106 నాటౌట్.. చిరుధాన్యాలే సీక్రెట్!

వయసు వంద దాటింది. ఇంటి బాధ్యతలు, పొలం పనులతోనే ఇన్నేళ్లూ గడిచిపోయాయి. అయినా పరుగు పెట్టాలన్నది ఆమె కోరిక. ‘మరి, ఈ వయసులో ఆటలంటే నలుగురూ ఏమనుకుంటారో?’నని ఆలోచించలేదామె. తపనను వయసుతో...

Updated : 29 Jun 2023 12:28 IST

(Photos: Twitter)

వయసు వంద దాటింది. ఇంటి బాధ్యతలు, పొలం పనులతోనే ఇన్నేళ్లూ గడిచిపోయాయి. అయినా పరుగు పెట్టాలన్నది ఆమె కోరిక. ‘మరి, ఈ వయసులో ఆటలంటే నలుగురూ ఏమనుకుంటారో?’నని ఆలోచించలేదామె. తపనను వయసుతో ముడిపెట్టకూడదనుకుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం.. అంటే తన 104 ఏళ్ల వయసులో పరుగు పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. ఈ రెండేళ్లలోనే సుమారు 200 పతకాలు సాధించిందంటే.. ఆటలంటే తనకెంత ప్రాణమో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం డెహ్రాడూన్లో జరుగుతోన్న ‘18వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’లోనూ మూడు పసిడి పతకాలు గెలుచుకొని మరోసారి సత్తా చాటింది. ‘ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు..’ అంటోన్న 106 ఏళ్ల సూపర్‌ దాదీ రాంబాయి మాన్‌ స్ఫూర్తి గాథ ఇది!

రాంబాయిది హరియాణాలోని కద్మా అనే చిన్న గ్రామం. అక్కడే పుట్టి పెరిగిన ఆమె.. ఆలిగా, అమ్మగా, బామ్మగా.. ఇలా తన జీవితంలోని అన్ని దశల్నీ సంపూర్ణం చేసుకుంది. చిన్న వయసు నుంచి ఎంతో చురుగ్గా ఉండే ఆమె.. ఇటు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే.. అటు పొలం పనులూ చేసేది. అయితే ఆమెకు ఆటలన్నా మక్కువే! కానీ ఇంటి బాధ్యతలు, కట్టుబాట్ల కారణంగా తన కోరికకు తన మనసులోనే కళ్లెం వేసిందామె.

ఆమె స్ఫూర్తితో..!

ప్రస్తుతం 106 ఏళ్ల వయసున్న రాంబాయి.. ఇప్పటికీ ఇంట్లో తన పనులు తానే చేసుకుంటుంది. మరోవైపు పొలం పనుల్లోనూ తన కుటుంబ సభ్యులకు సహాయపడుతుంటుంది. అయితే ఇలా ప్రతి నిత్యం చురుగ్గా ఉండే ఈ బామ్మ.. రెండేళ్ల క్రితం పంజాబ్‌ దాదీ మన్‌ కౌర్‌ విజయాల గురించి ఓసారి టీవీలో చూసింది. ఆపై తన మనవరాలి సహాయంతో ఆమె గురించి మరింత లోతుగా తెలుసుకున్న రాంబాయి.. ఆమె స్ఫూర్తితో తానూ పరుగు పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.

‘ఆటలంటే ఎప్పట్నుంచో ఆసక్తి ఉన్నా.. ఇన్నాళ్లూ ఆ అవకాశం దొరకలేదు. కానీ నా 104 ఏళ్ల వయసులో నా మనవరాలి ప్రోత్సాహంతో తొలిసారి పరుగు పోటీల్లో పాల్గొన్నా. ఆ సమయంలో కాస్త భయంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. మైదానంలోకి అడుగు పెట్టగానే ఉత్సాహంగా, సంతోషంగా అనిపిస్తుంటుంది. పుట్టినప్పట్నుంచి ఊరు దాటి బయట అడుగుపెట్టింది లేదు.. కానీ పోటీల పుణ్యమా అని దేశమంతా తిరిగే అవకాశం దొరుకుతోంది..’ అంటోన్న రాంబాయి.. గత రెండేళ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో 200లకు పైగా పతకాలు సాధించింది.

