నాన్న బెల్టు చూసి.. సుమో రెజ్లర్ కావాలనుకున్నా..!

సుమో అనగానే అతి పెద్ద దేహదారుఢ్యం ఉన్న భారీకాయులే గుర్తొస్తారు.. చైనా, జపాన్ వంటి దేశాల్లో ఆదరణ ఉన్న ఈ రెజ్లింగ్‌ క్రీడలో ఎక్కువగా పురుషులే కనిపిస్తారు. ఇలాంటి పురుషాధిపత్యం ఉన్న విదేశీ క్రీడలో రాణించి.. గుర్తింపు సంపాదించుకుంది హేతల్‌ దావే.

Published : 19 Jun 2024 12:22 IST

(Photos: Instagram)

సుమో అనగానే అతి పెద్ద దేహదారుఢ్యం ఉన్న భారీకాయులే గుర్తొస్తారు.. చైనా, జపాన్ వంటి దేశాల్లో ఆదరణ ఉన్న ఈ రెజ్లింగ్‌ క్రీడలో ఎక్కువగా పురుషులే కనిపిస్తారు. ఇలాంటి పురుషాధిపత్యం ఉన్న విదేశీ క్రీడలో రాణించి.. గుర్తింపు సంపాదించుకుంది హేతల్‌ దావే. భారతదేశంలోనే తొలి, ఏకైక ప్రొఫెషనల్‌ మహిళా సుమో రెజ్లర్‌గా కీర్తి గడించిన ఆమె.. మన దేశంలో గుర్తింపు లేని ఈ క్రీడకు తన విజయాలతో గుర్తింపు తీసుకొచ్చింది. ఆడపిల్లలు ఆటల్లో రాణించడమే అరుదు అనుకొనే ఆ రోజుల్లో.. పురుషాధిపత్యం ఉన్న సుమో రెజ్లింగ్‌లో హేతల్‌ ఎలా రాణించగలిగింది? రండి.. తెలుసుకుందాం!

‘మవాషీ బెల్ట్‌’.. సుమో రెజ్లింగ్‌ క్రీడాకారులు నడుముకి ధరించే బెల్టు ఇది. పెరిగి పెద్దయ్యే క్రమంలో తన తండ్రి సుధీర్‌ దావే పలుమార్లు ఈ బెల్టు ధరించి సుమో రెజ్లింగ్‌ సాధన చేయడం గమనించింది హేతల్‌. దీంతో అప్పటివరకు జూడోలో రాణించాలనుకున్న ఆమె.. తన మనసు మార్చుకొని సుమో రెజ్లింగ్ వైపు మొగ్గు చూపింది.

నాన్నే కోచ్!

కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన హేతల్‌.. తన తండ్రి, అన్నయ్యను చూసి భవిష్యత్తులో క్రీడాకారిణిగానే స్థిరపడాలని నిర్ణయించుకుంది. అది కూడా సుమో రెజ్లింగ్‌ వంటి పురుషాధిక్యత ఉన్న క్రీడలో! చిన్న వయసు నుంచి బొద్దుగా ఉండడం కూడా హేతల్‌కు కలిసొచ్చిందని చెప్పచ్చు. అయితే ఈ క్రీడలో తన కూతురికి శిక్షణ ఇప్పించేందుకు హేతల్‌ తండ్రి.. కోచ్‌ కోసం చాలా వెతికారు. కానీ సుమో రెజ్లింగ్‌ క్రీడకు మన దేశంలో అప్పుడు అంత ఆదరణ లేకపోవడం.. మహిళల్ని ఇలాంటి ఆటల్లో ప్రోత్సహించకపోవడం వల్ల కోచ్‌లెవరూ ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దాంతో తన తండ్రే తనకు కోచ్‌గా మారాడంటోంది హేతల్.

‘ముంబయిలోని చిన్న గ్రామం మాది. మా తల్లిదండ్రులిద్దరికీ ఆటలంటే చాలా ఇష్టం! కానీ కొన్ని సామాజిక కట్టుబాట్లు, కుటుంబ బాధ్యతల కారణంగా.. వాళ్లు ఆటల్లో రాణించలేకపోయారు. కానీ నాకు, అన్నయ్యకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి మమ్మల్ని ఈ దిశగా ప్రోత్సహించారు. నాన్నకు సుమో రెజ్లింగ్‌లో ప్రవేశం ఉంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు ఈ క్రీడలో ఔత్సాహికులకు మెలకువలు నేర్పేవారు. నేనూ సుమో రెజ్లింగ్‌ నేర్చుకుంటానన్నప్పుడు నాన్న చాలా సంతోషించారు.. అనుభవజ్ఞుడైన కోచ్‌ కోసం వెతికారు. ముంబయిలో ఉన్న సుమో రెజ్లింగ్‌ అసోసియేషన్‌కూ వెళ్లాం. కానీ అమ్మాయినన్న కారణంతో ఎవరూ నాకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడు నాన్నే ఉద్యోగం మానేసి.. ఈ క్రీడలో నాకు కోచ్‌గా మారారు. జూడో, సుమో రెజ్లింగ్‌లలో శిక్షణ ఇచ్చారు..’ అని చెబుతోందీ ఫీమేల్ సుమో.

స్టేడియంలో సాధన!

చిన్న వయసు నుంచి బొద్దుగా ఉండే హేతల్‌.. తన అధిక బరువు కారణంగా చుట్టూ ఉన్న వారి నుంచి విమర్శల్ని, బాడీ షేమింగ్‌నీ ఎదుర్కొంది. ఇవే సుమో రెజ్లింగ్‌ పట్ల తన తపనను మరింతగా పెంచాయంటోందామె.

‘బొద్దుగా ఉండే వారిని మన సమాజం బలహీనులుగా భావిస్తుంది. కానీ జపాన్‌లో లావును దృఢత్వానికి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఇలాంటి భారీకాయుల కోసం సుమో రెజ్లింగ్‌ క్రీడ తెరమీదకొచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. అందుకే నేనూ అధిక బరువుండే వారు బలహీనులు కాదు.. బలవంతులు అని నిరూపించాలనుకున్నా. లావున్నావంటూ అందరూ నన్ను విమర్శిస్తుంటే.. దీన్నే నా బలంగా మార్చుకున్నా. నిజానికి ఆ సమయంలో దోహ్యో (సుమో రెజ్లింగ్‌ సాధన చేసే రింగ్‌) వంటి కనీస సదుపాయాలేవీ లేకపోవడంతో.. సాధారణ క్రికెట్‌ మైదానంలోనే సాధన చేయాల్సి వచ్చేది. అది కూడా పురుష ప్రత్యర్థులతోనే!’ అంటోన్న హేతల్‌.. సమాజం లోపాలుగా భావించేవే మన ప్రత్యేకతలు అంటూ పలువురిలోనూ స్ఫూర్తి నింపుతోంది.

200 మ్యాచులు.. పతకాల పంట!

తన తండ్రి శిక్షణలో సుమో రెజ్లింగ్‌లో ఓనమాలు దిద్దిన హేతల్‌.. సొంతంగా ఈ క్రీడలో మరిన్ని మెలకువలు నేర్చుకుంది. ఈ క్రమంలో సుమో రెజ్లింగ్‌ వీడియోలు చూస్తూ.. వాటిలోని టెక్నిక్స్‌ని అర్థం చేసుకొని సాధన చేసేది. తన తండ్రి, అన్నయ్యల వద్ద నుంచి నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు.. ఒక్కోసారి వారితోనే పోటీపడేది. ఇలా ఈ క్రీడలో ఆరితేరిన హేతల్‌.. 2008లో ఈస్టోనియాలో జరిగిన ‘ప్రపంచ సుమో రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో తొలిసారి పాల్గొని సత్తా చాటింది. ఆపై ‘వరల్డ్‌ గేమ్స్‌’లోనూ ప్రతిభ కనబరిచిన ఆమె.. 2015లో హాంగ్‌కాంగ్‌లో నిర్వహించిన ‘ఏషియన్‌ సుమో ఛాంపియన్‌షిప్’లో కాంస్య పతకం అందుకుంది. ఆ మరుసటి ఏడాదే బెంగళూరులో జరిగిన ‘జాతీయ సుమో ఛాంపియన్‌షిప్‌’లో బంగారు పతకం నెగ్గిన ఆమె.. తన కెరీర్‌లో సుమారు 200లకు పైగా జాతీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో దేశం తరపున పోటీపడి పతకాల పంట పండించింది. పలు అవార్డులూ అందుకుంది. ఇలా సుమో రెజ్లింగ్‌లో రాణిస్తూ.. ఈ క్రీడలో మన దేశాన్ని ప్రపంచపటంలో నిలిపిన హేతల్‌.. తన అరుదైన ఘనతలతో ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు’ల్లోనూ చోటు సంపాదించింది. ప్రస్తుతం ‘ప్రపంచ సుమో ర్యాంకింగ్స్‌ (మహిళలు)’లో టాప్‌-5లో కొనసాగుతోంది హేతల్.

వెండితెరపై.. ‘సుమో దీదీ’ జీవితం!

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సుమో రెజ్లింగ్‌ పోటీలు జరిగినా.. అక్కడ వాలిపోయి మన దేశం తరపున పోటీపడిన హేతల్‌.. ఈ క్రమంలో కొన్నిసార్లు పురుష ప్రత్యర్థులతోనూ పోటీపడి తన సత్తాను నిరూపించుకుంది. అంతేకాదు.. మన దేశంలోనూ ఎంతోమంది అమ్మాయిలు సుమో రెజ్లింగ్‌ క్రీడను తమ కెరీర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచింది. ఇలా దేశంలోనే తొలి, ఏకైక ప్రొఫెషనల్‌ మహిళా సుమో రెజ్లర్‌గా ఖ్యాతి గడించిన హేతల్‌ జీవిత చరిత్రను ‘సుమో దీదీ’గా తెరకెక్కించారు బాలీవుడ్‌ దర్శకుడు జయంత్‌ రోహట్గి. నటి శ్రీయం భగ్నానీ రీల్‌లైఫ్‌ హేతల్‌గా నటించి మెప్పించింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ‘మనం ఎంచుకున్న రంగమేదైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా.. ఆత్మ విశ్వాసం, అంకితభావంతో ముందుకు సాగితే.. లక్ష్యాన్ని చేరుకోవచ్చు..’ అంటోన్న హేతల్‌ ప్రస్తుతం ముంబయిలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు జూడో, రెజ్లింగ్‌, సుమో రెజ్లింగ్‌.. వంటి క్రీడల్లో పాఠాలు బోధిస్తోంది. లింగభేదం లేకుండా ఆయా క్రీడల్లో ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్