Sangeetha Pandey: నగలన్నీ తాకట్టు పెట్టా

సైనిక కుటుంబం ఈమెది. వివాహానంతరం సొంతంగా ఏదైనా సాధించాలనే ఆలోచనతో ప్యాకింగ్‌ బాక్సుల తయారీ మొదలుపెట్టి  విమర్శలెన్నెదురైనా వెనుకకు తిరగలేదు.

Updated : 12 Apr 2023 04:38 IST

సైనిక కుటుంబం ఈమెది. వివాహానంతరం సొంతంగా ఏదైనా సాధించాలనే ఆలోచనతో ప్యాకింగ్‌ బాక్సుల తయారీ మొదలుపెట్టి  విమర్శలెన్నెదురైనా వెనుకకు తిరగలేదు. కోట్ల రూపాయల ఆదాయాన్ని పొంది, మరెందరో మహిళలకు ఉపాధినీ కల్పిస్తున్న సంగీతా పాండే స్ఫూర్తి కథనమిది.  
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన ఈమె తండ్రి, ఇద్దరు సోదరులు సైనికులు. డిగ్రీ తర్వాత సంగీతకు వివాహమైంది. పాప పుట్టి, ఇంటి అవసరాలు పెరగడంతో ఓ సంస్థలో రూ.4వేల జీతానికి చేరారు. వెంట తన 9 నెలల పాపను కూడా తీసుకెళ్లేవారు. అయితే, పాపను చూసుకుంటూ ఉద్యోగం చేయడం కష్టమని యాజమాన్యం అభ్యంతరం చెప్పింది.  దాంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు సంగీత. ఇంట్లో చిన్నారిని చూసుకుంటూనే  సొంతంగా ఏదైనా చేయాలనుకున్నారు. అప్పుడే స్వీట్లు ప్యాకింగ్‌ బాక్సులపై ఈమె దృష్టి పడింది. వాటినే ఎందుకు తయారు చేయకూడదనుకున్నారు. తాను పొదుపు చేసిన రూ.1500ల పెట్టుబడితో 2004లో ‘సిద్ధి వినాయక ప్యాకేజర్స్‌’ ప్రారంభించారు. మొదట 100 బాక్సులు తయారుచేశారు. అయితే, వీటి ధర తన దగ్గర కన్నా మార్కెట్లోనే తక్కువ అని తెలియడంతో నష్టానికే అమ్మారు సంగీత.

తాకట్టుతో..

అట్టపెట్టెలను మార్కెట్‌ ధరకు అమ్మాలంటే ఖర్చు కూడా తగ్గాలని తెలిసిందంటారు సంగీత. ‘లఖ్‌నవూలో మెటీరియల్‌ తక్కువకే వస్తుందని తెలిసినా...వాటిని కొనుగోలు చేసేంత మొత్తం తన దగ్గర లేదు. డిస్ట్రిక్ట్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(డీయూడీఏ)లో రుణం కోసం ప్రయత్నించినా దొరకలేదు. నా నగలన్నింటినీ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.3 లక్షలతో లక్నో వెళ్లి, లారీ మెటీరియల్‌ కొనుక్కొచ్చా. ఆ తర్వాత ఆర్డర్ల కోసం పాత సైకిల్‌పై దుకాణాలన్నీ తిరిగినా తిరస్కరణ ఎదురయ్యేది. ఓసారి గోల్‌ఘర్‌లోనే అతిపెద్ద దుకాణదారుడు నన్ను పిలిచి, సమయానికి అర్డర్లు అందించడం చాలా కష్టమైన పని. నీవల్ల అవుతుందా అన్నారు. అక్కడి నుంచి ఒక బాక్సు తీసుకెళ్లి, ఛాలెంజ్‌గా అటువంటిదే తయారుచేసి చూపించా. అలా మొదటి ఆర్డరు అందుకున్నా’ అని చెబుతారీమె.

అందుకే పురస్కారం..

సంగీత తన పిల్లల అవసరాలు, ఇంటిపని పూర్తిచేసి, బాక్సుల తయారీ చూసుకొని సైకిల్‌పై దుకాణాలకు అందించేవారు. క్రమేపీ ఆర్డర్లు పెరిగాయి. ప్రస్తుతం ఈమె వద్ద 150మందికిపైగా మహిళలు పనిచేస్తున్నారు. వరుసగా రుణాలు తీసుకుంటూ తీర్చారీమె. గోరఖ్‌పుర్‌లో ప్రారంభించి, సమీప జిల్లాలన్నింటికీ వ్యాపారాన్ని విస్తరించారు. సైకిల్‌ స్థాయి నుంచి రెండు భారీ వాహనాలు. టెంపో, బ్యాటరీతో నడిచే రిక్షాలపై దుకాణదారులకు ప్యాకింగ్‌ బాక్సులు పంపిణీ చేస్తున్నారు. సాధారణ మహిళగా జీవితాన్ని ప్రారంభించి తనలాంటి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. రూ.3 కోట్ల వార్షికాదాయం అందుకునే స్థాయికి చేరుకొన్నారు. ఈ కృషికే ఇటీవల సంగీత.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ‘గోరఖ్‌పుర్‌ రత్న’ పురస్కారం వరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్