పరిచయాలతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే ఇంటికీ, గ్రామాల్లో అమ్మడానికీ తీసుకెళ్లేవారు. మావారు ఐటీసీ ఉద్యోగి. దీంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లోని ప్రముఖ సంస్థలూ తీసుకెళ్లేవి. అలా మొదటి ఏడాదిలోనే లాభాలు చూశాం.

రైతుల కోసం..

పరిచయాలతో మాకు మార్కెటింగ్‌ సులువే! అది లేని రైతుల సంగతేంటి? అన్న ఆలోచనొచ్చింది. ‘పీజెంట్‌ ఎంపవర్‌మెంట్‌ సొసైటీ’ ప్రారంభించి.. చుట్టుపక్కల రైతులకు సేంద్రియ వ్యవసాయం, గిరాకీపై అవగాహనతోపాటు వారి పంటలను మార్కెటింగ్‌ కూడా చేసిపెడుతున్నాం. 200 మంది వరకూ రైతులు మాతో కలిసి నడుస్తున్నారు. సంఖ్యను 3వేలకు చేర్చాలన్నది కల. విదేశాలకూ ఎగుమతి చేయాలి, ఆడవాళ్లకి ఉపాధి కల్పించాలన్నది మొదట్నుంచీ మా లక్ష్యం. అందుకే ‘కావ్య ఆగ్రో’ ద్వారా పండ్ల ఉత్పత్తుల తయారీ ప్రారంభించాం. పండ్ల గుజ్జుతో జ్యూస్‌, జామ్‌, జెల్లీ తయారు చేసి విక్రయిస్తున్నాం. దీనికోసం ఆహార పదార్థాల ఉత్పత్తులు, నిల్వ, ప్యాకేజింగ్‌పై సూచనలిచ్చే ఫుడ్‌ టెక్నాలజీ విభాగ సలహాలు తీసుకున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 130కుపైగా మందికి ఉపాధి కల్పిస్తున్నాం. గతఏడాది మావ్యాపారం రూ.6కోట్ల పైమాటే!

సేవకీ కొంత..

సమాజసేవకీ ప్రాధాన్యమిస్తున్నాం. పేదపిల్లలను చదివించడం, వృద్ధాశ్రమాలకి ఇవ్వడం, అనారోగ్య సమస్యలకు వీలైనంత సాయం, ఐక్యాంప్‌ల నిర్వహణ.. పేద పిల్లలకు కంటి ఆపరేషన్లు వంటివి చేయిస్తున్నాం. తెల్లవారుజాము 4గం.లకే మారోజు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1గం.కల్లా చెల్లి, నేను ప్రతి మొక్కను పరిశీలించడమే కాదు.. కలుపు, ఎండిన ఆకులు, కొమ్మలు తీయించడం వంటివి చేస్తాం. మధ్యాహ్నం నుంచి కూరగాయల మొక్కలపై దృష్టిపెడతాం. పెద్దమొత్తంలోనే ప్రారంభించాలని ముందే నిర్ణయించుకున్నాం. అందుకే ఒకేదగ్గర ఉండేలా పొలం సమకూర్చుకున్నాం. దాచుకున్నది, బ్యాంకు లోను కలిపి రూ.2కోట్లు పెట్టుబడిగా పెట్టాం. చిన్నచిన్న సమస్యలు మాకూ వచ్చాయి. ఇష్టమైన పనికదా.. నేర్చుకుంటూ ఒక్కోటీ దాటుకుంటూ వచ్చాం. మేం చేసిందల్లా పాతవిధానాలకి సాంకేతికతను, నిపుణుల సాయాన్నీ జోడించడమే. ఇతర రైతులతో కలిసి 2500 ఎకరాల పంటని మార్కెటింగ్‌ చేస్తున్నాం. నాణ్యతను పాటిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చని చూపించాలనుకున్నాం. అమెరికా, ఆసియా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ఈఏడాది యూరోపియన్‌ దేశాలకీ చేయనున్నాం. ‘రైతే రాజు’ అనిపించాలి, అందరికీ ఆరోగ్యమైన ఆహారం అందించాలన్నది లక్ష్యం. 42 ఏళ్ల వయసులో ‘సేంద్రియ’ ఆలోచన చేశా. నాకు శక్తి ఉంది, నేను చేయగలను అనుకుంటే వయసు ఎప్పుడూ అడ్డుకాదు. ‘చేయగల’ననుకొని ప్రయత్నించాలంతే.. అప్పుడు ఎవరైనా సాధించగలరు! 

 - సంకబుడ్డి అనూష


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని