Anukriti Sharma IPS: ఆ వృద్ధురాలి ఇంట్లో ‘వెలుగులు’ నింపింది!

ఆమె ఇంట్లో కొన్ని దశాబ్దాల నుంచీ కరెంట్ లేదు.. రాత్రయ్యిందంటే దీపంతో సరిపెట్టుకోవాల్సిందే! ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. అయినా ఆ ఇంటికి కరెంట్‌ కనెక్షన్‌ ఇప్పించే నాథుడే కరువయ్యాడు. పోనీ.. డబ్బు ఖర్చు పెట్టి కరెంట్‌ కనెక్షన్‌....

Updated : 29 Jun 2023 19:32 IST

(Photos: Instagram)

ఆమె ఇంట్లో కొన్ని దశాబ్దాల నుంచీ కరెంట్ లేదు.. రాత్రయ్యిందంటే దీపంతో సరిపెట్టుకోవాల్సిందే! ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. అయినా ఆ ఇంటికి కరెంట్‌ కనెక్షన్‌ ఇప్పించే నాథుడే కరువయ్యాడు. పోనీ.. డబ్బు ఖర్చు పెట్టి కరెంట్‌ కనెక్షన్‌ తీసుకుందామా అంటే.. ఆ స్థోమత కూడా లేని కడు పేదరికం.. దీనికి తోడు వయోభారం. ఇలాంటి దీన స్థితిలో ఉన్న నూర్జహాన్‌ ఇంటికి ఇటీవలే విద్యుత్తు కనెక్షన్‌ అందించి వార్తల్లో నిలిచారు యూపీ ఐపీఎస్‌ అధికారిణి అనుకృతి శర్మ. ఏ సమాజ సేవ చేయాలన్న సంకల్పంతో తానీ ప్రభుత్వ సర్వీసులోకి అడుగుపెట్టారో.. అడుగడుగునా అలాంటి సేవా కార్యక్రమాలతోనే ప్రజల మన్ననలందుకుంటున్నారామె. ‘ఆ అవ్వ ఇంట్లో వెలుతురు కంటే ఆమె ముఖమే మరింత ప్రకాశవంతంగా వెలుగుతోందని, అది చూసి నా మనసు నిండిపోయిందం’టోన్న ఆనుకృతి.. మంచి మనసు గురించి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. సీనియర్‌ అధికారుల దగ్గర్నుంచి నెటిజన్ల దాకా ఆమె చేసిన మంచి పనిని కొనియాడుతున్నారు.

2020 బ్యాచ్‌కు చెందిన అనుకృతి శర్మ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ క్యాడర్‌లో పని చేస్తోంది. అక్కడి బులంద్‌షహర్‌లో అడిషనల్‌ ఎస్పీగా సేవలందిస్తోన్న ఆమెకు.. తన వద్దకొచ్చిన ఫిర్యాదులకు వేగంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటుందన్న మంచి పేరుంది. దాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు అనుకృతి.

విద్యుత్తుతో వెలుగులు నింపింది!

బులంద్‌షహర్‌కు దగ్గర్లోని ఓ గ్రామంలో నూర్జహాన్‌ అనే 70 ఏళ్ల వృద్ధురాలు దశాబ్దాలుగా నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన ఆమె.. గతేడాది తన కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించింది. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటోన్న నూర్జహాన్‌ ఇంట్లో కరెంట్‌ లేక దశాబ్దాలవుతోంది. రాత్రయ్యిందంటే దీపంతోనే సర్దుకుపోవాలి. అలాగని కరెంట్‌ కనెక్షన్‌ కూడా తీసుకోలేని కడు పేదరికం.. మరోవైపు వృద్ధాప్యం! ఇలాంటి పరిస్థితుల నడుమ ఉన్న నూర్జహాన్‌.. ఈమధ్యే తన ఫిర్యాదును ఆ నగర ఏఎస్పీ అనుకృతి దృష్టికి తీసుకెళ్లింది. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన ఆమె.. పోలీసు నిధులతో, విద్యుత్‌ అధికారుల చొరవతో ఇటీవలే ఆ అవ్వ ఇంటికి కరెంట్‌ కనెక్షన్‌ ఇప్పించారు. తన బృందంతో కలిసి వెళ్లి నూర్జహాన్‌ ఇంట్లో వెలుగులు నింపారు. ఆపై స్వీట్లు పంచుతూ ఆమె కళ్లల్లో ఆనందం నింపారు. ఈ క్షణాల్ని ఫొటోల్లో బంధించి సోషల్‌ మీడియాలోనూ పంచుకున్నారామె.

‘నా జీవితంలో ఇదో అద్భుతమైన క్షణం. నూర్జహాన్‌ ఆంటీ ఇంటికి కరెంట్‌ ఇప్పించడంతో ఆమె జీవితంలో వెలుగులు నింపినట్లయింది. ఆమె ముఖంపై చిరునవ్వు చూసి నా మనసు నిండిపోయింది.. ఈ సంతృప్తిని మాటల్లో వర్ణించలేను..’ అన్నారామె. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలకు లక్షల కొద్దీ వ్యూస్‌ రావడమే కాదు.. ఈ ఐపీఎస్‌ అధికారిణి చొరవను నెటిజన్లు కొనియాడుతున్నారు. ‘పోలీసు శాఖకు ఇలాంటి అధికారులే అవసరం.. కీప్‌ ఇట్‌ అప్‌!’ అంటూ అటు అధికారులు, ‘హ్యాట్సాఫ్‌ మేడమ్‌!’ అంటూ ఇటు నెటిజన్లు.. అనుకృతిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

సైంటిస్ట్‌ కావాలనుకుంది.. కానీ!

