Arshia Goswami: ఎనిమిదేళ్లే.. 60 కిలోల బరువులెత్తేస్తోంది!
‘పిల్లల్ని తమకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే అందులో ప్రత్యేకంగా రాణించగలుగుతారు..’ తాజాగా ఈ విషయం మరోసారి రుజువు చేసింది హరియాణాకు చెందిన అర్షియా గోస్వామి. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఈ అమ్మాయి.. కిలోల కొద్దీ బరువులెత్తుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం....
(Photo : Instagram)
‘పిల్లల్ని తమకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే అందులో ప్రత్యేకంగా రాణించగలుగుతారు..’ తాజాగా ఈ విషయం మరోసారి రుజువు చేసింది హరియాణాకు చెందిన అర్షియా గోస్వామి. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఈ అమ్మాయి.. కిలోల కొద్దీ బరువులెత్తుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఎనిమిదేళ్లున్న ఈ చిన్నది.. 60 కిలోల బరువునూ అలవోకగా ఎత్తేస్తూ.. తనదైన ప్రత్యేకతను చాటుతోంది. ఇలా ఇటీవలే ఈ అమ్మాయి చేసిన ఓ అరుదైన సాహసం తాజాగా సోషల్ మీడియాలో వైరలైంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణిస్తూ ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ జూనియర్ ఛాంపియన్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!
హరియాణాలోని పంచ్‌కులలో జన్మించింది చిన్నారి అర్షియా. ఆమె తండ్రి అవ్‌నీష్ సర్టిఫైడ్ ఫిట్‌నెస్ ట్రైనర్. పసి వయసు నుంచే తన తండ్రిని గమనిస్తూ పెరిగిన ఆమెకూ క్రమంగా ఫిట్‌నెస్ అంటే మక్కువ పెరిగింది. దీనికి తోడు బరువులెత్తడంపై ప్రత్యేకంగా దృష్టి సారించేదామె. ఇలా తమ కూతురి ఇష్టాయిష్టాల్ని గుర్తించిన అర్షియా తల్లిదండ్రులు.. ఆమెను ఈ రంగంలోనే ప్రోత్సహించాలనుకున్నారు. అలా ఐదేళ్ల వయసు నుంచే బరువులెత్తడం, తైక్వాండో, పవర్‌లిఫ్టింగ్.. వంటి అంశాల్ని సాధన చేయడం ప్రారంభించిందామె.
ఆరేళ్లకే అరుదైన సాహసం!
ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకాల వేట మొదలుపెట్టింది అర్షియా. ఇంకోవైపు.. అరుదైన రికార్డుల పైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. 2021లో తన ఆరేళ్ల వయసులో 45 కిలోల బరువెత్తి ‘యంగెస్ట్ డెడ్‌లిఫ్టర్’గా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డు’ల్లో చోటు సంపాదించింది. ఇక అప్పట్నుంచి ఆమె దశ తిరిగిపోయింది. ఆపై తన వెయిట్‌లిఫ్టింగ్ నైపుణ్యాలతో ‘ఏషియా బుక్ ఆఫ్ రికార్డు’ల్లోనూ స్థానం సంపాదించింది అర్షియా. కేవలం కిలోల కొద్దీ బరువులెత్తడమే కాదు.. వెయిట్‌లిఫ్టింగ్‌లో భాగంగా స్క్వాట్ లిఫ్టింగ్‌లో 46 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 25 కిలోల దాకా బరువులెత్తుతూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోందీ చిన్నారి లిఫ్టర్. రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు బంగారు పతకాలు సాధించిన అర్షియా.. దేశంలోనే అతిపిన్న డెడ్‌లిఫ్టర్‌గా పేరు సంపాదించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. కెనడాకు చెందిన పదేళ్ల రోరీ వ్యాన్ తర్వాత ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది అర్షియానే!
వీడియోలతో పాపులర్!
వయసుకు మించి కిలోల కొద్దీ బరువులెత్తుతూ అనితర సాధ్యమైన రికార్డులు సాధిస్తోన్న అర్షియాకు బయటే కాదు.. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే! ఇందుకు కారణం.. ఆమె వెయిట్‌లిఫ్టింగ్ వీడియోలను ఆమె తండ్రి తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే! ప్రస్తుతం తన ఇన్‌స్టా ఖాతాకు 3.7 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు. ఇక ఇటీవలే మరో వీడియోతో నెటిజన్లను కట్టిపడేసిందీ గర్ల్ లిఫ్టర్. ఎనిమిదేళ్ల అర్షియా 60 కిలోల బరువెత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరలైంది. ఇందులో ఆమె చూపిన నైపుణ్యాలకే కాదు.. తన ఆత్మవిశ్వాసాన్నీ అందరూ ప్రశంసిస్తున్నారు. ‘ఏదో ఒక రోజు దేశం నిన్ను చూసి గర్వపడుతుంద’ని ప్రశంసిస్తూనే.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. నీ భవిష్యత్ లక్ష్యాలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా..’ అంటూ ఆశీర్వదిస్తున్నారు.
మరో ‘మీరాబాయి’నవుతా!
అయితే అర్షియా ఇలా కిలోల కొద్దీ బరువులెత్తడం వెనుక తన పట్టుదలతో పాటు, తాను పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలీ ఓ కారణమే అంటున్నారు ఆమె తండ్రి అవ్‌నీష్. చిన్న వయసు నుంచి తన కూతురు ఇంటి ఆహారానికే ప్రాధాన్యమిస్తుందని, బయటి పదార్థాల్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారాయన. ఇక మణిపురీ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందించిన స్ఫూర్తి తన విజయాలకు ప్రధాన కారణం అంటోంది అర్షియా.
‘నా ఆసక్తిని గమనించి అమ్మానాన్నలు చిన్నతనం నుంచే నన్ను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంజాయ్ చేయడానికి, దేశంలోనే అతి పిన్న వెయిట్‌లిఫ్టర్‌గా ఘనత సాధిస్తున్నానంటే ఆ క్రెడిట్ మా పేరెంట్స్‌కే దక్కుతుంది. మరోవైపు మీరాబాయి చాను కూడా నా స్ఫూర్తి ప్రదాత! తనలా పెద్దయ్యాక దేశానికి పతకాల పంట పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగే ఒలింపిక్స్‌లో కూడా మెడల్ సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నా..’ అంటోందీ చిన్నారి వెయిట్‌లిఫ్టర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.