అందుకే తన ఫేస్‌బుక్ గ్రూప్‌లో 7 లక్షల మంది సభ్యులయ్యారు..!
మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ కమ్యూనిటీల్ని ప్రారంభించిన ఆమె.. దేశవ్యాప్తంగా సుమారుగా ఏడు లక్షల మంది మహిళా రైతుల్ని సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తోంది.
(Photos: Instagram)
చదువుకోవాలని ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదామెకు.. తమ్ముళ్ల చదువు కోసం తాను స్కూల్ మానేసింది. అంతలోనే.. పెళ్లి! వ్యవసాయాధారిత కుటుంబంలోకి అడుగుపెట్టిన ఆమెకు అసలు వ్యవసాయమంటేనే తెలియదు.. ఎప్పుడూ పంట పొలాల్లోకి అడుగుపెట్టింది లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని.. తోటి మహిళా రైతులకు వ్యవసాయ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది సవితా దాక్లే. మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ కమ్యూనిటీల్ని ప్రారంభించిన ఆమె.. దేశవ్యాప్తంగా సుమారుగా ఏడు లక్షల మంది మహిళా రైతుల్ని సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తోంది. ‘ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుందం’టోన్న సవిత స్ఫూర్తి గాథ మీకోసం..!
పుస్తకాలు కొనలేక..!
మహారాష్ట్రలోని పెండ్‌గాన్ అనే గ్రామంలో పుట్టింది సవిత. ఆమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. చదువంటే సవితకు చాలా ఇష్టం. ఈ మక్కువతోనే స్థానిక పాఠశాలలో చేరిన ఆమె.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే చదువు మానేయాల్సి వచ్చింది.
‘నాన్న ఔరంగాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేసేవాడు. ఉన్నట్లుండి కంపెనీ మూతపడడంతో నాన్న ఉద్యోగం పోయింది. కుటుంబ భారమంతా భుజాలపై వేసుకున్న అమ్మ కూరగాయలమ్ముతూ ఇల్లు నెట్టుకొచ్చేది. ఓ రోజు మా టీచర్ నన్ను పిలిచి రూ. వెయ్యి చెల్లించి యూనిఫాం, పుస్తకాలు తీసుకోమంది. అసలే ఇంటి పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాంటి స్థితిలో ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టా. ఆ తర్వాత ఈ విషయం నాన్నకు తెలిసి ఎంతో బాధపడ్డాడు. పిల్లల్ని చదివించలేకపోతున్నందుకు కుమిలిపోయాడు. అయితే కొన్నాళ్లకు మా ఇద్దరు అక్కల పెళ్లిళ్లయిపోవడంతో అమ్మానాన్న మా ఊరికి వెళ్లిపోయారు. అక్కడే మాకున్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇక నేను చదువు మానేసి.. తమ్ముళ్ల చదువు కోసం ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగంలో చేరాను.. సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాక నా 17వ ఏట నాకు పెళ్లైంది. అప్పటికే నా పెళ్లి గురించి ఇరుగుపొరుగు వాళ్ల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో.. వివాహానికి అంగీకరించక తప్పలేదు..’ అంటూ చెప్పుకొచ్చింది సవిత.
వ్యవసాయం తెలియదు!
తన ఊరికి చెందిన ఓ వ్యవసాయాధారిత కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టింది సవిత. నిజానికి ఆమెకు వ్యవసాయమంటే తెలియదు.. ఎప్పుడూ పంట పొలాల్లోకి అడుగుపెట్టింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా తమతో కలిసి పొలం పనులు చేయాలని షరతు పెట్టారు అత్తమామలు.
‘పొలాల్లో సరిగ్గా నడవడమే రాని నేను వ్యవసాయమెలా చేస్తాననుకునేదాన్ని.. ఈ క్రమంలో పొలం గట్లపై ఎన్నిసార్లు జారిపడ్డానో నాకే తెలియదు. ఇక పొలం పనులు సరిగ్గా చేయకపోవడంతో చాలామంది నన్ను చూసి నవ్వేవారు. మనసుకు బాధనిపించినా ఓర్చుకున్నా. కానీ గట్టిగా అనుకుంటే ఏదైనా నేర్చుకోగలగడం నా బలం. వ్యవసాయ మెలకువలు నేర్చుకోవడానికీ అంతే ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నా. మావారి ప్రోత్సాహం, సహకారంతో నెమ్మదిగా.. పొలాన్ని సిద్ధం చేయడం, నాట్లు వేయడం, పంటకు నీళ్లు పెట్టడం, ట్రాక్టర్ నడపడం.. ఇలా ఒక్కొక్కటీ నేర్చుకున్నా. మొదట్లో రోజుకు పది కిలోల పత్తి తీసిన నేను.. కొన్నాళ్లకు రోజుకు 80 కిలోల పత్తి తీసే స్థాయికి చేరుకున్నా..’ అంటూ తాను వ్యవసాయ నైపుణ్యాలు ఒంట బట్టించుకున్న విధానాన్ని వివరించింది సవిత.
