Chetna Joshi: ఈ యోగిని.. ఇప్పుడు మిసెస్ ఇండియా!
ఇండోర్‌కు చెందిన 29 ఏళ్ల చేత్నా జోషి తివారీ.. ప్రస్తుతం అంతర్జాతీయ యోగా ట్రైనర్‌గా రాణిస్తూనే.. మరో మైలురాయిని అధిగమించింది. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ‘మిసెస్ ఇండియా ఇంక్ సీజన్ 4’ విజేతగా నిలిచి.. పెళ్లయ్యాకా మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించగలరని నిరూపించింది....
(Photos : Instagram)
‘పుట్టింట్లో ఎలా ఉన్నా, ఎన్ని సాధించినా.. పెళ్లయ్యాక మాత్రం అవన్నీ అటకెక్కాల్సిందే.. అమ్మాయిలు ఇంటికి పరిమితమవ్వాల్సిందే!’ అంటుంటారు కొందరు. ఇలాంటి మాటలతో వారి కలల్నీ కూలుస్తుంటారు కూడా! కానీ మనం అనుకున్నది సాధించాలంటే ఇలాంటి బయటి ఒత్తిళ్లు కాదు.. మన అంతర్గత ఆలోచనలే ముఖ్యమంటోంది ఇండోర్‌కు చెందిన 29 ఏళ్ల చేత్నా జోషి తివారీ. ఒకానొక దశలో సామాజిక ఒత్తిళ్లతో మానసిక ప్రశాంతతను పోగొట్టుకున్న ఆమె.. యోగాతో తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ యోగా ట్రైనర్‌గా రాణిస్తూనే.. మరో మైలురాయిని అధిగమించింది. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన ‘మిసెస్ ఇండియా ఇంక్ సీజన్ 4’ విజేతగా నిలిచి.. పెళ్లయ్యాకా మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించగలరని నిరూపించింది. కృషి, పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైందంటోన్న ఈ అందాల రాణి స్ఫూర్తి గాథ నేటి తరం మహిళలకు ఆదర్శం!
‘సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబంలో పుట్టి పెరిగాను. చాలా తెలివైన అమ్మాయిని. చదువులోనే కాదు.. ఇతర వ్యాపకాల్లోనూ అందరికంటే ముందుండేదాన్ని. పోటీ ఏదైనా తొలి ర్యాంక్ వస్తేనే విజయం అన్న ఆలోచనలో ఉండేదాన్ని. అలా చూస్తుండగానే ఇంజినీరింగ్ పూర్తి చేశా. ప్రముఖ ఎమ్మెన్సీ సంస్థల్లో అవకాశాలు క్యూ కట్టాయి. ఎప్పుడూ చదువు చదువు అంటూ ఎన్నో సరదాల్ని పక్కన పెట్టా.. దాని ఫలితమే ఇవి అని సంబరపడిపోయా. కానీ ఇవన్నీ ఒక్క క్షణంలో ఆవిరైపోయాయి.
‘అదంతా వృథా ప్రయాస’ అన్నారు!
‘ఇంత చదువు చదివినా, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేసినా పెళ్లయ్యే వరకే.. పెళ్లి తర్వాత ఎలాగూ ఇంట్లో కూర్చోవాల్సిందేగా’ అన్నారు చాలామంది. ఆ మాటలు నా మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. శిఖరాగ్రంపై ఉన్న నన్ను ఒక్కసారిగా కిందికి తోసేసినట్లుగా అనిపించింది. సమాజం నుంచి ఎదురైన పలు ఒత్తిళ్లతో ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఈ పరిస్థితి నా కెరీర్‌ని కూడా నాకు దూరం చేసింది. కొన్నాళ్లు ఈ ఒత్తిడితోనే గడిచిపోయాయి. ఆపై ఓ రోజు ఎందుకో నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. ఆ సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులో భాగంగా నేను నేర్చుకున్న సుదర్శన్ క్రియ అనే బ్రీతింగ్ టెక్నిక్ గుర్తొచ్చింది. దాన్ని సాధన చేయడం మొదలుపెట్టా. జీవితం ప్రతికూల ఆలోచనల నుంచి పాజిటివిటీ వైపు వెడుతున్నట్లనిపించేది. మనసులోని భారం దూరమై సానుకూల ఆలోచనలు వచ్చేవి. సుదర్శన్ క్రియతో పాటు యోగా, ధ్యానం కూడా సాధన చేయడం మొదలుపెట్టా. రోజులు గడిచే కొద్దీ నా జీవిత లక్ష్యమేంటో నాకు తెలిసేలా చేశాయీ వ్యాయామాలు. సమాజం నుంచి ఇలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటూ.. ఎంతోమంది తమ కెరీర్‌ని పక్కన పెడుతున్నారు. తమ ఇష్టాల్ని వదులుకుంటూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. అలాంటి వారిలో పాజిటివిటీని నింపి.. తమ లక్ష్యాల వైపు అడుగేసేలా ప్రోత్సహించాలనుకున్నా..
రెండేళ్లలోనే.. అంతర్జాతీయ గుర్తింపు..!
ఈ ఆలోచనతోనే యోగా సెంటర్స్, వర్క్‌షాప్స్ ఏర్పాటుచేసి.. మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతోన్న వారికి యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించా. ఈ కృషి, పట్టుదల.. ఎంతోమందిలో సానుకూల మార్పు తీసుకురావడమే కాదు.. అంతర్జాతీయ యోగా ట్రైనర్‌గా నాకు బోలెడంత గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగాపై వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ.. అవగాహన కల్పిస్తున్నా. నా వద్దకొచ్చే వారిలో విద్యార్థులు, మహిళలే కాదు.. 60 ఏళ్ల వృద్ధులూ ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ల సమస్యల్ని బట్టి వారితో ఆయా యోగాసనాల్ని సాధన చేయిస్తూ.. వారిని శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఫిట్‌గా మార్చుతున్నా. అష్టాంగ విన్యాస యోగా ట్రైనర్‌గానూ నాకు సర్టిఫికేషన్ ఉంది.
మావారి ప్రోత్సాహంతో..!
పెళ్లి తర్వాత నా లక్ష్యాలు, కెరీర్ అన్నీ మూలపడిపోతాయన్నారు. కానీ నా విషయంలో ఇలా ఏమీ జరగలేదు. అంతర్జాతీయ యోగా ట్రైనర్‌గా ఎదిగిన నేను.. మావారు, అత్తింటి వారి ప్రోత్సాహంతో MTV Roadies అనే రియాల్టీ షోలో పాల్గొన్నా. అందాల పోటీల్లోనూ నా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడ్డా. ఇటీవలే శ్రీలంక వేదికగా జరిగిన ‘మిసెస్ ఇండియా ఇంక్ సీజన్-4’ పోటీల్లో విజేతగా నిలిచా. దేశవ్యాప్తంగా 75 మంది పోటీదారుల్ని వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్నా. ఈ విజయంతో నా యోగా ట్యాలెంట్‌ని ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి చేరువ చేయాలనుకుంటున్నా. జీవితంలో ఎదగాలంటే ప్రయత్నం ఉంటే సరిపోదు.. సరైన దిశలో కృషి చేస్తున్నామా? లేదా? అన్నదీ ముఖ్యమే! మనకు సంతృప్తినిచ్చే మార్గాన్ని ఎంచుకుంటే సంతోషంగా ఉండగలుగుతాం. జీవితమంటే ఇదే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.