అందుకే తలపాగా చుట్టుకొని అబ్బాయిలతో ఫుట్‌బాల్‌ ఆడేదాన్ని!

ఫుట్‌బాల్‌ పుట్టింది మన దేశంలో కాదు.. ఇక్కడ దానికంత ఆదరణ కూడా లేదు.. కానీ పంజాబ్‌కు చెందిన మనీషా కల్యాణ్‌కు మాత్రం ఈ ఆటంటేనే విపరీతమైన మక్కువ. అదెంతలా అంటే.. అబ్బాయిలా కనిపించడానికి తలకు టవల్‌ చుట్టుకొని బాలుర జట్టుతో ఆడేంతగా! ఆ ఆసక్తే ఇప్పుడు ఆమెను అంతర్జాతీయ స్థాయిలో.....

Published : 02 Sep 2022 18:23 IST

(Photos: Instagram)

ఫుట్‌బాల్‌ పుట్టింది మన దేశంలో కాదు.. ఇక్కడ దానికంత ఆదరణ కూడా లేదు.. కానీ పంజాబ్‌కు చెందిన మనీషా కల్యాణ్‌కు మాత్రం ఈ ఆటంటేనే విపరీతమైన మక్కువ. అదెంతలా అంటే.. అబ్బాయిలా కనిపించడానికి తలకు టవల్‌ చుట్టుకొని బాలుర జట్టుతో ఆడేంతగా! ఆ ఆసక్తే ఇప్పుడు ఆమెను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. త్వరలో జరగనున్న ‘యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌’లో చోటు దక్కించుకొని.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. అంతేకాదు.. విదేశీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత నాలుగో మహిళా ఫుట్‌బాలర్‌ కూడా మనీషానే కావడం విశేషం. అయితే తను ఇక్కడి దాకా రావడం వెనుక ఎంతో పట్టుదల, కృషి దాగున్నాయి. అంతకుమించి ఇరుగుపొరుగు వారి నుంచి అమ్మాయినన్న వివక్షను సైతం ఎదుర్కొందామె. ఇవన్నీ దాటుకొని భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ ఫుట్‌బాలర్‌ క్రీడా ప్రయాణంలోని కొన్ని ఎత్తుపల్లాల గురించి తెలుసుకుందాం..!

ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి జరగనున్న యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీలకు సంబంధించిన అర్హత పోటీలు ఇటీవలే సైప్రస్‌ దేశంలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సైప్రస్‌లోని లిమాసోల్‌ అనే ప్రాంతానికి చెందిన మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ‘అపోలన్‌ లేడీస్‌ ఎఫ్‌సీ’ తరఫున బరిలోకి దిగింది మనీషా. ఈ మ్యాచ్‌లో అపోలన్‌ జట్టు ఎస్‌ఎఫ్‌కే రిగా టీమ్‌పై విజయం సాధించింది. తద్వారా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న ‘యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌’ పోటీల్లో పాల్గొననుంది మనీషా. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఈ పంజాబీ క్రీడాకారిణి.. విదేశీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత నాలుగో మహిళా ఫుట్‌బాలర్‌గా ఖ్యాతి గడించింది.

పీఈటీ ప్రోత్సాహంతో!

పంజాబ్‌ హోషియార్‌పూర్‌లోని ఓ చిన్న గ్రామంలో జన్మించింది మనీషా. చిన్న వయసు నుంచే ఆటలపై మక్కువ పెంచుకున్న ఆమె స్కూల్లో స్ప్రింట్‌, బాస్కెట్‌బాల్‌ ఎక్కువగా ఆడేది. అయితే ఓసారి ఫుట్‌బాల్‌ ఆడుతున్న క్రమంలో పీఈటీ ఆమెలోని నైపుణ్యాల్ని గుర్తించారు. ‘నువ్వు బాల్‌ను కిక్‌ చేసే పద్ధతి బాగుంది.. ఎంతో అనుభవం ఉన్న క్రీడాకారిణిగా ఆడుతున్నావ్‌.. ఎందుకు నువ్వు ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకోకూడదు?!’ అన్నారాయన. ఆ మాటల నుంచి పొందిన స్ఫూర్తితోనే ఈ క్రీడలోకి వచ్చింది మనీషా. ‘ఇక అప్పట్నుంచి ఫుట్‌బాల్‌ ఇచ్చినంత కిక్కు ఇంకే ఆటా ఇవ్వలేదంటోన్న’ ఈ పంజాబీ ప్లేయర్‌కు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తన తండ్రి ప్రమాదం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘ప్రమాదం కారణంగా నాన్న పక్షవాతానికి గురయ్యారు.. దాంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులూ తప్పలేదు. అయినా ఆయన నా కలలకే ప్రాధాన్యమిచ్చారు. ఫుట్‌బాల్‌ క్రీడలో నన్ను ప్రోత్సహించారు..’ అని చెబుతోంది మనీషా.

అమ్మాయినని తక్కువ చేసి మాట్లాడేవారు!

అయితే మనీషా ఫుట్‌బాల్‌ క్రీడనైతే ఎంచుకుంది కానీ.. సాధన చేయడానికి ఆ గ్రామంలో మహిళా జట్టు లేదు. సాధన చేస్తే తనొక్కర్తే చేయాలి.. దానివల్ల ప్రయోజనం ఉండదు.. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి అక్కడి బాలుర జట్టుతో మ్యాచ్‌లు ఆడేదామె. కొన్ని బాలుర పోటీల్లో తాను అమ్మాయినని తెలియకుండా ఉండడానికి తలపాగా చుట్టుకొని మరీ పాల్గొనేది. ‘నువ్వు అమ్మాయివి.. అబ్బాయిలతో ఆడడమేంటి? అయినా ఫుట్‌బాల్‌ని ఎందుకు ఎంచుకున్నావ్‌?.. ఇలా నేను ఈ క్రీడను ఎంచుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. నాకు అమ్మానాన్నల సపోర్ట్‌ ఉంది.. కోచ్‌ ప్రోత్సహించారు. అయితే స్థానికంగా జరిగే కొన్ని టోర్నమెంట్‌లలో అబ్బాయిలతో కలిసి పాల్గొనేదాన్ని. అక్కడ బాలికనని తెలియకుండా ఉండేందుకు తలపాగాతో మెయింటెయిన్‌ చేసేదాన్ని. కానీ ఆట మధ్యలోనే అది ఊడిపోయేది. అప్పుడు నా పట్టుదల చూసి ప్రశంసించిన వారే ఎక్కువ.. అంతేకానీ ఎవరూ నన్ను తప్పు పట్టలేదు. నా దృష్టిలో ఆడ, మగ ఇద్దరూ సమానమే!’ అంటోందీ పంజాబీ కుడీ.

ఒక్కో మెట్టూ ఎక్కుతూ..!

మొదట్లో ఫుట్‌బాల్‌ కిట్‌ కూడా లేని మనీషాకు ఆమె కోచ్‌, తన ఊరికి చెందిన ఓ వ్యాపారవేత్త సహాయం అందించారు. ఫుట్‌బాల్‌ కిట్‌ కొనిచ్చి ఆమెను ప్రోత్సహించారు. అంతేకాదు.. సాధనలో భాగంగా రోజూ నాలుగు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కేదామె.. ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక పోషకాహారం తీసుకునే స్థోమత లేక ఇంటి ఆహారానికే పరిమితమైంది. వీటికి తోడు మధ్యలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమించింది.. ‘గెలుపు పొందే వరకు అలుపు లేదన్నట్లు’ ఎన్ని అవాంతరాలు ఎదురైనా విశ్రమించక తన సాధనను కొనసాగించిందామె. ఈ పట్టుదలే ఆమెను 2018లో ‘ఇండియన్‌ విమెన్స్‌ లీగ్‌’లో భాగమైన ‘గోకులం కేరళ’ క్లబ్‌లో చేర్చింది. ఇక అప్పట్నుంచి వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు మనీషాకు. ఒక్కమాటలో చెప్పాలంటే గోకులం కేరళ క్లబ్‌ సక్సెస్‌లో ఈ పంజాబీ ప్లేయర్‌ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. ఆపై పలు దేశ, విదేశీ టోర్నమెంట్లలో మిడ్‌ఫీల్డర్‌గా ఆకట్టుకుంటూ గోల్స్‌ నమోదు చేసిందామె. ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ భారత మహిళల జాతీయ జట్టులో చోటు దక్కించుకుందీ పంజాబీ స్ట్రైకర్.

వాళ్లకు వీరాభిమానిని!

నిజానికి 2016లో ‘ఇండియన్‌ విమెన్స్‌ లీగ్‌’ ప్రారంభం కాకముందు మహిళా క్రీడాకారులకు జాతీయ స్థాయిలో సరైన ఆదరణ, ప్రోత్సాహం లేదనే చెప్పాలి. కానీ ఆ తర్వాత క్రీడాకారిణులకూ ఈ ఆటలో తమ కెరీర్‌ను నిర్మించుకోవడానికి అన్ని సదుపాయాలూ లభిస్తున్నాయి.. వీటికి తోడు ప్రేక్షకాదరణ, స్పాన్సర్‌షిప్స్‌ కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇందుకు విదేశీ క్లబ్‌లలో మన మహిళా క్రీడాకారులకు అవకాశాలు లభించడమే ప్రత్యక్ష ఉదాహరణ! ఇందుకు ప్రతిగానే ఇటీవలే ‘యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్’లో పాల్గొనే అవకాశాన్ని చేజిక్కించుకొని మరోసారి దేశ ఖ్యాతిని చాటింది మనీషా. ‘ఎప్పటికైనా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్‌ క్లబ్‌లో చోటు దక్కించుకోవాలనుకున్నా.. అది ఇటీవలే నెరవేరింది. ఇక జాతీయ జట్టును ప్రపంచకప్‌కు అర్హత సాధించేలా చేయడమే నా తదుపరి లక్ష్యం..!’ అంటోన్న ఈ పంజాబీ ప్లేయర్‌కు.. రొనాల్డినో (బ్రెజిల్), మెస్సీ (అర్జెంటీనా)ల ఆటంటే మక్కువట! ఇక తన క్రీడా నైపుణ్యాలకు గుర్తుగా 2021-22 సీజన్‌కు గానూ ‘ఏఐఎఫ్‌ఎఫ్‌ విమెన్స్‌ ఫుట్‌బాలర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా అవార్డు సైతం అందుకుందీ 20 ఏళ్ల మహిళా ఫుట్‌బాలర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని