చూపులేకపోతేనేం.. గొంతుతో గుర్తింపు తెచ్చుకుంది!
ఆమెకు పుట్టుకతోనే చూపు లేదు. ‘అయ్యో! ఇలా అయితే మీ కూతురు జీవితాంతం మీ మీదే ఆధారపడాల్సి వస్తుందేమో?!’ అని జాలి పడ్డారు బంధువులు. అలాగని ఈ మాటలకు ఆమె తల్లిదండ్రులు చిన్నబుచ్చుకోలేదు. అంధురాలైతేనేం.. తమ కూతురికి సంగీతమంటే ప్రాణమని పసిగట్టి అందులోనే ఆమెను ప్రోత్సహించారు. ఇలా తన తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకం, తన ఆత్మవిశ్వాసమే....
(Photo: Instagram)
ఆమెకు పుట్టుకతోనే చూపు లేదు. ‘అయ్యో! ఇలా అయితే మీ కూతురు జీవితాంతం మీ మీదే ఆధారపడాల్సి వస్తుందేమో?!’ అని జాలి పడ్డారు బంధువులు. అలాగని ఈ మాటలకు ఆమె తల్లిదండ్రులు చిన్నబుచ్చుకోలేదు. అంధురాలైతేనేం.. తమ కూతురికి సంగీతమంటే ప్రాణమని పసిగట్టి అందులోనే ఆమెను ప్రోత్సహించారు. ఇలా తన తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకం, తన ఆత్మవిశ్వాసమే తనకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టిందంటోంది దిల్లీకి చెందిన రేషమ్ తల్వార్. చూపులేకపోయినా తన అద్భుతమైన గొంతుతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయనిగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోంది. శారీరక లోపం మనలోని తపనకు అడ్డు కాదు అని నిరూపిస్తోన్న ఈ యంగ్ సెన్సేషన్ స్ఫూర్తి గాథ ఇది!
దిల్లీకి చెందిన పాతికేళ్ల రేషమ్ తల్వార్ పుట్టుకతోనే అంధురాలు. వస్తువులు, పరిసరాల్ని చూడలేకపోతేనేం.. తాకుతూ, ఫీలవుతూ వాటి గురించి తెలుసుకునేది. అయితే తన కూతురి శారీరక లోపాన్ని అర్థం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు అధైర్యపడలేదు.. ముందు చూపుతో ఆలోచించారు. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిలీ లిపి నేర్పించి.. అందరు పిల్లలతో పాటే సాధారణ పాఠశాలలో చేర్పించారు.
‘అయ్యో.. పాపం!’ అని జాలి పడ్డారు!
ఈ లోకాన్ని చూడలేని రేషమ్‌ను చూసి ఆమె బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు జాలి పడేవారు. ‘లోకులు కాకులు అంటుంటారు. ఎవరికే సమస్య ఉన్నా అన్నీ తమకే అవసరం అన్నట్లుగా వ్యవహరిస్తారు. నేను పుట్టినప్పుడు కూడా మా బంధువులు నా తల్లిదండ్రులపై ఇలాగే జాలి పడేవారట! ‘పుట్టు గుడ్డిది.. ఇక జీవితాంతం మీపై ఆధారపడాల్సిందే!’ అంటూ దెప్పిపొడుపు మాటలు మాట్లాడేవారట! అయితే అమ్మానాన్న ఈ మాటలేవీ పట్టించుకోకుండా నాకిష్టమున్న రంగంలో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మా అన్నయ్య నా బెస్ట్ ఫ్రెండ్.. నా బలం! నా ప్రతి అడుగులోనూ నాకు తోడయ్యాడు. ఇక ఇక్కడితో అవహేళనలకు, అవమానాలకు తెరపడిందనుకుంటే.. స్కూల్లోనూ ఇటు తోటి విద్యార్థులతో, అటు కొందరు టీచర్లతోనూ నా శారీరక లోపం కారణంగా మాటలు పడాల్సి వచ్చేది. అయినా అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను.’ అంటోంది రేషమ్. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా చదువులో రాణించిన ఆమె.. పదో తరగతిలో సీబీఎస్‌ఈ నుంచి ‘ఇందిరా అవార్డు’ గెలుచుకుంది. ఆపై దిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. IGNOUలో మాస్టర్స్ పట్టా పుచ్చుకుంది.
సంగీతం.. అది నా రక్తంలోనే ఉంది!
అవయవ లోపమున్న వాళ్లలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందంటుంటారు. రేషమ్ విషయానికొస్తే.. చిన్నతనం నుంచే సంగీతంపై ప్రేమ పెంచుకుందామె. సంగీత నేపథ్యమున్న కుటుంబం కావడంతో ఇందులో మరింత సునాయాసంగా నైపుణ్యం సంపాదించగలిగానంటోంది. ‘నాన్న వృత్తిరీత్యా సంగీత కళాకారుడు. అమ్మ గాయని. చిన్న వయసులో అమ్మ పాటలు వింటూనే పెరిగాను. కొన్నిసార్లు అమ్మ పాడుతుంటే హార్మోనియం వాయించేదాన్ని. ఇలా నాలో ఉన్న సంగీత ఆసక్తిని గుర్తించిన వారు ఈ దిశగా నాకు శిక్షణ ఇప్పించారు. మరోవైపు కాలేజీలోనూ స్నేహితులు, లెక్చరర్లు వెన్నుతట్టేవారు. ఈ క్రమంలో కాలేజీలో జరిగే పలు కార్యక్రమాల్లోనూ పాటలు పాడేదాన్ని. ఈ పెర్ఫార్మెన్స్‌కే ‘మిస్ ఫ్రెషర్’, ‘మిస్ ఫేర్‌వెల్’.. వంటి టైటిల్స్ కూడా గెలుచుకున్నా. చదువు పూర్తయ్యాక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలనుకున్నా..’ అంటోందీ ట్యాలెంటెడ్ సింగర్.
పనిని ఎంజాయ్ చేస్తున్నా!
సింగర్‌గా ‘ది వాయిస్’, ‘ఇండియన్ ఐడల్’, ‘సరిగమప’.. వంటి టీవీ రియాల్టీ షోలలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో పలక్ ముచ్చల్, అజయ్ దేవగణ్ లాంటి ప్రముఖుల మన్ననలందుకున్న రేషమ్.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా లైవ్ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చింది. కొన్నాళ్ల పాటు ‘రేడియో ఉడాన్’లో ఆర్జేగానూ పనిచేసింది. మరోవైపు పలు బాలీవుడ్ సినిమాలకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరిస్తూ.. తనదైన గుర్తింపు తెచ్చుకుంది రేషమ్. ‘విభిన్న పాత్రలకు నా గాత్రాన్ని అరువివ్వడం.. అదో థ్రిల్ ఫీలింగ్! ఇదంతా చిన్నతనం నుంచి నేను పడ్డ శ్రమకు, నేను చూపిన ఆత్మవిశ్వాసానికి ప్రతిఫలం..’ అంటోన్న ఈ యంగ్ ఆర్టిస్ట్.. ప్రస్తుతం Atypical Advantage అనే సంస్థ నిర్వహించే సంగీత కార్యక్రమాల్లోనూ భాగమైంది. వివిధ శారీరక, మానసిక లోపాలున్న కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించే వేదిక ఇది. మరోవైపు.. పుట్టినరోజు, పెళ్లిరోజు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో వ్యక్తిగత ఆసక్తుల్ని బట్టి చిన్న చిన్న పాటలు కట్టి వారికి అంకితం చేస్తుంటుందీ యంగ్ సెన్సేషన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.