‘ఈ వయసులో సాహసాలేంటి?’ అన్నారు!

సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ ఇలాంటి సాహసాలు చేయడానికి చాలామంది ముందుకు రారు. ఒకవేళ ధైర్యం చేసి వచ్చినా.. లేనిపోని భయాలతో ఇరుగుపొరుగు వారు వారిని వెనక్కి లాగాలని చూస్తారు. తన బామ్మ పరుగు పోటీల విషయంలోనూ ఇలాంటి సవాళ్లు ఎదురయ్యాయంటోంది ఆమె మనవరాలు షర్మిళ.

‘మా బామ్మ పరుగు పోటీల్లో పాల్గొనే విషయం గురించి క్షణాల్లో ఊరంతా తెలిసిపోయింది. ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలే కానీ.. ఈ సాహసాలేంటి అన్నారు చాలామంది. ఆటలంటూ పెద్దావిడను ఇబ్బంది పెడుతున్నారని మమ్మల్ని నిందించిన వారూ లేకపోలేదు. అప్పుడు నేను మన్‌ కౌర్‌ బామ్మ గురించి వాళ్లకు వివరించా. ఇక బామ్మ కూడా మొదట్లో పోటీల్లో పాల్గొన్నప్పుడు ట్రాక్‌ ప్యాంట్స్‌, రన్నింగ్‌ షూస్‌ వేసుకోవడానికి నిరాకరించేది. కానీ ఇప్పుడు అవీ తనకు సర్వసాధారణమైపోయాయి..’ అంటూ చెప్పుకొచ్చారామె. గతేడాది వదోదరలో నిర్వహించిన ‘నేషనల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌’ వంద మీటర్ల పరుగును కేవలం 45.50 నిమిషాల్లో పూర్తి చేసి.. అటు మన్‌ కౌర్‌ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు, ఇటు ప్రపంచ రికార్డునూ సృష్టించింది ఈ బామ్మ. ఇక తాజాగా డెహ్రాడూన్లో జరుగుతోన్న ‘18వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌’లోనూ.. 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగు, షాట్‌పుట్‌లలో.. మూడు పసిడి పతకాలు గెలుచుకొని మరోసారి సత్తా చాటిందీ పరుగుల దాదీ.


చిరుధాన్యాలే.. తన సీక్రెట్!

పరుగు పోటీల్లో భాగంగా.. 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల విభాగంలో పోటీపడుతూ పతకాల పంట పండిస్తోన్న రాంబాయి.. ‘గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ ఆఫ్‌ ఇండియన్‌ అథ్లెటిక్స్‌’గానూ పేరు గాంచింది. అయితే తాను ఈ వయసులోనూ చురుగ్గా పోటీల్లో పాల్గొనడం వెనుక తాను పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా ఓ కారణమంటోందీ బామ్మ.

‘ఉదయాన్నే నిద్ర లేచి రోజూ మూడునాలుగు కిలోమీటర్ల దూరం పరుగెత్తడం నాకు అలవాటు. ఆపై ఇంట్లో పనులు పూర్తి చేసుకొని, పొలానికి వెళ్తుంటా. నేను పూర్తి శాకాహారిని. పాలు, పెరుగు, నెయ్యి ఎక్కువగా తీసుకుంటా. అన్నం ఎప్పుడో ఒకసారి తింటాను. చిరుధాన్యాలు.. అందులోనూ జొన్న రొట్టే నా ప్రధాన ఆహారం. వయసే కాదు.. పోటీల్లో పాల్గొనకుండా ఏదీ నన్ను ఆపలేదు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. పరుగుతో నా ఫిట్‌నెస్‌ మరింత పెరిగింది..’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతోందీ గ్రానీ. రాంబాయి బామ్మే కాదు.. ఆమె కూతురు, మనవరాలు కూడా క్రీడాకారులే కావడం గమనార్హం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని