Jhulan Goswami: 20 ఏళ్ల ప్రేమ... అందమైన కుటుంబాన్ని అందించింది!

ఊహ తెలిసినప్పట్నుంచి క్రికెట్టే తన ప్రాణమనుకుంది.. పట్టుబట్టి ఈ క్రీడలో ఓనమాలు నేర్చుకుంది.. పంతొమ్మిదేళ్ల వయసులో జట్టులోకొచ్చింది.. కెప్టెన్‌గా మరపురాని విజయాలు అందించింది.. బౌలర్‌గా తనకెదురులేదనిపించింది.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది.. ఇక ఇప్పుడు అనితర సాధ్యమైన రికార్డును.....

Updated : 26 Sep 2022 20:54 IST

(Photos: Instagram)

ఊహ తెలిసినప్పట్నుంచి క్రికెట్టే తన ప్రాణమనుకుంది.. పట్టుబట్టి ఈ క్రీడలో ఓనమాలు నేర్చుకుంది.. పంతొమ్మిదేళ్ల వయసులో జట్టులోకొచ్చింది.. కెప్టెన్‌గా మరపురాని విజయాలు అందించింది.. బౌలర్‌గా తనకెదురులేదనిపించింది.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది.. ఇలా రెండు దశాబ్దాలకు పైగా మహిళల క్రికెట్లో మకుటాయమానంగా నిలిచిన ఆమె తాజాగా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది. ఆమే.. చక్దా ఎక్స్‌ప్రెస్‌ జులన్‌ గోస్వామి. సుదీర్ఘ కెరీర్లో తానెదుర్కొన్న అనుభవాలు, అనుభూతుల్ని రంగరిస్తూ ట్విట్టర్‌ వేదికగా ఓ భావోద్వేగపూరిత పోస్ట్‌తో ఆటకు గుడ్‌బై చెప్పిందీ బౌలింగ్‌ క్వీన్‌. ఈ నేపథ్యంలో ఈ బెంగాల్‌ టైగర్‌ కెరీర్‌లోని ఎత్తుపల్లాల్ని ఓసారి నెమరువేసుకుందాం..!

క్రికెట్‌.. నాకో కుటుంబాన్నిచ్చింది!

భారత మహిళల క్రికెట్‌ అంటే.. ఈ తరం అమ్మాయిలకు తెలిసింది కొన్ని పేర్లే! వాటిలో జులన్‌ గోస్వామి ఒకరు. 20 ఏళ్లకు పైగా క్రికెట్తోనే సహవాసం చేసిన ఆమె.. తన సుదీర్ఘ కెరీర్‌కు తాజాగా వీడ్కోలు పలికింది. తన ప్రాణమైన ఈ ఆట తనకో కుటుంబాన్నిచ్చిందంటూ భావోద్వేగపూరిత పోస్ట్‌ పెట్టింది జులన్.

‘ఏ ప్రయాణానికైనా ముగింపు ఉంటుంది.. నా క్రికెట్‌ ప్రయాణానికి వీడ్కోలు పలికే రోజు ఆసన్నమైంది. 20 ఏళ్లకు పైగా క్రికెట్‌నే ప్రేమించిన నేను.. నేడు అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలుకుతున్నా. సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలందించడం ఓ గొప్ప అనుభూతి. ఈ ఆట నాకెంతో సంతృప్తినిచ్చింది.. అంతకుమించి నాకెన్నో బహుమతులిచ్చింది. అన్నింటికంటే గొప్ప గిఫ్ట్‌.. అభిమానులు, స్నేహితులు, సహచరులు, మార్గదర్శకులు.. ఇలా ఎంతోమందితో కూడిన అందమైన కుటుంబాన్ని నాకు అందించింది. ఇన్నేళ్ల అనుభవంతో దేశంలోని మహిళల క్రికెట్ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు, క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకునేలా మరెంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తిని కలిగించడంలో సఫలమయ్యాననుకుంటున్నా. 1997లో ఈడెన్‌ గార్డెన్స్‌లో మహిళల ప్రపంచకప్‌ చూశాక దేశం తరఫున ఆడాలని కలలు కన్నా. నా కలను ప్రోత్సహించి నన్ను ఈ స్థాయికి చేర్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!’ అందీ చక్దా ఎక్స్‌ప్రెస్‌.

