KBC: 22 ఏళ్ల కల.. కేబీసీలో పాల్గొని కోటీశ్వరురాలైంది!

‘ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు..’ ఈ విషయాన్ని తాజాగా రుజువు చేసింది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా. పోటీ పరీక్ష కోసం పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నించినట్లే.. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’తో కోటీశ్వరురాలిని కావాలని 22 ఏళ్లుగా ఓ పెద్ద తపస్సే....

Published : 21 Sep 2022 20:37 IST

(Photos: Screengrab)

‘ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు..’ ఈ విషయాన్ని తాజాగా రుజువు చేసింది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా. పోటీ పరీక్ష కోసం పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నించినట్లే.. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’తో కోటీశ్వరురాలిని కావాలని 22 ఏళ్లుగా ఓ పెద్ద తపస్సే చేసిందామె. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మధ్యమధ్యలో అడ్డంకులు, అవాంతరాలు, ఓటములు.. ఇలా ఎన్నో తన లక్ష్యానికి అడ్డుపడాలని చూశాయి. అయినా విశ్రమించలేదామె. ఈ పట్టుదలే ఇటీవల ఈ కార్యక్రమంలో రూ. కోటి గెలుచుకునేలా ప్రేరేపించింది. ఇంటర్‌ పూర్తిచేసి ఓ సాధారణ గృహిణిగా స్థిరపడిన ఆమె.. హాట్‌ సీట్‌ వరకూ చేరుకోవడం వెనుక ఓ అసాధారణ కథే ఉంది. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే..!

మాది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌. నాన్న గురుభక్ష్‌ రాయ్‌.. కుటుంబ పోషణ కోసం ఎన్నో పనులు/వ్యాపారాలు చేశారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. నానాటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంతమాత్రంగానే తయారయ్యాయి. దీంతో అతి కష్టం మీద 12వ తరగతి వరకు చదువుకున్నా. ఆపై ఇష్టం లేకపోయినా చదువు మానేసి ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. అప్పుడే కుట్టు పని నాకు పరిచయమైంది. ఇందులో అమ్మకు సహకరించేదాన్ని. అలా రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తే వచ్చిన డబ్బులు రూ. 20.

అది చూశాకే డిసైడయ్యా!

ఆ తర్వాత 1999లో నాకు వివాహమైంది. భర్త విజయ్‌ చావ్లా.. బట్టల వ్యాపారి. 2000లో ఓ కొడుక్కి తల్లినయ్యా. ఈ ఏడాది నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఇదే సంవత్సరం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ టీవీ షో ప్రారంభమైంది. ఓ రోజు నా కొడుకును ఒళ్లో పడుకోబెట్టుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నా. అప్పుడే కేబీసీ తొలి ఎపిసోడ్‌ మొదలైంది. ఆ కార్యక్రమం నాకెంతో నచ్చింది. ఆ క్షణం సోఫాలో కూర్చున్న నేను.. ఎప్పటికైనా కేబీసీ హాట్‌ సీట్లో కూర్చోవాలని బలంగా నిశ్చయించుకున్నా. ఇంట్లో పనులు, బాబు బాధ్యతలతో క్షణం తీరిక దొరికేది కాదు.. అయినా ఏ కాస్త సమయం దొరికినా పుస్తకాలు, వార్తాపత్రికలతో కుస్తీ పట్టేదాన్ని. అయితే ఇదంతా కేబీసీ కోసం అని నాకు తప్ప ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇలా నేను చదువుతుంటే అందరూ నాకు పుస్తక పఠనం అంటే ఇష్టం అనుకునేవారు. వాళ్లేమనుకున్నా.. అనుకున్నది సాధించే వరకూ మాత్రం ఎవరికీ చెప్పకూడదనుకున్నా.

అందినట్లే అంది చేజారింది!

ఇక ఇటు ప్రిపేరవుతూనే.. అటు కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నాలు మొదలుపెట్టా. ఈక్రమంలో చాలాసార్లు అవకాశం అందినట్లే అంది చేజారిపోయేది. కేబీసీ నుంచి ఫోన్‌ వచ్చినా.. తదుపరి ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో అర్థం కాకపోవడం, మరోసారి ఆడిషన్‌కు వెళ్లినా ఎంపిక కాలేకపోవడం, ఆఖరికి గతేడాది టాప్‌-10లో ఉన్నా కంప్యూటర్‌ నాలెడ్జ్‌ లేక హాట్‌ సీట్‌ వరకూ వెళ్లలేకపోవడం.. ఇలా అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. అయినా ఒక్కోదాన్నీ ధైర్యంగా దాటుతూ ముందుకు సాగా. గతేడాదే నేను కేబీసీ కోసం ప్రయత్నిస్తున్నానన్న విషయం ఇంట్లో వాళ్లకు, ఇరుగుపొరుగు వాళ్లకు తెలిసింది. కానీ అప్పుడు విఫలమవడంతో చాలామందితో మాటలు కూడా పడ్డా. అవన్నీ పక్కన పెట్టి హాట్‌ సీట్ పైనే దృష్టి పెట్టా. ఈ ఏడాది కాలంలో నా కొడుకే నాకు కంప్యూటర్‌ పరిజ్ఞానం నేర్పించాడు. అత్తమామలు, భర్త కూడా నాకు పూర్తి సహకారం అందించారు. దీని ఫలితంగానే ఈ ఏడాది నేను హాట్‌సీట్‌ వరకూ చేరుకోగలిగా.

రూ.కోటితో ఏం చేస్తానంటే..?!

హాట్‌ సీట్‌ వరకు చేరుకోవడం ఒక ఎత్తైతే.. అక్కడ్నుంచి ఒక్కో ప్రశ్న దాటుతూ ముందుకు సాగడం మరో ఎత్తు. ఇక కోటి రూపాయల ప్రశ్నకు ఆడియన్స్‌ పోల్‌ ఆప్షన్‌ తీసుకున్నా.. బాగా ఆలోచించి సొంతంగానే సమాధానం చెప్పా. అది కరక్ట్‌ అయ్యేసరికి ఆనందం పట్టలేకపోయా. ఆ తర్వాత 7.5 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలియక.. ఆట నుంచి తప్పుకున్నా. ఒకవేళ ఇది తప్పైతే నేను గెలుచుకునేది రూ. 75 లక్షలే! కానీ నా లక్ష్యం కోటి. ఇక ఈ డబ్బులో కొంత భాగం లోన్లు తీర్చడానికి.. మిగతాది నా కొడుకు ఉన్నత చదువుల కోసం ఖర్చు చేస్తా. 22 ఏళ్లుగా ఒక్క ఫ్యామిలీ ఫంక్షన్లు తప్ప మరే ఇతర కార్యక్రమానికి వెళ్లలేదు. ఎంజాయ్‌మెంట్‌కు పూర్తి దూరంగా ఉన్నా. నాకు మేఘాలయాలోని ‘చెర్రీ బ్లాసమ్‌ ఫెస్టివల్‌’ చూడాలన్న ఆశ ఎప్పట్నుంచో ఉంది. ఈ ఏడాది అది నెరవేర్చుకోవాలనుకుంటున్నా. వంట, సంగీతం ఎప్పుడూ బోర్‌ కొట్టవు. ఎక్కువగా స్వీట్లు తినడానికి, పాటలు వినడానికి ఇష్టపడుతుంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్