Change Makers: అలా ‘మార్పు’ తెచ్చేస్తున్నారు!

‘దేశం నాకెంతో ఇచ్చింది.. నేను కూడా ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి.. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలి..’ అని యోచిస్తోంది నేటి యువత. ఈ ఆలోచనతోనే సమాజాభివృద్ధికి అడ్డుపడుతోన్న సమస్యల్ని....

Published : 08 Jul 2023 13:19 IST

(Photos: LinkedIn)

‘దేశం నాకెంతో ఇచ్చింది.. నేను కూడా ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి.. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలి..’ అని యోచిస్తోంది నేటి యువత. ఈ ఆలోచనతోనే సమాజాభివృద్ధికి అడ్డుపడుతోన్న సమస్యల్ని గుర్తిస్తూ.. తమ ప్రతిభాపాటవాలతో వాటికి పరిష్కారం చూపుతున్నారు ఎంతోమంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి యువ ఛేంజ్‌మేకర్స్‌ని గుర్తించి.. ఏటా ‘డయానా పురస్కారం’తో వారిని గౌరవిస్తుంటుంది బ్రిటన్‌ ప్రభుత్వం. అలా ఈ ఏడాది ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు పలువురు భారతీయ అమ్మాయిలు ఎంపికయ్యారు. మరి, వారెవరు? దేశాభివృద్ధిలో వారి పాత్రేంటి? తెలుసుకుందాం రండి..

‘మధుమేహం’తో పోరాటం!

మన కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే తట్టుకోలేం.. ఆసక్తి, పరిజ్ఞానం ఉన్న వారైతే ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే సాహసమూ చేస్తుంటారు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల దివా ఉత్కర్ష ఇలాంటి ప్రయత్నమే చేసి సఫలమైంది. టైప్‌-1 మధుమేహం బారిన పడిన 9 ఏళ్ల తన తమ్ముడిని చూసి చలించిపోయిన ఆమె.. 2021లో ‘ప్రాజెక్ట్‌ సూర్య’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. టైప్‌-1, టైప్‌-2 మధుమేహంపై పేద చిన్నారుల్లో, పెద్దల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటివరకు ఈ ఎన్జీవో సేవలు దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మందికి పైగా చేరువయ్యాయి. అంతేకాదు.. ఈ రెండేళ్లలో రూ. 5.61 లక్షల నిధులు సేకరించిన దివా.. ఈ డబ్బుతో మధుమేహంతో బాధపడే ఎంతోమంది చిన్నారులు, పెద్దలకు ఇన్సులిన్‌ను అందజేసింది. దీన్ని అందరికీ అందుబాటు ధరల్లో అందించాలంటూ భారత ప్రభుత్వానికి పిటిషన్‌ కూడా సమర్పించిందీ అమ్మాయి.


‘జననేంద్రియ విరూపణ’ను అడ్డుకుంటూ..!

మూఢనమ్మకాలతో కొందరు, లైంగిక కోరికల్ని పూర్తిగా అణచివేయాలని మరికొందరు.. ఆడపిల్లల్లో జననేంద్రియ విరూపణకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లోనే కాదు.. అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాల్లోనూ ఆడపిల్లలపై ఈ అనాచారం కొనసాగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో వారు బోలెడన్ని అనారోగ్యాల్ని ఎదుర్కోవడంతో పాటు సంతాన భాగ్యానికీ నోచుకోలేకపోతున్నారు. అందుకే ఈ అత్యాచారానికి తెర దించాలనుకుంది 21 ఏళ్ల సన్యా శర్మ. ఈ ఆలోచనతోనే మూడేళ్ల క్రితం ‘స్కార్లెట్‌ ఉడాన్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ప్రపంచ దేశాల్లో ‘స్త్రీ జననేంద్రియ విరూపణ’పై అవగాహన కల్పించడం, ఈ దురాచారానికి అడ్డుకట్ట వేసేలా అక్కడి యువతను ప్రోత్సహించడం ఈ ఎన్జీవో ముఖ్యోద్దేశం. ఈ క్రమంలోనే భారత్‌తో పాటు, యూకే, ఇండోనేషియా, కెనడా.. ఇలా ప్రపంచవ్యాప్తంగా 10కి పైగా దేశాల్లో 35 మంది యువ నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసిందామె. వారి ద్వారా అక్కడి అమ్మాయిల్లో ఈ అనాచారంపై అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ లా స్కూల్‌లో న్యాయవిద్య అభ్యసిస్తోన్న సన్యా.. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగానికి ‘జెండర్‌ ఈక్వాలిటీ లీడర్‌’గా కొనసాగుతోంది. ఈ సమాజంలోని లింగ అసమానతల్ని, ఈ క్రమంలో మహిళలపై జరుగుతోన్న హింసను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యువ యాక్టివిస్ట్‌.. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా ఆయా అంశాలపై ఉపన్యాసాలిచ్చింది. లక్షలాది మంది యువతుల్లో అవగాహన కల్పించింది. అన్నట్లు సన్య.. శాస్త్రీయ నృత్యకళాకారిణి కూడా!


‘బాడీ షేమింగ్‌’పై అవగాహన!

శరీరాకృతి, అధిక బరువు, చర్మ ఛాయ.. వంటి విషయాల్లో చాలామంది వేధింపులకు గురవుతున్నారు. దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ఫలితంగా ఈటింగ్‌ డిజార్డర్‌, బాడీ డిస్‌మార్ఫియా.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. స్వీయానుభవానికి తోడు ఈ గణాంకాలు అంతకంతకూ పెరగడం గుర్తించింది హైదరాబాద్‌కు చెందిన రియా చోప్రా. ఇలా అటు శారీరక ఆరోగ్యాన్ని, ఇటు మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ఈ సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఏడాది క్రితం ‘మై బాడీ’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. తన సంస్థ వేదికగా వర్క్‌షాప్స్‌, బృంద కౌన్సెలింగ్‌ సెషన్స్‌ నిర్వహించడంతో పాటు.. ఈ సమస్యలతో సతమతమవుతోన్న వారికి అండగా ఓ సపోర్ట్‌ గ్రూప్‌నీ ఏర్పాటుచేసిందామె. శారీరక మార్పుల్ని స్వీకరించి.. స్వీయ ప్రేమను పెంచేలా చేస్తోన్న తన కృషి ఈ ఏడాది కాలంలో 500 మందికి పైగా చిన్నారులకు చేరువైంది.

‘నలుగురికీ చేతనైనంత సహాయం చేయడం నాకు చిన్నతనం నుంచే అలవాటు! ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌ని ఎంచుకున్నా. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తా. మరింతమందిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తా..’ అంటోన్న రియా.. ప్రస్తుతం ‘ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో పదో తరగతి చదువుతోంది.


ఆ ప్రశ్నలోంచి పుట్టిన ఆలోచన!

నలుగురిలో ఒకరిగా కాకుండా ‘ఒక్క’రిలా గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటారు కొందరు. గురుగ్రామ్‌కు చెందిన 17 ఏళ్ల శాన్వీ ధింగ్రా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతం అక్కడి సన్‌సిటీ స్కూల్‌లో చదువుకుంటోన్న ఆమె.. తన చుట్టూ ఉన్న పేద అమ్మాయిల కోసం ఏదైనా మంచి చేయాలనుకుంది. ఇదే ఆశయంతో 2021, జూన్‌లో ‘సిండ్రెల్లాస్‌ గాట్‌ వింగ్స్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. పేద బాలికలు, అమ్మాయిలకు కుట్టుపని, అల్లికలు నేర్పించడం.. తద్వారా వారు ఆర్థిక సాధికారత సాధించేలా ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. అంతేకాదు.. వెనకబడిన ప్రాంతాలు/గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు, బాలికలకు.. తిరిగి ఉపయోగించే శ్యానిటరీ న్యాప్‌కిన్లపై అవగాహన కల్పించేందుకు ఓ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది శాన్వి. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ దేశాలకూ ఇప్పటివరకు 30 వేలకు పైగా రీయూజబుల్‌ శ్యానిటరీ న్యాప్‌కిన్లను ఉచితంగా అందించిన ఆమె.. ఆయా సామాజిక అంశాలపై పుస్తకాలు కూడా రాస్తుంటుంది.

‘చిన్నతనం నుంచి ‘నేనెవరు?’ అనే ప్రశ్న నన్ను తరచూ వేధించేది. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నప్పుడే దీనికి సమాధానం దొరుకుతుందనిపించింది. ఈ జిజ్ఞాసే నన్ను సమాజ సేవ వైపు నడిపించింది. మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు, ఎదుర్కొనే ప్రతి అనుభవం.. మనల్ని మనం మరింతగా మెరుగుపరచుకునేందుకు దోహదం చేస్తుందనేది నా నమ్మకం!’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ యువ యాక్టివిస్ట్.


యాప్‌తో ‘మార్పు’!

యుక్తవయసులోకి అడుగుపెట్టే అమ్మాయిల్లో శారీరకంగా పలు మార్పులు చోటుచేసుకోవడంతో పాటు మానసిక భావోద్వేగాలూ సహజమే! అయితే వీటి గురించి తల్లులు ముందు నుంచే వారికి అవగాహన కల్పించాలి. లేదంటే తీరా ఈ సమయానికి వారిలో ఆందోళన, ఒత్తిళ్లు మొదలవుతాయి. తన స్నేహితుల్లో కూడా ఇదే సమస్యను గుర్తించింది బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల అనికా ఝా. దీనికి పరిష్కారంగా నాలుగు నెలలు కష్టపడి ‘ఛేంజ్‌ - ఇట్స్‌ నార్మల్‌’ పేరుతో ఓ యాప్‌ను అభివృద్ధి చేసిందామె. యుక్త వయసులోకి అడుగుపెట్టే అమ్మాయిలకు.. ఈ దశలో వారి శరీరంలో, మానసికంగా చోటుచేసుకునే మార్పులకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని దీని ద్వారా అందిస్తోందామె. అంతేకాదు.. ఇందులో చాట్బాట్‌, లైబ్రరీ, భావోద్వేగాల్ని నియత్రించే గేమ్‌, ఒకే రకమైన సమస్యల్ని ఎదుర్కొనే వారితో తమ సమస్యను పంచుకునే అవకాశం కల్పించడం, వారిలో స్ఫూర్తి నింపడం, ఆయా సమస్యలకు నిపుణుల సలహాలు.. వంటి ఫీచర్లెన్నో ఈ యాప్‌లో అందుబాటులో ఉంచింది అనిక. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల్లో తన యాప్‌ సేవల్ని అందిస్తోన్న ఆమె.. ఎంతోమంది ప్రశంసలందుకోవడమే కాదు.. ‘గ్రాండ్‌ ప్రైజ్‌’ వంటి పురస్కారాలూ అందుకుంది.


సైకిళ్లు అందిస్తూ..!

అసలే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిల్ని చదువుకునేలా ప్రోత్సహించడమే గగనమనుకుంటే.. కొన్ని సమస్యలు వారి చదువుకు ఆటంకం కలిగిస్తుంటాయి. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం, నెలసరి సమస్యలు.. వంటి వాటితో స్కూల్‌ మానేసే అమ్మాయిలు పెరగడం గుర్తించింది దిల్లీకి చెందిన జివ్యా లంబా. దీనికి పరిష్కారంగా ‘వుయ్‌ సైకిల్‌’ పేరుతో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. టీనేజీ అమ్మాయిలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఉన్న సైకిళ్లు అందించడమే ఈ ప్రచార కార్యక్రమ ముఖ్యోద్దేశం. తద్వారా అటు చదువుకునేలా ప్రోత్సహించడంతో పాటు ఇటు వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా చేస్తోంది. అంతేకాదు.. ఆయా కమ్యూనిటీ నాయకులతో మాట్లాడుతూ, అమ్మాయిల కుటుంబాల్లోని పెద్దల్ని ఒప్పిస్తూ.. వారి చదువుకు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోందామె. ఫలితంగా స్కూల్‌ మానేసే అమ్మాయిల సంఖ్య చాలావరకు తగ్గినట్లు చెబుతోంది జివ్య. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటోన్న సామాజిక సమస్యలు, నెలసరి సమస్యలు, పీసీఓఎస్‌.. వంటి వాటి పైనా అవగాహన కల్పిస్తోంది.

వీరితో పాటు తారిణి మల్హోత్రా (నయ్‌ సుభా ఫౌండేషన్), ప్రాచీ మిశ్రా (ప్రాజెక్ట్‌ నిలయ్‌), తారిణి రామ్‌చందాని (ప్రాజెక్ట్‌ అష్టమి), వినీషా ఉమాశంకర్‌ (సోలార్‌ ఐరనింగ్‌ కార్ట్‌).. ఇలా మొత్తంగా సుమారు 20 మంది అమ్మాయిలు ఈ ఏడాది డయానా పురస్కారానికి ఎంపికయ్యారు. దివంగత రాణి ప్రిన్సెస్‌ డయానా జ్ఞాపకార్థం.. సమాజానికి తమ వంతుగా సేవలందించే 9-25 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఏటా ఈ అవార్డుల్ని అందిస్తుంటుంది బ్రిటన్‌ ప్రభుత్వం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని