గాయపడిన మనసుకు మాటల మంత్రమేస్తోంది!

మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందంటారు.. అయితే ఇలాంటి మానసిక ఆరోగ్యం ఈకాలపు అమ్మాయిల్లో, మహిళల్లో కొరవడుతోందని చెప్పాలి. సుమారు 26 శాతం మంది యువతులు యాంగ్జైటీ, డిప్రెషన్.. వంటి వివిధ రకాల మానసిక సమస్యల బారిన పడుతున్నట్లు సర్వేలు....

Published : 13 Sep 2022 19:03 IST

(Photos: Instagram)

మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందంటారు.. అయితే ఇలాంటి మానసిక ఆరోగ్యం ఈకాలపు అమ్మాయిల్లో, మహిళల్లో కొరవడుతోందని చెప్పాలి. సుమారు 26 శాతం మంది యువతులు యాంగ్జైటీ, డిప్రెషన్.. వంటి వివిధ రకాల మానసిక సమస్యల బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. యువకుల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అందుకే ఈ పరిస్థితిని మార్చి.. 2030 కల్లా కనీసం పది లక్షల మంది యువతను సంపూర్ణ మానసిక ఆరోగ్యవంతులుగా తయారుచేయాలని కంకణం కట్టుకుంది గోవాకు చెందిన యంగ్‌ ఛేంజ్‌మేకర్‌ అనఘా రాజేశ్‌. ఈ సదుద్దేశంతోనే ఓ స్వచ్ఛంద సంస్థనూ నెలకొల్పింది. తన సంస్థ ద్వారా ఎంతోమందికి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తున్న ఆమె.. ఇటీవలే ‘చెగ్‌.ఆర్గ్‌ గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌-2022’ తుది రేసులో నిలిచింది. తమ ఆలోచనలు, చేతలతో ఎంతోమందిలో మార్పు తీసుకొస్తోన్న ఈ గోవా అమ్మాయికి.. అసలు మానసిక ఆరోగ్యం వైపు మనసెలా మళ్లిందో తెలుసుకుందాం రండి..

అనఘా రాజేశ్‌.. గోవా బిట్స్‌ పిలానీ స్టూడెంట్‌. కెమిస్ట్రీ, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనమిక్స్‌.. ప్రధాన సబ్జెక్టులుగా ఉన్నత విద్యనభ్యసిస్తోన్న ఆమెకు.. చిన్న వయసు నుంచే పరిశోధనలంటే ఇష్టం. ఈ ఆసక్తితోనే ఇప్పటివరకు పోషకాహారం, న్యూక్లియర్‌ టెక్నాలజీ, మానసిక ఆరోగ్యం, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌.. వంటి విభిన్న ప్రాజెక్టులపై పనిచేసింది. కేవలం పరిశోధకురాలిగానే కాదు.. ఆయా అంశాలపై పలు పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తుంటుంది.

బంధువు సమస్యే.. స్ఫూర్తిగా!

ఈ అమ్మాయికి సామాజిక సేవ అన్నా మక్కువే! ఎప్పటికైనా తన కార్యక్రమాల ద్వారా నలుగురిలో స్ఫూర్తి నింపాలని, తద్వారా ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని అనుకునేదీ గోవా అమ్మాయి. 2019లో ఆ సమయం రానే వచ్చింది. తన బంధువు ఎదుర్కొన్న మానసిక సమస్యను దగ్గర్నుంచి గమనించిన ఆమె.. మానసిక రుగ్మతలు మనల్ని ఎలా కుంగదీస్తాయో తెలుసుకుంది. అందుకే ఇలాంటి సమస్యల్ని దూరం చేసి.. మానసిక ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయాలన్న ఉద్దేశంతో ‘యువర్స్‌ మైండ్‌ఫుల్లీ’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది.

‘నేను పెద్దయ్యే క్రమంలో మా అంకుల్‌ ఒకరు స్కిజోఫ్రేనియా (మన ఆలోచనలు, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపే మానసిక రుగ్మత)తో బాధపడడం చూశా. సమాజ ధోరణులకు భయపడి ఆయన కనీసం వైద్య సహాయం కూడా తీసుకోలేకపోయారు. ఇది నన్నెంతో బాధించింది. ఇక 2019లో నేను న్యూయార్క్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ వారు నిర్వహించిన ‘1000 గర్ల్స్‌ 1000 ఫ్యూచర్స్‌’ అనే మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. అక్కడే అర్థమైంది.. ఈ ప్రపంచమంతా మానసిక సమస్యలతో నిండిపోయిందని! వీటి నుంచి బయటపడే క్రమంలో బాధితులు సమాజం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారన్న విషయం గ్రహించా. అందుకే సమాజంలో ఈ అనారోగ్యకరమైన ధోరణులను దూరం చేసి మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచన నుంచి పుట్టిందే యువర్స్‌ మైండ్‌ఫుల్లీ ఎన్జీవో..’ అంటూ చెప్పుకొచ్చిందీ యంగ్‌ ఛేంజ్‌మేకర్.

సమస్యకు తగ్గ.. పరిష్కారం!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు మానసిక ఆరోగ్యాన్ని చేరువ చేసే సదుద్దేశంతో రూపుదిద్దుకుందీ స్వచ్ఛంద సంస్థ. యువత తమ మానసిక సమస్యల్ని కథనాలు, గేయాలు, ఆర్ట్‌.. ఇలా ఏ రూపంలోనైనా పంచుకోవచ్చు.. వారి సమస్యను పరిశీలించిన నిపుణుల బృందం.. వారికి అవసరమైన థెరపీ సెషన్స్‌ని ఆన్‌లైన్‌లో ఉచితంగా నిర్వహిస్తుంటుంది. అంతేకాదు.. వెబినార్లు, సోషల్‌ మీడియా ప్రచార కార్యక్రమాలు, కంటెస్టులు.. ఇలా విభిన్న కార్యక్రమాలతో మానసిక ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన పెంచుతోందీ వేదిక. సుమారు 40 మందికి పైగా నిపుణులున్న ఈ బృందం.. భారత్‌తో పాటు యూఏఈ, ఆఫ్రికా, యూకే.. వంటి దేశాల్లోనూ సేవలందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు మలాలా ఫండ్‌ కూడా ఇటీవలే ఈ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలపడం విశేషం. ఇలా ఈ మూడేళ్లలో ఇప్పటివరకు సుమారు పదివేల మందికి పైగా యువతను ప్రభావితం చేసింది అనఘా నెలకొల్పిన ఎన్జీవో. అయితే 2030 నాటికి సుమారు పది లక్షల మందికి సంపూర్ణ మానసిక ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోందీ గోవా ఆంత్రప్రెన్యూర్.

సేవకు సత్కారం!

సమాజంలో, యువతలో మార్పు తెచ్చే పలు ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఉన్న అనఘా.. ‘బిట్స్‌ గోవా విమెన్‌ ఇన్‌ టెక్‌ క్లబ్‌’లోనూ భాగమైంది. ఇందులో భాగంగా.. అమ్మాయిలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో (STEM) రాణించేలా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోందామె. ప్రస్తుతం ఎండోమెట్రియోసిస్‌కు ఔషధాల్ని కనుక్కునే ఓ ప్రాజెక్ట్‌లో భాగమైన అనఘా.. మంచి వక్త కూడా! సమాజంలో మార్పు తీసుకొచ్చే ఆయా అంశాలపై ‘టెడెక్స్‌’, ‘యూత్‌ స్టెమ్‌ సమిట్‌-2020’, ‘ఎమిరేట్స్‌ యూత్‌ ప్లాట్‌ఫామ్‌ - 2021’, ‘ఎంపవర్‌మెంట్‌ టాక్స్‌’.. వంటి పలు వేదికల పైనా ప్రసంగించిందీ గోవా అమ్మాయి. అంతేకాదు.. తన సేవలతో ఇప్పటికే దుబాయ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ‘షేక్‌ హమ్దాన్‌ అవార్డు’ను అందుకున్న అనఘా.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచింది. ‘చెగ్‌.ఆర్గ్‌ గ్లోబల్‌ స్టూడెంట్‌ ప్రైజ్‌-2022’ కోసం ఎంపిక చేసిన తొలి పది మంది జాబితాలో చోటు దక్కించుకుందీ యంగ్‌ ఛేంజ్‌మేకర్‌. ఒకవేళ ఈ అవార్డు అనఘాను వరిస్తే.. రూ.79.6 లక్షల ప్రైజ్‌మనీని అందుకోనుందీ యంగ్‌ యాక్టివిస్ట్.

ఇక ఈ జాబితాలో భారత సంతతికి చెందిన గీతాంజలి రావు (అమెరికా), కెనిషా అరోరా (కెనడా)లూ చోటు దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్