గల్లీ క్రికెట్‌ ఆడుతూ..!

కోల్‌కతాలోని చెక్‌దాహాలో పుట్టిపెరిగింది జులన్‌. ఊహ తెలిసినప్పట్నుంచి క్రికెట్‌నే ప్రాణంగా ప్రేమించిన ఆమె.. స్థానికంగా అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేదట. అదీ.. టెన్నిస్‌బాల్‌తో గల్లీ క్రికెట్ ఆడుతూ ఈ క్రీడలో పట్టు పెంచుకుందామె. అయితే మొదట్లో ఆమె బౌలింగ్ చాలా నెమ్మదిగా ఉండడంతో అబ్బాయిలు ఆమెను కేవలం బ్యాటింగే చేయమనేవారట! ఆ తర్వాత ఆటలోకీ రావద్దనేశారట! దీంతో పట్టుబట్టి మరీ వేగంగా బౌలింగ్ చేయడం నేర్చుకుంది జులన్. ఇలా అప్పటివరకు సరదాగానే ఈ ఆటను ఆడినా.. క్రికెట్‌ని కెరీర్‌గా మార్చుకోవాలనే ఆలోచన మాత్రం తనకు పదిహేనేళ్లున్నప్పుడు కలిగిందంటోందీ బెంగాల్‌ బౌలర్. 

ఆ మ్యాచ్ స్ఫూర్తితో..!

ఆమెకు పదిహేనేళ్లున్నప్పుడు మహిళల ప్రపంచకప్ మ్యాచులు భారత్‌లో జరిగాయి. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఫైనల్‌కి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. ఈ మ్యాచ్‌కి స్కూల్ తరఫున పాస్‌లు పొందిన జులన్‌ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది. అప్పుడే క్రికెట్‌ను తన కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకున్నానంటోంది. అయితే మొదట్లో ఈ విషయంలో తన తల్లిదండ్రులు అడ్డు చెప్పినా.. ఆ తర్వాత వారిని ఒప్పించి మరీ కోల్‌కతాలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరిందామె. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే నాలుగున్నరకి నిద్ర లేచి ఐదింటికి ఇంటర్‌సిటీ ప్యాసెంజర్ రైలులో కోల్‌కతా వెళ్లేది. రెండు గంటల ప్రయాణం తర్వాత అక్కడికి చేరుకొని 9.30 వరకూ ప్రాక్టీస్ చేసేది. నిమిషం లేటైనా కోచ్ ఆమెను అకాడమీలోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదట! కాబట్టి నిద్ర తగ్గించుకొని మరీ ఉదయాన్నే అకాడమీకి వెళ్లి ప్రాక్టీస్ చేస్తూ ఆట పట్ల తనకున్న అమితమైన ప్రేమను చాటుకునేదామె. ఇలా రోజూ శిక్షణ ముగించుకొని కాలేజీకి వెళ్లి చదువుకునేది. తన కోచ్ అంత కఠినంగా ఉండడం వల్లే తనకు జీవితంలో క్రమశిక్షణ అలవడిందంటూ ఓ సందర్భంలో నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది జులన్.

అలా జట్టులోకొచ్చి.. ఇలా ప్రత్యర్థిని పడగొట్టి..!

పంతొమ్మిదేళ్ల వయసున్నప్పుడు బెంగాల్ క్రికెట్ జట్టుకి ఎంపికైంది జులన్. ఆ తర్వాత ఆమె ఈస్ట్‌జోన్ తరఫున కూడా మ్యాచులాడేది. ఒకసారి ఈస్ట్‌జోన్‌కి, ఎయిర్ ఇండియాకి మధ్య జరిగిన మ్యాచ్‌లో చక్కటి ప్రతిభ కనబరిచిందామె. ప్రత్యర్థి జట్టులో ఉత్తమ ఆటగాళ్లున్నా.. పది ఓవర్లలో పదమూడు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది జులన్. ఈ ప్రదర్శనే ఆమె కెరీర్‌ మలుపు తిప్పిందని చెప్పచ్చు. ఆ తర్వాత ఎయిర్ ఇండియా టీమ్ ఆమెను జట్టులోకి తీసుకోవడంతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇక 2002లో భారత జాతీయ జట్టుకి ఎంపికైన జులన్ ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడింది. 120 కిలోమీటర్ల స్పీడ్‌తో బాల్‌ని విసిరే ఆమె ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళా బౌలర్’గా రికార్డు సాధించింది. అంతేకాదు.. ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత కూడా ఆమెదే..! 2011లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇక 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో పది వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇలా ఒక మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గానూ చరిత్రకెక్కింది జులన్.

కపిల్‌ దేవ్ సరసన!

తన రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో.. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసింది జులన్‌. 12 టెస్టుల్లో 44 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె.. 204 వన్డేల్లో 255 వికెట్లు పడగొట్టింది. తద్వారా వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన/250 వికెట్ల మైలురాయిని చేరిన మహిళా బౌలర్‌గా చరిత్రకెక్కింది జులన్‌. పురుషుల క్రికెట్లో తొలిసారి ఈ మైలురాయిని కపిల్‌ దేవ్‌ అందుకోగా.. మహిళల క్రికెట్లో ఈ అరుదైన రికార్డు జులన్‌ ఖాతాలో చేరింది. జులన్‌ తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌ ఆస్ట్రేలియాకు చెందిన ఫిజ్‌ప్యాట్రిక్స్‌. ఆమె 180 వికెట్లు పడగొట్టింది.

 


ఓవైపు బయోపిక్‌.. మరోవైపు ఆత్మకథ!

తన క్యూట్‌ స్మైల్‌తో ఆకట్టుకునే జులన్‌ను జట్టు సభ్యులంతా ‘గోజీ’ అని పిలుస్తుంటారట! బబుల్‌, చక్దా ఎక్స్‌ప్రెస్‌.. వంటి ముద్దు పేర్లతోనూ ఆమె సుపరిచితమే!

తన ప్రతిభకు గుర్తింపుగా 2007లో ‘ఐసీసీ విమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకుంది జులన్‌. అయితే ఈ పురస్కారం ధోనీ చేతుల మీదుగా తీసుకోవడం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చిందీ బౌలింగ్‌ లెజెండ్.

క్రికెట్‌కు తాను అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం జులన్‌పై ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను ముద్రించి గౌరవించింది.

2010లో అర్జున, 2012లో పద్మశ్రీ అందుకుంది జులన్‌. డయానా ఎడుల్జీ తర్వాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిందామె.

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ప్రస్తుతం జులన్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తోంది. సుశాంతాదాస్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో జులన్‌ పాత్రలో అనుష్క కనిపించనుంది.

మరోవైపు జులన్‌ తన ఆత్మకథను రాసుకునే పనిలో బిజీగా ఉన్నానంటోంది.

ప్రస్తుతం జట్టుకు బౌలింగ్‌ కన్సల్టెంట్‌/కోచ్‌గా సేవలందిస్తోన్న ఈ బౌలింగ్‌ క్వీన్‌.. తన కెరీర్లో ఒక్కసారైనా ప్రపంచకప్‌ను ముద్దాడాలనుకుంది. కానీ అది తీరకపోవడం ఆమెకు లోటే!


ఎంతో ఇష్టం!

ఆహారం - చైనీస్‌ వంటకాలు

సినిమా - 3 ఇడియట్స్

నటుడు - ఆమిర్‌ ఖాన్

నటి - కాజోల్

క్రీడాకారుడు - డిగో మారడోనా (అర్జెంటీనా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు)

పర్యాటక ప్రదేశం - లండన్

ఆట (క్రికెట్‌ కాకుండా) - ఫుట్‌బాల్

అభిరుచి - పుస్తకాలు చదవడం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్