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పుట్టి పెరిగిన అనుకృతి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వోద్యోగులే! క్రమశిక్షణ, ఉన్నత విలువల మధ్య పెరిగిన ఆమె.. తన పేరెంట్స్‌ స్ఫూర్తితో చిన్నతనం నుంచి చదువులో మెరుగ్గా రాణించేది. శాస్త్రవేత్త కావాలనేది ఆమె చిన్ననాటి కల. ఈ మక్కువతోనే సైన్స్‌ రంగాన్ని ఎంచుకున్న అనుకృతి.. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడే ఓ సంఘటన స్ఫూర్తితో తన మనసు మార్చుకున్నానని చెబుతోంది.

‘అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా. మా కాలేజీ బయట ఒక టీ కొట్టు వ్యాపారి తన 15 ఏళ్ల కూతురిని తన కంటే రెట్టింపు వయసున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డా. ఇలా బాల్య వివాహాల ముసుగులో అన్యాయమైపోతోన్న ఎంతోమంది అమ్మాయిలకు న్యాయం చేయాలనిపించింది. అందుకే నా సైంటిస్ట్‌ కలను పక్కన పెట్టి ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకున్నా.. మూడో ప్రయత్నంలో నా కల నెరవేరింది..’ అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు అనుకృతి.

బాలికలు, మహిళలకు.. అండగా!

అమెరికాలోని రైస్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసుకొని ఇండియాకు తిరిగొచ్చాక వివాహబంధంలోకి అడుగుపెట్టారు అనుకృతి. ఆ తర్వాతే భర్త ప్రోత్సాహంతో సివిల్స్‌కు సన్నద్ధమవడం ప్రారంభించారు. తొలి ప్రయత్నం విఫలమైనా.. రెండో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. అయినా విశ్రమించక ప్రయత్నించి మూడో ప్రయత్నంలో ఐపీఎస్‌ ర్యాంకు సాధించారామె. సమాజ సేవే లక్ష్యంగా ప్రభుత్వ సర్వీసుల్లోకి అడుగుపెట్టిన అనుకృతి.. 2020 నుంచి ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ క్యాడర్‌లోనే పని చేస్తున్నారు. ప్రస్తుతం బులంద్‌షహర్‌ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె.. బాల్యవివాహాలు, గృహ హింస పేరుతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేస్తూ.. బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ‘పోలీస్‌ మై ఫ్రెండ్‌’ అనే కార్యక్రమానికి తెర తీశారు. తద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాల్యవివాహాలు, గృహ హింస రేటు తగ్గడంలో కీలక పాత్ర పోషించారీ ఐపీఎస్‌ అధికారిణి. ఇవే కాదు.. ఆయా గ్రామాల్లో జూదం, బెట్టింగ్‌, సారాయి, గంజాయి.. వంటి వాటికి సంబంధించిన నేరాల్నీ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు అనుకృతి. ఇలా తాను వేసే ప్రతి అడుగుతోనూ.. ‘పోలీసులు ప్రజల రక్షక భటులు’.. అన్న ధైర్యాన్ని అక్కడి ప్రజలకు ఇచ్చారీ డేరింగ్‌ ఆఫీసర్.


మారథానర్‌గానూ..!

వృత్తిరీత్యా తన విధుల్లో ఎప్పుడూ బిజీబిజీగా గడిపే అనుకృతి.. ఖాళీ సమయాల్లో పరుగుకు ప్రాధాన్యమిస్తానంటున్నారు. తరచూ 1కే, 3కే, 5కే.. వంటి పరుగు పోటీల్లో పాల్గొనడానికి ఇష్టపడే ఆమె.. ఇది తనకు ఆరోగ్యపరంగా, మానసికంగా ఎంతో మేలు చేసిందంటున్నారు.

‘గతంలో నాకు థైరాయిడ్‌ ఉండేది. కానీ పరుగు పుణ్యమా అని ప్రస్తుతం అది అదుపులోనే ఉంది. ఇది నన్ను శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంచుతుంది. ప్రతి నిత్యం నాలో ఉత్సాహాన్ని నింపుతుంది. మారథాన్‌ దూరం ఎంతైనా.. పరుగు పూర్తయ్యాక నాలో ఏదో తెలియని సంతోషం, సంతృప్తి కలుగుతాయి. ఓసారి ట్రయాథ్లాన్‌ (పరుగు, ఈత, సైక్లింగ్‌)లోనూ పాల్గొన్నా..’ అంటోన్న అనుకృతి.. గతంలో ఓసారి హైదరాబాద్‌ మారథాన్‌లోనూ భాగమైంది. ఇక డ్యాన్స్‌, ట్రావెలింగ్‌ అన్నా ఈ సూపర్‌ కాప్‌కు చాలా ఇష్టమట! ఈ క్రమంలోనే తాను పర్యటించిన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, డ్యాన్స్‌ వీడియోల్ని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తుంటుందీ ఐపీఎస్‌ ఆఫీసర్‌. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగానూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది అనుకృతి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని