Published : 19/02/2022 15:47 IST

అలా విధిని ఓడించి విన్నరైంది!

(Photo: Twitter)

జీవితం పూల పాన్పు కాదు.. సుఖాలొస్తే పొంగిపోయి, కష్టాలకు కుంగిపోతే ఎక్కడున్నామో అక్కడే ఆగిపోతాం.. అదే మనవి కాని రోజుల్లోనూ మనమేంటో తెలుసుకొని ధైర్యంగా అడుగు ముందుకేస్తే విజయమే మన పాదాక్రాంతమవుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఇన్షా బషీర్‌ జీవితం. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇన్షా 15 ఏళ్ల వరకు అందరమ్మాయిల్లాగే భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అవేవీ నెరవేరకుండా ఓ ప్రమాదం తనని శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. ఇందుకు మొదట్లో కుంగిపోయినా ఆ తర్వాత తన కెరీర్‌పై దృష్టి పెట్టింది ఇన్షా. తన ప్రాణానికి ప్రాణమైన బాస్కెట్‌ బాల్‌ను ఎంచుకొని.. ఇప్పుడు కశ్మీర్‌లోనే ‘తొలి వీల్‌ఛైర్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి’గా ఎదిగింది. తనలాంటి శారీరక లోపాలున్న అమ్మాయిల్ని క్రీడల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యంగ్‌ ప్లేయర్‌.. మరోవైపు పారాలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం అందిస్తే జీవితం సార్థకమవుతుందంటోంది.

ఇన్షా బషీర్‌.. చిన్నతనం నుంచే చాలా చురుకైన అమ్మాయి. ఆటలంటే మక్కువ చూపేది. పెరిగి పెద్దయ్యే క్రమంలో అందరిలాగే తానూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సాధించాలని కలలు కంది. అయితే క్షణాల్లోనే ఆ కలల మేడ కూలిపోతుందని అప్పుడు ఆమె ఊహించలేదు. పదిహేనేళ్ల వయసులో ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇన్షా.. ఆ తర్వాత చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది.

‘ఎందుకు బతికావు?’ అన్నారు!

 ‘ఇన్షా ఇకపై నడవలేదు..’ తీవ్ర గాయాల పాలైన తనకు చికిత్స చేసిన డాక్టర్లు చెప్పిన ఈ మాటల్ని విని భోరుమంది. ఈ బాధతో రోజురోజుకీ మానసికంగా కుంగిపోయానని, ఒక్కో ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవని చెబుతోంది ఇన్షా.

‘జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సాధించాలని కలలు కన్నా. ప్రమాదం తర్వాత డాక్టర్‌ చెప్పిన మాటలు విని క్షణాల్లోనే నా కలల సౌధం కూలిపోయింది. భవిష్యత్తంతా అంధకారమైపోయినట్లనిపించింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి. ఇలా వీటికి తోడు బంధువులు తమ మాటలతో రాబందుల్లా పొడుచుకు తినేవాళ్లు. ‘ఇలా జీవచ్ఛవంలా బతికే బదులు అప్పుడే చనిపోయి ఉండాల్సింది..’ అంటూ తమ మాటలతో హింసించేవారు. ఇలాంటి ప్రతికూల సమయంలోనే నాన్న నా వెన్ను తట్టారు. జీవితంపై ఓ ఆశ కల్పించారు.. ఈ క్రమంలోనే శ్రీనగర్‌లోని ఓ రీహ్యాబిలిటేషన్‌ సెంటర్‌లో కొన్ని నెలల పాటు ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నా..’ అంటూ తన జీవితంలోని గడ్డు పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది ఇన్షా.

చిగురించిన ఆశ!

ఓవైపు శారీరకంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూనే మరో వైపు చదువుపై దృష్టి పెట్టింది ఇన్షా. ఈ క్రమంలోనే డాక్టర్‌ కావాలన్న కోరికతో ఎంబీబీఎస్‌ పరీక్ష రాసి అర్హత సాధించింది. కానీ వివిధ కారణాల వల్ల ఆ ఆశయాన్ని విరమించుకున్న ఆమె.. బీఏ, బీఈడీ పూర్తి చేసింది. అయితే చిన్న వయసు నుంచే ఆటలపై మక్కువ చూపే ఆమె.. ఫిజియోథెరపీ తీసుకునే క్రమంలోనే బాస్కెట్‌ బాల్‌ను తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిశ్చయించుకున్నానంటోంది.

‘ఫిజియోథెరపీ తీసుకునే క్రమంలోనే పురుషుల వీల్‌ఛైర్‌ బాస్కెట్‌ బాల్‌ జట్టును కలిశా. అవరోధాల్ని అధిగమిస్తూ వారు సాధన చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. సాధించాలన్న పట్టుదల ఉంటే ఈ అడ్డంకులన్నీ తొలగించుకోవచ్చన్న విషయం వారిని కలిశాకే అర్థమైంది. నాకు చిన్నతనం నుంచి ఆటలంటే ఇష్టం.. కాబట్టి బాస్కెట్‌బాల్‌ను నా కెరీర్‌ ఆప్షన్‌గా ఎందుకు ఎంచుకోకూడదు? అనిపించింది. అయితే అప్పటికి పురుషుల మాదిరిగా మహిళల వీల్‌ఛైర్‌ బాస్కెట్‌బాల్‌ జట్టు జమ్మూకశ్మీర్‌లో లేదు. దీంతో కొన్నాళ్ల పాటు పురుషులతోనే సాధన చేశా. దేశంలో ఎక్కడ మహిళల వీల్‌ఛైర్‌ జట్ల శిక్షణ శిబిరాలు జరిగినా రీహ్యాబిలిటేషన్‌ సెంటర్‌ వారి చొరవతో అక్కడికి వెళ్లేదాన్ని. అలా బాస్కెట్‌బాల్‌లో నైపుణ్యాలు సాధించాక దేశవ్యాప్తంగా పలు పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుంది ఇన్షా.

తనకు తానే స్ఫూర్తిగా..!

ఇలా ఓవైపు పోటీల్లో పాల్గొంటూనే.. మరోవైపు చదువుపై దృష్టి పెట్టిందీ యువ క్రీడాకారిణి. అంతేకాదు.. తన ప్రతిభను గుర్తించి ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు యూఎస్‌ కాన్సులేట్‌ నుంచి ఆహ్వానం కూడా అందుకుంది. ప్రస్తుతం రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా విమెన్స్‌ బాస్కెట్‌ బాట్‌ జట్టులో సభ్యురాలిగా కొనసాగుతోంది. మరోవైపు తనలాంటి శారీరక లోపాలున్న అమ్మాయిల్లో స్ఫూర్తి నింపడానికి సోషల్‌ మీడియా వేదికగా వాళ్లతో టచ్‌లో ఉంటూ స్ఫూర్తిదాయక మాటలు చెబుతుంటుంది ఇన్షా.
‘శారీరక లోపాలున్నా తమను తాము నిరూపించుకోవాలనుకుంటోన్న అమ్మాయిలు ఇక్కడ చాలామందే ఉన్నారు. వారిలో బాస్కెట్‌బాల్‌పై మక్కువ చూపే వారూ లేకపోలేదు. అలాంటి వారందరినీ కలిపి ఒక జట్టుగా తయారుచేస్తే.. జమ్మూకశ్మీర్‌లో ఆల్‌ విమెన్‌ వీల్‌ఛైర్‌ బాస్కెట్‌ బాల్‌ టీమ్‌ లేదన్న అంసతృప్తికి తెరపడుతుంది..’ అంటోన్న ఇన్షా పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానంటోంది. మరోవైపు టెడెక్స్‌ వంటి వేదికల పైనా తన జీవితానుభవాల్ని పంచుకుంటూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని