Nisha Solanki: రైతులకు ‘డ్రోన్’ పాఠాలు చెబుతోంది!
పైలట్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. కానీ తన కూతురు వ్యవసాయ రంగంలో సేవలందించాలన్నది ఆ తండ్రి కోరిక. ఈ రెండింటినీ ముడిపెట్టి అటు తన కోరికను, ఇటు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చింది హరియాణాకు...
(Photo: LinkedIn)
పైలట్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. కానీ తన కూతురు వ్యవసాయ రంగంలో సేవలందించాలన్నది ఆ తండ్రి కోరిక. ఈ రెండింటినీ ముడిపెట్టి అటు తన కోరికను, ఇటు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చింది హరియాణాకు చెందిన నిషా సోలంకి. అదీ డ్రోన్ పైలట్‌గా మారి! ఆ రాష్ట్రంలోనే తొలి అగ్రి డ్రోన్ పైలట్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. డ్రోన్ల సహాయంతో వేలాది ఎకరాల్లోని పంటలకు మందులు పిచికారీ చేస్తోంది. మరోవైపు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పంటలు పండించడంపై రైతులకు అవగాహన కూడా కల్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ రంగంలో ఇలాంటి మార్పులెన్నో తీసుకురావచ్చంటోన్న నిషా స్ఫూర్తి గాథ ఇది!
నిషాది హరియాణాలోని జజ్జర్ పట్టణం. ఆమె తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. చిన్నతనం నుంచి తన తండ్రి ధైర్య సాహసాల్ని చూస్తూ పెరిగిన ఆమె పైలట్ కావాలని తన జీవితాశయంగా పెట్టుకుంది. అయితే అదే సమయంలో తన కూతురు వ్యవసాయ రంగంలో సేవలందించడం చూడాలనుకున్నాడు ఆమె తండ్రి. ఈ విషయంలో తన తండ్రిని నొప్పించడం ఇష్టం లేక, తన ఆశయాన్ని వమ్ము చేయకుండా.. రెండింటికీ న్యాయం చేయాలనుకుంది నిషా.
అలా ఇద్దరి కోరికా తీరింది!
ఈ క్రమంలోనే ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఎంచుకోవాలనుకున్న తన కలను పక్కన పెట్టి.. ‘చౌధరి చరణ్ సింగ్ హరియాణా అగ్రికల్చరల్ యూనివర్సిటీ’లో ‘ఫార్మ్ మెషినరీ - పవర్ ఇంజినీరింగ్’ విభాగాల్లో చదువు పూర్తి చేసింది నిషా. ఆపై ఎంటెక్ కూడా పూర్తిచేసిన ఆమె.. 2019లో ‘రాష్ట్ర ఉద్యానవన శాఖ’లో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరింది. అయితే ఇదే సమయంలో అక్కడి ఓ డ్రోన్ల సంస్థ రైతుల కోసం ఇచ్చిన డెమోలో పాలుపంచుకుంది నిషా. తాను డ్రోన్‌ను చూడడం అదే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చిందామె.
‘ఇక్కడి ఓ సంస్థ వ్యవసాయం కోసం తయారుచేసిన డ్రోన్‌ను రైతుల ముందు పరీక్షించింది.. దాని తాలూకు వివరాలు వారికి వివరించింది. నిజానికి నేను డ్రోన్‌ను చూడడం అదే తొలిసారి. చాలా ఆసక్తిగా అనిపించింది. ఇదే మక్కువతో మహారాణా ప్రతాప్ హార్టికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్, సర్టిఫైడ్ డ్రోన్ పైలట్ అయిన సత్యేంద్ర యాదవ్‌ని కలిశాను. ఆయన ప్రోత్సాహంతోనే డ్రోన్ పైలట్ కావాలన్న సంకల్పం నాలో మొదలైంది. ఈ ఆశ గతేడాది నెరవేరింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి రిమోట్ పైలట్ సర్టిఫికెట్ అందుకున్నా. ఈ సంస్థ నుంచి సర్టిఫికేషన్ పొందిన వారు అగ్రి డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి అర్హులు. ఇలా పైలట్ కావాలన్న నా కోరిక తీరింది.. వ్యవసాయ రంగంలోకి రావాలన్న నాన్న ఆశయమూ నెరవేరింది..’ అంటోన్న నిషా.. హరియాణాలోనే తొలి అగ్రి డ్రోన్ పైలట్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కొన్ని రోజులకే దిల్లీలో జరిగిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్’లో పాల్గొని ప్రధాని మోదీని కలిసిందామె.
‘నువ్వు చేయగలవా?’ అన్నారు!
ప్రస్తుతం ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)’తో కలిసి పనిచేస్తోన్న నిషా.. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై ఆ రాష్ట్ర రైతులకు అవగాహన కల్పిస్తోంది. మరోవైపు డ్రోన్ పైలట్‌గా.. డ్రోన్ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేస్తోందామె. అయితే ఈ క్రమంలో తనకెదురైన పలు అనుభవాలను ఇలా పంచుకుంది నిషా.
డ్రోన్ పైలట్లుగా పురుషులే ఎక్కువమంది కనిపిస్తారు. అందుకే నేను క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమయ్యేటప్పుడు చాలామంది.. ఇది నేను చేయగలనో లేదోనని సందేహిస్తుంటారు. నిజానికి లింగ భేదం అనేది నేను ఇక్కడే ప్రత్యక్షంగా చూశాను. ఇంట్లో అమ్మానాన్నలెప్పుడూ ‘నువ్వు అమ్మాయివి.. ఈ పనులే చేయాలి.. ఈ రంగాలే ఎంచుకోవాలి!’ అని అనలేదు. అందుకే రైతుల మాటలు నవ్వు తెప్పించేవి. అదే సమయంలో డ్రోన్ ఆపరేట్ చేస్తూ.. అక్కడే వారి సందేహాలకు తెరదించేదాన్ని..’ అంటూ క్షేత్రస్థాయిలో తానెదుర్కొన్న అనుభవాల్ని గుదిగుచ్చిందామె.
750కి పైగా సెషన్స్..!
డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే విషయంలో ఇప్పటికే హరియాణాలోని కర్నాల్, హిసర్, అంబాలా, కురుక్షేత్ర, సోనిపట్.. వంటి ఎన్నో ప్రాంతాల్లో రైతులకు డెమోలిచ్చింది నిషా. ఇలా సుమారు 750కి పైగా సెషన్స్ నిర్వహించిన ఆమె.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు ఇటు పర్యావరణానికి, అటు రైతుల ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని చెబుతోంది.
‘చేత్తో, ట్రాక్టర్ సహాయంతో పంటకు మందులు పిచికారీ చేయడం వల్ల నీళ్లు-ఉపయోగించే పెస్టిసైడ్స్ ఎక్కువ మొత్తంలో అవసరమవుతాయి. అదే డ్రోన్ల ద్వారా ఈ వినియోగాన్ని చాలావరకు తగ్గించచ్చు. ఇక చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు.. చేత్తో లేదంటే ట్రాక్టర్ సహాయంతో మందులు పిచికారీ చేయడం వల్ల అది రైతుల శరీరాలపై పడుతుంది.. వాతావరణంలోనూ కలుస్తుంది.. దీనివల్ల అటు పర్యావరణానికి నష్టం.. ఇటు రైతులకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు తప్పవు. ఈ తిప్పలన్నీ తప్పాలంటే డ్రోన్ల ద్వారా ఏరియల్ స్ప్రేయింగ్ చక్కటి ప్రత్యామ్నాయం. నా సెషన్స్‌లో ఎక్కువగా ఈ విషయాల పైనే రైతుల్లో అవగాహన పెంచుతున్నా. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో ఎన్నో సానుకూల మార్పులు తీసుకురావచ్చు..’ అంటోన్న నిషా.. మరోవైపు డ్రోన్ వ్యవసాయంపై పలువురు విద్యార్థులకూ శిక్షణనిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.