మలుపుతిప్పిన మీటింగ్!
అయితే ఓ రోజు ఆ గ్రామంలో ‘స్వయం ఉపాధి మహిళా సంఘం (SEWA)’ ఓ మీటింగ్‌ని ఏర్పాటు చేసింది. గ్రామీణ మహిళల్ని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ సమావేశం గురించి తెలిసిన సవిత.. అందులో పాల్గొనడానికి వెళ్తానంటే అత్తమామలు ససేమిరా అన్నారు. అయినా వారిని ఎలాగోలా ఒప్పించి మీటింగ్‌కి హాజరయ్యానంటోందామె.
‘ఆ రోజు కూలీ డబ్బులు రావన్న ఉద్దేశంతో మీటింగ్‌లో పాల్గొంటానంటే మా అత్తమామలు వద్దన్నారు. కానీ మావారు కలగజేసుకొని వారిని ఒప్పించారు. దాంతో ఆ మీటింగ్‌లో పాల్గొన్నా. ఆపై సంస్థలో సభ్యత్వం కూడా లభించింది. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వాడకం.. వంటి అంశాలపై పట్టు సాధించా. ఆ సమయంలో పెళ్లికి ముందు మా నాన్న నాకిచ్చిన జియో ఫోన్ నా వద్ద ఉండడంతో.. దాంతోనే మరిన్ని సాంకేతిక మెలకువలు నేర్చుకున్నా. అయితే నేను ఇలా ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతుంటే.. చూసేవాళ్లంతా తప్పుగా అర్థం చేసుకునేవారు. కానీ నేను అవేవీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోయేదాన్ని..’ అంటున్న సవిత.. ఈ మీటింగ్‌లో పాల్గొన్నాకే.. తనకున్న వ్యవసాయ పరిజ్ఞానం, సాంకేతిక మెలకువల్ని మరింతమంది మహిళా రైతులకు చేరువ చేయాలన్న ఆలోచన వచ్చిందంటోంది.
ఫేస్‌బుక్ వేదికగా..!
ఈ ఆలోచనతోనే 2017లో ‘విమెన్ ఇన్ అగ్రికల్చర్’ పేరుతో ఓ ఫేస్‌బుక్ కమ్యూనిటీని ప్రారంభించింది సవిత. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతుల్ని ఈ వేదిక పైకి తీసుకురావాలన్న ముఖ్యోద్దేశంతో దీన్ని ప్రారంభించిన ఆమె.. ఇప్పటివరకు లక్షల మంది మహిళా రైతులకు చేరువైంది. ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో 7 లక్షల మందికి పైగా మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు.
‘మహిళలు ఇతరులపై ఆధారపడకుండా సాధికారత సాధించాలి.. నా ఫేస్‌బుక్ కమ్యూనిటీలో భాగమైన మహిళా రైతులకు నేను ఇదే విషయం చెబుతుంటా. ప్రస్తుతం ఈ వేదికగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, విభిన్న కాలాల్లో వివిధ రకాల పంటలు పండించడం, కలుపు వేసే పద్ధతులు, పంటకు తగ్గ ధర లభించేలా పలు మార్కెటింగ్ టెక్నిక్స్.. వంటి వాటిపై మహిళా రైతులకు అవగాహన కల్పిస్తున్నా. నా సేవల్ని గుర్తించిన ఫేస్‌బుక్ 2018లో నన్ను గురుగ్రామ్‌లోని వాళ్ల ఆఫీసుకు ఆహ్వానించింది. అప్పుడు మొదటిసారి విమానంలో ప్రయాణించా. ఆ అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్లు నాకు ఓ స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇచ్చారు. ఇక నాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో బిల్లు చెల్లింపులు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే చేస్తున్నా.. ఇలా స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించిన పలు ప్రాథమిక అంశాల్ని కూడా మా కమ్యూనిటీలోని మహిళా రైతులకు వివరిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది సవిత. పెద్దగా చదువుకోకపోయినా.. దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న ఆమె.. తన ఇద్దరు పిల్లలకూ ఆదర్శంగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.