బుల్లెట్లు దూసుకొస్తున్నా.. పోరాడుతూనే ఉన్నారు!

గత రెండు దశాబ్దాలుగా సమానత్వం, తమ హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు అఫ్గాన్‌ మహిళలు. పురుషులతో సమానంగా దాదాపు అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగారు. మహిళా సాధికారత దిశగా ముందడుగు వేశారు. అయితే గత రెండు నెలల నుంచి అఫ్గానిస్థాన్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Updated : 19 Aug 2021 18:27 IST

(Image for Representation)

గత రెండు దశాబ్దాలుగా సమానత్వం, తమ హక్కుల కోసం పోరాడుతూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు అఫ్గాన్‌ మహిళలు. పురుషులతో సమానంగా దాదాపు అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగారు. మహిళా సాధికారత దిశగా ముందడుగు వేశారు. అయితే గత రెండు నెలల నుంచి అఫ్గానిస్థాన్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 20 ఏళ్ల క్రితం వరకు తాలిబన్ల ఆంక్షల్లో బందీగా కొట్టుమిట్టాడిన ఆ దేశం... తాజాగా మరోసారి వారి కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది.

మహిళల భవిష్యత్‌ అగమ్యగోచరం!

దీంతో అఫ్గాన్‌లోని మహిళలు, అమ్మాయిల భవిష్యత్‌ మళ్లీ అగమ్యగోచరంగా మారింది. తాలిబన్లకు భయపడి ఏకంగా దేశాధ్యక్షుడే పలాయనం చిత్తగించడంతో మళ్లీ చీకటి రోజులు పునరావృతం అవుతాయేమోనని వారంతా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ మాన, ప్రాణాలను కాపాడుకోవడానికి కట్టుబట్టలతో దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబన్లు తమ వైపు దూసుకొస్తున్నా కొంతమంది మహిళలు మాత్రం ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. ‘ప్రాణాలు పోయినా పర్లేదు’ అంటూ తుదివరకు పోరాడారు.

అంత సులభంగా చిక్కలేదు!

అమెరికా సైన్యం అఫ్గాన్‌ను విడిచిపెట్టిన రెండు నెలలకే ఆ దేశాన్ని పూర్తిగా హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు. దేశంలోని ఎన్నో ప్రాంతాలను సులభంగా ఆక్రమించుకున్న వీరు బల్ఖ్‌ ప్రావిన్సులోని ఛాహర్‌ కింట్‌ జిల్లాను మాత్రం అంత సులభంగా తమ వశం చేసుకోలేకపోయారు. అందుకు కారణం ఆ జిల్లా గవర్నర్‌ సలీమా మజారీ. తాలిబన్లకు ఎదురొడ్డి నిలిచిన ఆమె తన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించింది. ప్రావిన్సు చుట్టు పక్కల ప్రాంతాలన్నీ శత్రువుల వశమవుతున్నా ధైర్యంగా పోరాడింది. అయితే ముష్కరుల బలం ముందు నిలవలేక చివరకు వారి చెరలో బందీగా మారింది.

మాతృభూమి రుణం తీర్చుకోవాలని!

అఫ్గానిస్థాన్‌ మొదటి ముగ్గురు మహిళా గవర్నర్లలో సలీమా కూడా ఒకరు. సోవియట్‌ వార్‌ సమయంలో ఆమె తల్లిదండ్రులు అఫ్గాన్‌ను విడిచిపెట్టి ఇరాన్‌కు వెళ్లి అక్కడే శరణార్థులుగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోనే పుట్టి పెరిగింది సలీమా. టెహ్రాన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. చదువయ్యాక పలు యూనివర్సిటీలు, అంతర్జాతీయ మైగ్రేషన్‌ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేసింది. అయితే మాతృభూమి రుణం తీర్చుకోవాలన్న తలంపుతో మూడేళ్ల క్రితం మళ్లీ అఫ్గాన్‌కు వచ్చింది. అదే సమయంలో ఛాహర్‌కింట్‌ జిల్లా గవర్నర్‌ పోస్టు ఖాళీ ఉండడంతో దరఖాస్తు చేసింది. ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హతలన్నీ ఉండడంతో 2018లో ఛాహర్‌కింట్ జిల్లా గవర్నర్ బాధ్యతలు స్వీకరించింది సలీమా.

‘చాలామంది మహిళల్లాగే గవర్నర్‌ అయ్యాక నేను కూడా భయపడ్డాను. ఓ మహిళగా నాకు వివక్ష, అవమానాలు తప్పవని ఊహించాను. అయితే అనూహ్యంగా నాతోటి అధికారులు, ప్రజలు నాకెంతో మద్దతుగా నిలిచారు. అప్పుడే వారి అభివృద్ధి కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ వుమన్.

ప్రత్యేక మిలిటరీ బృందంతో.. !

ముందుగా అనుకున్నట్లుగానే తన జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది సలీమా. అయితే తాలిబన్లు, ఇతర మిలిటెంట్‌ గ్రూపుల దాడులను అరికట్టడం ఆమెకు ఓ పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2019లో ప్రత్యేకంగా సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటుచేసింది సలీమా. ఇందులో భాగంగా జిల్లాలోని రైతులు, పశువుల కాపరులు, కార్మికులతో ఓ పెద్ద మిలిటరీ బృందాన్ని తయారుచేసింది. ఇలా తమ ఆగడాలకు అడ్డుకట్ట పడడం, పైగా ఓ ముస్లిం మహిళ నాయకత్వంలో ఇది జరగడం తాలిబన్ల నాయకులకు అసలు రుచించలేదు. దీంతో సలీమాకు హత్యా బెదిరింపులు ఎక్కువయ్యాయి. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు.

అదే నన్ను బాధిస్తోంది!

గవర్నర్‌గా సమర్థంగా పరిపాలిస్తూనే తాలిబన్లతో దౌత్యపరమైన చర్చలు కొనసాగించేది సలీమా. తద్వారా వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్నది ఆమె ఆశయం. ఈ క్రమంలోనే గతేడాది బల్ఖ్‌ ప్రావిన్సుకు చెందిన 100 మంది కరడుగట్టిన తాలిబన్లతో మాట్లాడి ప్రభుత్వానికి లొంగిపోయేలా వారిని ఒప్పించింది. అయితే అమెరికా సైన్యం వెనుదిరిగిన తర్వాత తాలిబన్లు మళ్లీ దూకుడు పెంచారు. వారిని చూసి దేశ అధ్యక్షుడితో సహా కీలక నేతలంతా ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. కానీ సలీమా మాత్రం అక్కడే ఉండి పోరాడింది. తన ప్రాంత ప్రజలను కాపాడుకునేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. కానీ చివరకు శత్రువుల చేతికి చిక్కక తప్పలేదు.

‘తాలిబన్లకు నేను ఏ మాత్రం భయపడను. కానీ మహిళలు, అమ్మాయిలను ఆ ముష్కరులు ఏం చేస్తారోనని ఆందోళనగా ఉంది’ అని శత్రువుల చేతికి చిక్కకముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సలీమా. 

 

తండ్రిని కోల్పోయినా వెనక్కు తగ్గలేదు!

అఫ్గాన్‌లో తొలి మహిళా మేయర్‌గా అతి పిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించింది 29 ఏళ్ల జరీఫా గఫారీ. మహిళల హక్కులను కాపాడే ప్రయత్నంలో తన తండ్రిని సైతం పోగొట్టుకుందీ డేరింగ్‌ లేడీ. అయినా వెనక్కు తగ్గలేదు. ఎన్నో అవమానాలు, బెదిరింపులు భరిస్తూ తన ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. కానీ...నేడు పరిస్థితులన్నీ మళ్లీ మొదటికొచ్చాయి. రెండు దశాబ్దాల నాటి పాత రోజులు మళ్లీ పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ తన బాల్యం నాటి ఆటవిక పాలన వస్తుందేమోనని కలవరపడుతోంది జరీఫా. 

మహిళలకు ఆమె ఓ రోల్‌ మోడల్!

అఫ్గాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో 1992లో జన్మించింది గఫారీ. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఇండియా వచ్చింది. చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూనే మహిళల హక్కుల కోసం పోరాడింది. రాజకీయ వేత్త, వ్యాపారవేత్తగానూ రాణించింది. ఈ క్రమంలోనే ఆమె 2018 లో వార్దాక్‌ ప్రావిన్‌్డలోని మైదాన్ షెహర్‌ మేయర్‌గా ఎంపికయ్యారు. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 26 ఏళ్లే. దీంతో అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి అఫ్గాన్‌ మహిళగా చరిత్ర సృష్టించింది. అయితే కొన్ని రాజకీయ శక్తులు ఆమె అభివృద్ధిని చూసి కుళ్లుకున్నాయి. వాటన్నిటినీ దాటుకుని మేయర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ఆమెకు సుమారు ఏడాదికి పైగానే సమయం పట్టింది. ఈసారి తాలిబన్లు, ఇతర ఉగ్రవాద సంస్థలు ఆమెను టార్గెట్‌ చేసుకున్నారు. పదవికి రాజీనామా చేయాలి లేదా చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పలు సందర్భాల్లో ఆమెపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో ముష్కరులు గఫారీ తండ్రిని చంపేశారు. అయినా తన లక్ష్యం కోసం ముందుకే అడుగేశారీ డేరింగ్ లేడీ. మహిళల హక్కులు, సమానత్వం సాధించడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అక్కడి మహిళలకు ఒక రోల్‌ మోడల్‌గా నిలిచింది. 2019లో బీబీసీ విడుదల చేసిన ‘ప్రపంచ వ్యాప్తంగా వందమంది స్ఫూర్తిదాయక మహిళలు’ జాబితాలో గఫారీ చోటు దక్కించుకోవడం విశేషం.

నన్ను చంపేందుకు తప్పకుండా వస్తారు!

ఇప్పటివరకు మొత్తం మూడుసార్లు గరీఫాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు తాలిబన్లు. అలాంటిది తాజాగా తన దేశం పూర్తిగా ముష్కరుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆమె తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ‘నాలాంటి వాళ్లను అంతం చేసేందుకు తాలిబన్లు కచ్చితంగా వస్తారు. వారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. భర్త, మా కుటుంబ సభ్యులు కూడా నాతోనే ఉన్నారు. మాకు సహాయం చేసేందుకు ఎవరూ రారని తెలుసు’ అని తీవ్ర గద్గద స్వరంతో చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ వుమన్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్