తల్లీకూతుళ్లు.. కలిసే చరిత్రను తిరగరాశారు!

ఇష్టపడి ఎంచుకున్న ప్రతి రంగంలోనూ కూతుళ్లను ప్రోత్సహించిన తల్లుల గురించి విన్నాం..తమ విజయంతో కూతుళ్లలో స్ఫూర్తి నింపిన అమ్మల గాథలు చదివాం.....

Published : 08 May 2022 13:25 IST

(Photos: Instagram)

ఇష్టపడి ఎంచుకున్న ప్రతి రంగంలోనూ కూతుళ్లను ప్రోత్సహించిన తల్లుల గురించి విన్నాం..
తమ విజయంతో కూతుళ్లలో స్ఫూర్తి నింపిన అమ్మల గాథలు చదివాం..
తమకు అందని సక్సెస్‌ను తమ కూతుళ్లు సాధిస్తే మురిసిపోయిన మాతృమూర్తుల గురించి తెలుసుకున్నాం..
ఇవే కాదు.. ఇద్దరూ కలిసి ఒకే రంగంలో రాణిస్తూ, అరుదైన విజయాలు సాధిస్తూ చరిత్రలో నిలిచిపోయిన తల్లీకూతుళ్లు కూడా కొందరున్నారు. ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా అలాంటి తల్లీకూతుళ్ల గురించి తెలుసుకుందాం..!

ఆడ్రీ మబేన్‌ - అమీ మెహతా

ఈ కాలంలో అరుదైన రంగాల్లో దూసుకుపోవాలనుకుంటున్నారు చాలామంది మహిళలు. మైసూర్‌కు చెందిన ఆడ్రీ మబేన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే విమానయానంపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఈ రంగంలోకి ప్రవేశించడమే కాదు.. తేలికపాటి విమానం (మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) నడపడంలో మెలకువలు నేర్పించే తొలి మహిళగా కీర్తి గడించింది. మరోవైపు తన కూతురు అమీ మెహతా కూడా తల్లి తపననే పుణికిపుచ్చుకుంది. పెరిగి పెద్దయ్యే క్రమంలో తల్లి కూడా తనను ఈ దిశగానే ప్రోత్సహించింది. ఫలితంగా అమీ కూడా ఏవియేషన్‌ రంగంలో రాణిస్తోంది. అయితే సాహసాలు చేయడమంటే ఈ తల్లీకూతుళ్లకు భలే సరదా. ఈ క్రమంలోనే 2017, నవంబర్‌లో మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 80 రోజుల్లో భూమిని చుట్టొచ్చిందీ జంట. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా ద్వయంగా, తల్లీ కూతుళ్లుగా చరిత్ర సృష్టించారు. అరుదైన రంగంలో కొనసాగుతున్నప్పుడే పనిని ఆస్వాదించగలం అంటోన్న ఈ మామ్‌-డాటర్‌ జోడీ.. ప్రస్తుతం మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నడపడంలో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తోంది.


జయ శివకుమార్‌ - శ్వేతా శివకుమార్

ఇంటికి పెద్ద దిక్కును కోల్పోతే.. కుటుంబ భారమంతా భార్య మీదే పడుతుంది. ఇలాంటి తరుణంలో ఓవైపు బాధను దిగమింగుతూ.. మరో వైపు పిల్లల బాధ్యతను నిర్వర్తించడం, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగడమంటే మాట్లాడుకున్నంత సులభం కాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన చేశారు తల్లీకూతుళ్లు జయ, శ్వేత. 2015లో ‘వై సో బ్లూ’ పేరుతో ఓ ఫ్యాషన్‌ పోర్టల్ను ప్రారంభించారు. ఈ క్రమంలో తన 25 ఏళ్ల టైలరింగ్‌ అనుభవం పనికొచ్చిందంటారామె. పర్యావరణానికి నష్టం జరగకుండా, వ్యక్తిగత ప్రాధాన్యతల్ని బట్టి సౌకర్యవంతమైన దుస్తులు రూపొందించడమే ఈ బ్రాండ్‌ ముఖ్యోద్దేశం. ఒక చిన్న లివింగ్‌ రూమ్‌లో మొదలైన ఈ సంస్థ సేవలు.. ప్రస్తుతం నాలుగు ఫ్యాషన్‌ స్టూడియోలు ప్రారంభించి విజయవంతంగా వ్యాపారాన్ని కొనసాగించే స్థాయికి ఎదిగాయి. ‘కష్టపడి పనిచేసే తత్వం, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే నైజం.. ఈ రెండూ ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతాం..’ అంటూ తన సక్సెస్‌ సీక్రెట్‌ను చెప్పకనే చెప్పారీ తల్లీకూతుళ్ల ద్వయం.


మాలా దత్తా - శ్రేయా మిశ్రా

మనసులో చదువుకోవాలన్న ఆశ ఉన్నా వయసు పెరుగుతున్న కొద్దీ ‘ఈ వయసులో అవసరమా?’ అంటూ కోరికను చంపేస్తుంటారు చాలామంది. కానీ చాలా అరుదుగా లేటు వయసులో తమ తపనను నెరవేర్చుకుంటారు. దిల్లీకి చెందిన మాలా దత్తా ఈ కోవకే చెందుతారు. తన కూతురు శ్రేయా మిశ్రా కంటే సరిగ్గా రెట్టింపు వయసున్న ఆమె.. తన కూతురితో పాటే పీహెచ్‌డీ పూర్తిచేసి చదువుకు, వయసుకు సంబంధం లేదని నిరూపించారు. ఇలా తల్లీకూతుళ్లిద్దరూ ఒకేసారి డాక్టరేట్‌ పట్టా అందుకొని వార్తల్లో నిలిచారు.

‘మాస్టర్స్‌ పూర్తిచేశాక పీహెచ్‌డీ చదవాలనుకున్నా. కానీ కుదర్లేదు. సుమారు 34 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. ఈ క్రమంలో నా కూతురితో కలిసి దిల్లీ యూనివర్సిటీలో సైకాలజీ విభాగంలో పీహెచ్‌డీకి అప్లై చేశా. తనతో కాలేజీకి వెళ్లడం, కూతురు వయసున్న వారితో కలిసి పాఠాలు వినడం మర్చిపోలేని అనుభూతులు! మా అమ్మాయి కూడా నన్నెంతో ప్రోత్సహించింది..’ అంటూ మురిసిపోతున్నారు మాలా.

‘సబ్జెక్టులు వేరైనా.. అమ్మతో కలిసి పీహెచ్‌డీ పూర్తి చేయడం, పట్టా అందుకోవడం జీవితాంతం గుర్తుండిపోతుంది.. చిన్నతనం నుంచి అడుగడుగునా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మర్చిపోను..’ అంటోంది శ్రేయ. దిల్లీ యూనివర్సిటీ చరిత్రలో ఇలా తల్లీకూతుళ్లిద్దరూ కలిసి ఒకేరోజు, ఒకేసారి పట్టాలు అందుకోవడం అదే మొదటిసారి కావడంతో వీళ్లిద్దరూ సెన్సేషన్‌గా మారిపోయారు.


శకుంతలా పాండ్య – సౌమ్య పాండ్య

జీబ్రా క్రాసింగ్స్‌.. పాదచారులు రోడ్డు దాటడానికి వీలుగా వీటిని రూపొందించారన్న విషయం మనకు తెలిసిందే. అయితే సాధారణంగా జీబ్రా క్రాసింగ్‌ అంటే తెలుపు రంగు గీతలు. నిజానికి ఇవి దూరం నుంచి వచ్చే వాహనదారులకు పెద్దగా కనిపించవు. దాంతో అకస్మాత్తుగా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్నే గ్రహించారు అహ్మదాబాద్‌కు చెందిన తల్లీకూతుళ్లు శకుంతలా పాండ్య, సౌమ్య పాండ్యా. రోడ్డు భద్రతలో భాగంగా 3డి జీబ్రా క్రాసింగ్‌ డిజైన్‌ని రూపొందించారు. వీటికి 3డి ఎఫెక్ట్స్‌తో వన్నెలద్దారు. తద్వారా అవి దూరం నుంచి వచ్చే వాహనదారులకు స్పష్టంగా కనిపించడం, రేడియం మూలంగా రాత్రి పూట కూడా అవి మెరవడంతో చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలిగామని చెబుతున్నారీ తల్లీకూతుళ్లు. ఇలా దేశంలోనే తొలి 3డి జీబ్రా క్రాసింగ్‌ని రూపొందించి వార్తల్లో నిలిచారు. వివిధ అంశాల్ని, సమాజంలోని సమస్యల్ని.. త్రీడీ ఆర్ట్‌ రూపంలో రియాల్టీకి దగ్గరగా చూపించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఫలితంగా.. తమ 3డి ఆర్ట్‌ వర్క్‌తో ఇప్పటివరకు బోలెడన్ని అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఈ ద్వయం.. రెండుసార్లు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో, ఒకసారి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించింది.


లీనా శర్మ – భక్తి శర్మ

తన తల్లి రక్తాన్నే కాదు.. అణువణువునా నిండిన ఆమె అభిరుచినీ పంచుకొని జన్మించింది ప్రముఖ స్విమ్మర్‌ భక్తి శర్మ. ఆమె తల్లి లీనా శర్మ కూడా ప్రొఫెషనల్‌ స్విమ్మరే! 2008లో వీరిద్దరూ కలిసి ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదారు. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి తల్లీకూతుళ్లుగా సరికొత్త చరిత్రను లిఖించారు. చిన్న వయసు నుంచే ఈతపై ఆసక్తి పెంచుకున్న లీనా.. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా సొంతంగా తన నైపుణ్యాలకు పదును పెట్టుకుంది. ఇలా తల్లిలోని తపన, పట్టుదల చూసిన భక్తి.. తాను కూడా అమ్మ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంది.

‘అమ్మే నా స్ఫూర్తి. ఇప్పుడు నేనీ స్థాయిలో ఉన్నానంటే అదంతా అమ్మ ప్రోత్సాహమే! ఇప్పటిదాకా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొన్నా.. పతకాలు సాధించా. పూల్స్‌, డీప్‌ వాటర్‌, సముద్రాలు, మహాసముద్రాలు అన్న తేడా లేకుండా అన్నింట్లోనూ ఈత కొట్టగలిగే సత్తా నాకుంది..’ అంటోంది భక్తి. మైనస్‌ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అంటార్కిటికా మహాసముద్రంలో.. 1.4 మైళ్ల దూరాన్ని 52 నిమిషాల్లో ఈత కొట్టి.. ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది భక్తి. ప్రస్తుతం భక్తి శర్మ జీవిత కథ ఆధారంగా, కియారా అడ్వాణీ ముఖ్య పాత్రలో ఓ బయోపిక్‌ రూపొందుతోంది.

వీళ్లే కాదు.. నీనా గుప్తా-మసాబా గుప్తా (ఫ్యాషన్‌), మృణాళిని సారాభాయ్‌-మల్లికా సారాభాయ్ (శాస్త్రీయ నృత్యం), యామినీ మజుందార్‌ షా - కిరణ్‌ మజుందార్‌ షా (వ్యాపారం).. తదితరులు కూడా ఆయా రంగాల్లో రాణించి గుర్తింపు సంపాదించుకున్న వారే! వీళ్లంతా నేటి తరం తల్లీకూతుళ్లకు ఆదర్శం అని చెప్పడంలో సందేహం లేదు.

హ్యాపీ మదర్స్‌ డే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్