Fat To Fit: 40 కిలోల బరువు తగ్గి.. ఫిట్‌నెస్‌ కోచ్‌గా మారింది!

పెళ్లయ్యాక కొంతమంది అమ్మాయిలు కాస్త బరువు పెరగడం పరిపాటే! కానీ ఆమె మాత్రం వివాహం తర్వాత కిలోల కొద్దీ బరువు పెరిగింది. ఒకానొక దశలో 110 కిలోలకు చేరుకుంది. ఇలా బొద్దుగా మారిన ఆమెను చూసి ఎంతోమంది...

Updated : 14 Sep 2022 19:37 IST

(Photos: Facebook)

పెళ్లయ్యాక కొంతమంది అమ్మాయిలు కాస్త బరువు పెరగడం పరిపాటే! కానీ ఆమె మాత్రం వివాహం తర్వాత కిలోల కొద్దీ బరువు పెరిగింది. ఒకానొక దశలో 110 కిలోలకు చేరుకుంది. ఇలా బొద్దుగా మారిన ఆమెను చూసి ఎంతోమంది నవ్వుకునేవారు.. హేళన చేసేవారు. ఇలా ఇతరుల చేష్టలు ఆమెను బాధపెట్టాయి.. డిప్రెషన్‌లోకి నెట్టేశాయి. అయితే ఆ తర్వాత తేరుకున్న ఆమె.. బరువు తగ్గాలని నిర్ణయించుకుంది.. అది తనను చూసి నవ్వుకున్న వాళ్ల కోసం కాదు.. తన ఆరోగ్యం కోసం! ఓపిక, పట్టుదల ఉండాలే కానీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పెద్ద సమయం పట్టదన్నట్లుగా.. కేవలం పదే పది నెలల్లో 40 కిలోలు తగ్గింది.. ఈ స్వీయ స్ఫూర్తే ఆమెను ఫిట్‌నెస్‌ కోచ్‌గా మార్చాయి.. క్రీడలకు సిద్ధమవుతోన్న ఎంతోమంది చిన్నారులకు ఫిట్‌నెస్‌ పాఠాలు బోధిస్తోన్న తులికా సింగ్‌ స్ఫూర్తి ప్రయాణమిది!

తులికది వారణాసి. చిన్న వయసు నుంచే ఎంతో ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండేదామె. జర్నలిజం చదవాలనేది ఆమె చిన్ననాటి కోరిక. ఈ క్రమంలోనే వారణాసి నుంచి నోయిడా వెళ్లింది. కోర్సు పూర్తి కాగానే ఓ వార్తా సంస్థలో ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లు గడిచాక.. డాక్టర్‌ దిగ్విజయ్‌ సింగ్‌తో వివాహమైంది. ఆ తర్వాతే తన జీవితంలో మార్పు మొదలైందంటోందామె.

అదే కారణమన్నారు..!

సాధారణంగా కొంతమంది మహిళలు పెళ్లి తర్వాత కాస్త బరువు పెరుగుతుంటారు. ఇదే విధంగా తులిక శరీరాకృతిలోనూ క్రమంగా మార్పు కనిపించింది. మొదట్లో ఇది సర్వసాధారణమే అనుకుందామె. కానీ బరువు అంతకంతకూ పెరుగుతుండడంతో ఒకానొక దశలో 110 కిలోలకు చేరుకుంది. మరోవైపు నెలసరి సమస్యలూ తలెత్తాయి. దీంతో అసలు కారణమేంటో తెలుసుకోవడానికి డాక్టర్‌ని సంప్రదించిందామె. శరీరంలో తలెత్తిన హార్మోన్ల అసమతుల్యతే దీనికి ప్రధాన కారణమని వైద్య పరీక్షల్లో తేలింది. అయితే బొద్దుగా మారిన తులికను చూసి చాలామంది హేళన చేసేవారు.. లోలోపలే నవ్వుకునేవారు. ఇలా వాళ్ల చేష్టలకు కాస్త ఒత్తిడి, ఆందోళనలకు లోనైన ఆమె.. కొన్నాళ్ల పాటు నాలుగ్గోడలకే పరిమితమైంది. కానీ తప్పు తనది కానప్పుడు తనకెందుకీ శిక్ష అని ఆత్మపరిశీలన చేసుకున్న తులిక.. తనను చూసి నవ్విన వారి కోసం కాకుండా.. తన కోసం, తన ఆరోగ్యం కోసం బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానంటోంది.

మనసును సిద్ధం చేసుకోవాలి!

‘బరువు తగ్గే క్రమంలో శరీరాన్నే కాదు.. మనసునూ అందుకు సిద్ధం చేసుకోవాలి. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక నేనూ అదే చేశా. ఒకేసారి ఎక్కువ కిలోలు తగ్గాలన్న పెద్ద లక్ష్యాన్ని కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకున్నా.. ముందుగా ఈ ప్రక్రియను నడకతో ప్రారంభించా. రోజూ ఉదయాన్నే 6-7 కిలోమీటర్లు నడిచేదాన్ని. అలాగే డ్యాన్స్‌ తరగతుల్లోనూ చేరాను. ఇది నా మనసుకు ఉల్లాసాన్ని అందించేది. ఇక ఆహారంలోనూ పలు మార్పులు చేసుకున్నా. ఉప్పుకు బదులు కళ్లుప్పు, చక్కెరకు బదులు బెల్లం, రిఫైన్డ్‌ ఆయిల్‌కి ప్రత్యామ్నాయంగా ఆలివ్‌/ఆవ నూనె.. వంటివి ఉపయోగించడం మొదలుపెట్టా. జంక్‌ఫుడ్‌ని పూర్తిగా దూరం పెట్టాను. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకున్నా. ఈ రొటీన్‌ నాలో క్రమంగా మార్పు తీసుకొచ్చింది. అలా 9 నెలల్లో 40 కిలోలు తగ్గి.. 70 కిలోలకు చేరుకున్నా..’ అంటూ బరువు తగ్గడానికి తన జీవనశైలిలో చేసుకున్న మార్పుల గురించి చెప్పుకొచ్చారు తులిక.

అందుకే జిమ్‌లో చేరా!

క్రమంగా బరువు తగ్గుతున్న కొద్దీ తులికకు మరింత ఉత్సాహంగా అనిపించేది. అయితే తీరా 40 కిలోలు తగ్గాక తనకు కొత్త సమస్య మొదలైందంటోందామె. ‘కిలోల కొద్దీ బరువు తగ్గడం మంచి పరిణామమే అనుకునే తరుణంలోనే నాకు మరో కొత్త సమస్య తలెత్తింది. అదే.. చర్మం వదులుగా మారడం. దీన్నుంచి విముక్తి పొందడానికి మావారి సలహా మేరకు జిమ్‌లో చేరాను. కార్డియోతో పాటు ప్లాంక్స్‌, స్క్వాట్స్‌, లాంజెస్‌, క్రంచెస్‌, స్టెప్పింగ్‌.. వంటి వర్కవుట్లపై ఎక్కువ దృష్టి పెట్టా. బరువులెత్తడం, యోగానూ సాధన చేయడం ప్రారంభించా. ఇవన్నీ సత్ఫలితాలనిచ్చాయి. వదులైన చర్మం బిగుతుగా మారుతూ.. చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకున్నా. ఇప్పటికీ నేను ఇదే జీవనశైలిని కొనసాగిస్తున్నా.. బరువును అదుపులో ఉంచుకుంటూ ఫిట్‌గా ఉంటున్నా. నిజానికి నా ఈ జర్నీలో మా వారు, నా స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు..’ అంటూ చెప్పుకొచ్చారు తులిక.

పిల్లలకు ఫిట్‌నెస్‌ పాఠాలు!

అయితే జిమ్‌లో చేరిన కొన్ని రోజుల్లోనే తాను ఫిట్‌నెస్‌ కోచ్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుంది తులిక. ఈ క్రమంలోనే ప్రస్తుతం జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సిద్ధమయ్యే చిన్నారులకు ఫిట్‌నెస్‌ కోచ్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికలుగా ఎంతోమందికి ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతూ వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతోందామె. ‘ఆప్టిమిస్టిక్‌ తులి’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌నూ నడుపుతోందీ లేడీ ఫిట్‌నెస్‌ కోచ్‌. అలాగని తన జర్నలిజం కెరీర్‌కు ముగింపు పలకలేదామె. ఇటు ఫిట్‌నెస్‌ కోచ్‌గా, అటు ఓ కొడుక్కి తల్లిగా, మరోవైపు జర్నలిస్టుగా.. ఇలా తన బాధ్యతలన్నీ బ్యాలన్స్‌ చేస్తూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు తులిక. అంతేకాదు.. ఆమె రచయిత్రి కూడా! తన జీవితానుభవాల్ని రంగరించి ‘తులిక కా సఫర్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాసిందామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని