Nara Vijayalakshmi: కుంచెతో.. జీవితాన్ని దిద్దుకున్నా!
దివ్యాంగురాలు.. సాయం లేనిదే ఏ పనీ చేసుకోలేదు. అలాగని నా జీవితమింతే అని సరిపెట్టుకోలేదామె. కుంచె పట్టారు. దాంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. గిన్నిస్‌బుక్‌లో స్థానంతోపాటు తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి విశిష్ట పురస్కారాన్నీ అందుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.. నారా విజయలక్ష్మి.
దివ్యాంగురాలు.. సాయం లేనిదే ఏ పనీ చేసుకోలేదు. అలాగని నా జీవితమింతే అని సరిపెట్టుకోలేదామె. కుంచె పట్టారు. దాంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. గిన్నిస్‌బుక్‌లో స్థానంతోపాటు తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి విశిష్ట పురస్కారాన్నీ అందుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.. నారా విజయలక్ష్మి. తన విజయగాథను వసుంధరతో పంచుకున్నారిలా...
మాది మేడ్చల్ జిల్లా తుర్కపల్లి. అమ్మ ప్రమీల. నాన్న నర్సింహులు ఊరూరా తిరిగి దుస్తులమ్మేవారు. నలుగురు సంతానం. అమ్మానాన్నలది మేనరికం. అక్క, తమ్ముడు అంధులు. నాకేమో మూడేళ్లప్పుడు పోలియో సోకింది. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే అయినా ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను మామూలు స్థితికి రాలేనని తెలుసుకొని అమ్మానాన్న కుంగిపోయారు. తర్వాత బాధను దిగమింగుకొని మేమే ప్రపంచంగా బతికారు. నా కాళ్లు, చేతులూ దాదాపు 90 శాతం పనిచేయవు. స్కూలుకీ నాన్న, అన్నయ్య ఎత్తుకొని తీసుకెళ్లేవారు. కొంచెం పెద్దయ్యాక చక్రాల కుర్చీలో వెళ్లేదాన్ని.
ఆ కసితోనే..
‘వీళ్ల వల్ల ఏంటి ప్రయోజనం. ఏ పనీ సొంతంగా చేసుకోలేరు. ఏదైనా ఆశ్రమంలో చేర్చొచ్చుగా’ అని అమ్మానాన్నలకి చాలామంది సలహాలిచ్చేవారు. ఒకరికి భారం కాకూడదని వీలైనంతవరకూ నా పనులు నేనే చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. అయినా నడవలేను, స్నేహితులతో కలిసి ఆడలేను.. నాకే ఎందుకీ పరిస్థితి అని ఒకానొక దశలో మానసికంగా కుంగిపోయా. కానీ ‘మా పిల్లలు మాకు భారం కాద’ని అమ్మానాన్న అండగా నిలిచేవారు. దాంతో నిరూపించుకోవాలన్న కసి పెరిగింది. చిన్నతనం నుంచీ బొమ్మలు వేయడం నాకో వ్యాపకం. దీనిపైనే పూర్తిగా దృష్టిపెట్టా. చిన్న చిన్న మెలకువలు ఆన్‌లైన్లో చూసి నేర్చుకున్నా. దూరవిద్య ద్వారా చదువుతూనే చిత్రాలూ గీసేదాన్ని. స్వాతంత్య్ర సమరయోధులు, దేవతా రూపాలు, భారతీయ చరిత్రను చాటే చిత్రాలు.. అలా ఇప్పటివరకూ వందల బొమ్మలు గీశా. అదే జీవనాధారమైంది కూడా. ఎన్నో ఆన్‌లైన్ పోటీల్లో పాల్గొని పతకాలూ సాధించా. పాఠశాలల్లో, ఎగ్జిబిషన్లలో నా పెయింటింగ్‌లను ప్రదర్శనకు ఉంచుతుంటా. అలా తెలంగాణ భవన్ వేదికగా జాతీయస్థాయిలో ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నప్పుడు నటి అనితా చౌదరి మెచ్చుకోవడమే కాదు.. కొన్ని పెయింటింగ్‌లకు లామినేషన్ చేయించి ప్రోత్సహించారు. ఆపైనా ఎన్నో ప్రశంసలు అందుకున్నా. అయినా ఏదో అసంతృప్తి. దీంతో స్నేహితురాలి సలహాతో ‘విజయశ్రీ ఆర్ట్ వర్క్స్’ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించా. నా చిత్రాలను వీడియోలుగా తీసి పెడుతుంటా. ఎక్కువ మందికి నా కళ చేరువ అవుతుందన్న ఆశ. ఎడిటింగ్ కూడా నేనే చేస్తా.
గిన్నిస్‌లో చోటు..
నలుగురికీ సాయపడాలనుకుంటా. స్నేహితులమంతా కలిసి ‘డియర్ వన్ నియర్ వన్’ ఫౌండేషన్ స్థాపించాం. దాని ద్వారా తలసేమియా సోకిన చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలోనూ నిత్యావసర సరకులు అందించడం వంటివెన్నో చేశాం. 2018లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, 2019లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘స్ఫూరి’్త, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పికాసో, ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఇంటర్నేషనల్ అవార్డు వంటివెన్నో అందుకున్నా. 2020లో గిన్నిస్ బుక్ వాళ్లు నిర్వహించిన ‘ఐ డేర్ టు డ్రీమ్’ కాంటెస్ట్‌లో పాల్గొన్నా. గంటలో అత్యధిక చిత్రాలు అప్‌లోడ్ చేసి, రికార్డు సాధించా. 21, 22ల్లోనూ గెలిచా. ఒకప్పుడు ఏమీ చేయలేదు అన్నవారే ‘నువ్వు మన గ్రామానికే గర్వకారణ’మని అని ప్రశంసించడం మర్చిపోలేని అనుభూతి. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశిష్ట మహిళా పురస్కారాన్నీ అందుకున్నా. దివ్యాంగులంటే చాలామందికి చిన్నచూపు. వాళ్లలోనూ ప్రతిభ ఉంటుంది. కాస్త ప్రోత్సహిస్తే నిరూపించుకోగలరు! అందుకు నేనే ఉదాహరణ. నావరకూ దేశవిదేశాల్లో పేరు తెచ్చు కోవాలనుంది. ఆ దిశగా ప్రయత్నిస్తున్నా.
- బండి శ్రీరాములు, శామీర్‌పేట
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.