Pratibha Thapliyal : ‘పొట్టి బట్టలేసుకొని.. ఏంటీ పని?’ అన్నారు!

‘నలభై ఏళ్ల వయసులో పొట్టి పొట్టి షార్ట్స్‌ ధరించి శరీరాన్ని ఎక్స్‌పోజ్‌ చేయడమేంటి? అసహ్యంగా..!’, ‘పురుషుల్లా బాడీ పెంచమని ఎవరు చెప్పారు?’, ‘ఇద్దరు పిల్లల తల్లివి.. తల్లిలా వాళ్ల బాధ్యతలు నిర్వర్తించు..’ బాడీ బిల్డింగ్‌ను ఎంచుకుంటానన్నప్పుడు ప్రతిభా తప్లియాల్‌....

Published : 10 Apr 2023 19:06 IST

(Photos: Instagram)

‘నలభై ఏళ్ల వయసులో పొట్టి పొట్టి షార్ట్స్‌ ధరించి శరీరాన్ని ఎక్స్‌పోజ్‌ చేయడమేంటి? అసహ్యంగా..!’, ‘పురుషుల్లా బాడీ పెంచమని ఎవరు చెప్పారు?’, ‘ఇద్దరు పిల్లల తల్లివి.. తల్లిలా వాళ్ల బాధ్యతలు నిర్వర్తించు..’ బాడీ బిల్డింగ్‌ను ఎంచుకుంటానన్నప్పుడు ప్రతిభా తప్లియాల్‌ సమాజం నుంచి ఎదుర్కొన్న మాటలివి. అలాగని వీటిని పట్టించుకుని వెనకడుగు వేస్తే.. నేడు ‘ఉత్తరాఖండ్‌ తొలి మహిళా బాడీ బిల్డర్‌’గా ఆమెకు పేరొచ్చేది కాదు. తనకెదురైన ఆరోగ్య సమస్యను దూరం చేసుకోవడానికి జిమ్‌లో చేరిన ఆమె.. తన భర్త ప్రోత్సాహంతో బాడీ బిల్డింగ్‌నే తన కెరీర్‌గా మార్చుకుంది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశానికి పతకాల పంట పండిస్తోంది. ఇటీవలే ‘జాతీయ సీనియర్‌ మహిళా బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌’ నెగ్గి.. మరో రెండు పోటీల కోసం సిద్ధమవుతోన్న ప్రతిభ స్ఫూర్తి గాథ ఇది!

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో పుట్టిపెరిగింది ప్రతిభ. చిన్నతనం నుంచి ఆటలంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ మక్కువతోనే స్కూల్లో విభిన్న క్రీడల్లో చురుగ్గా పాల్గొనేదామె. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పలు పోటీల్లో పాల్గొని విజయాలూ నమోదు చేసింది ప్రతిభ. ఇలా తన కూతురి క్రీడా ప్రతిభ చూసి గర్వంతో ఉప్పొంగిపోయారు ఆమె తల్లిదండ్రులు. అయితే అనుకోకుండా తన తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా ఆమె తల్లి పైనే పడింది.

పెళ్లి చేయమని ఒత్తిడి తెచ్చారు!

‘మా అమ్మానాన్నలకు మేం నలుగురం సంతానం. నాన్న చనిపోయే నాటికే అక్కలిద్దరికీ పెళ్లైంది.. నేను, నా తమ్ముడు చదువుకుంటున్నాం. అమ్మ పైనే కుటుంబ భారం పడినా.. నన్ను, తమ్ముడిని కష్టపడి చదివించింది. ఇలా తన ప్రోత్సాహంతో అటు కాలేజీలో చదువుతూనే.. ఇటు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనేదాన్ని. అయితే ఇదే సమయంలో మా బంధువులు, ఇరుగుపొరుగు వారు నా పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోమని అమ్మపై ఒత్తిడి తెచ్చారు. తనూ ఈ విషయంలో చాలానే బాధపడేది. అది చూడలేక.. పెళ్లికి ఒప్పుకున్నా. వివాహం తర్వాత డెహ్రాడూన్‌లో స్థిరపడ్డా. మావారు భూపేశ్‌ తప్లియాల్‌.. వ్యాపారి. పెళ్లయ్యాక కొన్నేళ్ల పాటు బిజినెస్‌లోనే ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నా. ఐదేళ్లు గడిచే సరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. పిల్లల బాధ్యతల్లో పడిపోయి చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లే.. నాకూ నా గురించి పట్టించుకునే సమయమే దొరకలేదు. దీనివల్ల 60 కిలోలున్న నేను కొన్నాళ్లకు 85 కిలోలకు పెరిగా..’ అంటూ చెప్పుకొచ్చింది ప్రతిభ.

ఆ సమస్య తీవ్రంగా ఉందన్నారు!

ఇలా అధిక బరువుకు తోడు.. ప్రతిభకు రక్తపోటు కూడా పడిపోయి.. ఉన్నట్లుండి నీరసించిపోయేది. అయితే దీని వెనకున్న అసలు సమస్యేంటో తెలుసుకోవడానికి ఓసారి వైద్యుడిని సంప్రదించిందామె. పరీక్షించి చూడగా థైరాయిడ్‌ స్థాయులు ఉండాల్సిన దానికంటే తీవ్రంగా పెరిగినట్లు గుర్తించారు.. అలాగే విటమిన్‌ ‘డి’ లోపం కూడా ఎక్కువగానే ఉందన్నారు.

‘ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితేనే ఆరోగ్యం తిరిగి కుదుటపడుతుందన్నారు వైద్యులు. లేదంటే తీవ్ర అనారోగ్యాలు తప్పవన్నారు. ఈ క్రమంలోనే మావారి సలహా మేరకు జిమ్‌లో చేరా. అప్పటికే ఆటల్లో ప్రవేశం ఉంది కాబట్టి జిమ్‌ చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. అయితే చాలామంది నేను వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్తుంటే.. బాడీ బిల్డింగ్‌ కోసమేమో అనుకున్నారు. ఇందుకు కారణం నేను చేసే వర్కవుట్ల వల్ల నా శరీరం కండలు తిరిగినట్లుగా మారిపోయింది. దీంతో నాకూ బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి పెరిగింది. అలా మావారి ప్రోత్సాహంతో దీన్నే నా కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా..’ అంటున్నారు ప్రతిభ.

బికినీ అంటే భయమేసింది!

జిమ్‌లో చేరిన రెండుమూడు నెలల్లోనే తాను పెరిగిన 25 కిలోల బరువు తగ్గి ఫిట్‌గా మారిన ప్రతిభ.. ఇక బాడీ బిల్డర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అయితే ఈ పోటీల్లో భాగంగా పొట్టి పొట్టి షార్ట్స్‌, బికినీ వేసుకోవాలని తెలిసి.. తొలుత తన ఆలోచనను మార్చుకోవాలనుకున్నానంటోంది ప్రతిభ.

‘షార్ట్స్‌, బికినీ.. ఇంతకుముందెన్నడూ వీటిని ధరించలేదు. అలాంటిది ఇప్పుడు ధరించి అందరి ముందు నిలబడాలంటే సిగ్గుగా, భయంగా అనిపించింది. కానీ ఇప్పుడూ మావారి ప్రోత్సాహం నా వెన్ను తట్టింది. అయితే ఈ విషయంలో నాకు ఇంట్లో వాళ్లందరి మద్దతు లభించినా.. సమాజం నుంచి పలు విమర్శలు ఎదురయ్యాయి. ‘నలభై ఏళ్ల వయసులో పొట్టి బట్టలేంట’ని, ‘అబ్బాయిలా బాడీ పెంచుకోమని ఎవరు చెప్పార’ని, ‘ఇద్దరు పిల్లల తల్లివి.. తల్లిలా ఉండమ’ని.. ఇలా ఎవరి నోటికొచ్చినట్లు వాళ్లు మాట్లాడారు. ముందు బాధపడ్డా.. ఆ తర్వాత వీటి గురించి పట్టించుకోవడం మానేశా. నా మనసు మాట వింటూనే నేనేంటో ఈ సమాజానికి నిరూపించుకోవాలనుకున్నా..’ అంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో పలు పోటీలకు హాజరవడం మొదలుపెట్టింది ప్రతిభ.

విమర్శించిన వారే ప్రశంసిస్తుంటే..!

గతేడాది సిక్కింలో జరిగిన ‘బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో తొలిసారి పాల్గొన్న ప్రతిభ.. ఆ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆపై ‘ఫెడరేషన్‌ కప్‌’లోనూ సత్తా చాటింది. ఇక ఈ ఏడాది మధ్యప్రదేశ్‌ రత్లాంలో జరిగిన 13వ ‘జాతీయ సీనియర్‌ మహిళా బాడీ బిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో పోటీ పడిన ఆమె.. బంగారు పతకం ముద్దాడింది. తాను ఎంచుకున్న మార్గాన్ని చూసి ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందంటోందీ బాడీ బిల్డర్.

‘రోజుకు ఏడెనిమిది గంటలు జిమ్‌లోనే గడుపుతా. ఆహారంలో పలు మార్పులు చేసుకున్నా. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నా. ఇక నా సక్సెస్‌లో మావారు, నా ఇద్దరు కొడుకుల ప్రోత్సాహం ఎంతో! మహిళలందరికీ ఇంటి నుంచి ఇలాంటి ప్రోత్సాహమే అందాలి. అప్పుడే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. కన్న కలల్ని సాకారం చేసుకోగలుగుతారు. ప్రస్తుతం రాబోయే ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పోటీల కోసం సిద్ధమవుతున్నా. వీటిల్లోనూ బంగారు పతకాలు సాధించి దేశానికి అంకితమివ్వాలనుకుంటున్నా.. ఏదేమైనా నన్ను విమర్శించిన వారి నోటితోనే నా ప్రతిభతో ప్రశంసలందుకోవడం మర్చిపోలేను..’ అంటోన్న ప్రతిభ.. ‘ఉత్తరాఖండ్‌ తొలి మహిళా బాడీ బిల్డర్‌’గానూ ఖ్యాతి గడించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని