Nehal Tiwari : ఆటిజంను జయించి.. ఆ కళతో రాణిస్తోంది!

శారీరక, మానసిక లోపాలు చాలామందిని కుంగదీస్తుంటాయి. జీవితంలో తామెందుకూ పనికిరామన్న నిరాశలోకి వారిని నెట్టేస్తుంటాయి. కానీ ఇలాంటి లోపాల్ని వెనక్కి నెట్టి.. తమలోని ప్రత్యేకతలతో గుర్తింపు తెచ్చుకునే వారు ఎందరో! మహారాష్ట్రకు చెందిన నేహల్‌ తివారీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రెండేళ్ల వయసులో ఆటిజం నిర్ధారణ అయిన....

Updated : 18 Apr 2023 17:36 IST

(Photos: Instagram)

శారీరక, మానసిక లోపాలు చాలామందిని కుంగదీస్తుంటాయి. జీవితంలో తామెందుకూ పనికిరామన్న నిరాశలోకి వారిని నెట్టేస్తుంటాయి. కానీ ఇలాంటి లోపాల్ని వెనక్కి నెట్టి.. తమలోని ప్రత్యేకతలతో గుర్తింపు తెచ్చుకునే వారు ఎందరో! మహారాష్ట్రకు చెందిన నేహల్‌ తివారీ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రెండేళ్ల వయసులో ఆటిజం నిర్ధారణ అయిన ఆమెకు.. అటు సమాజం నుంచి, ఇటు స్కూల్లో ఇబ్బందులు తప్పలేదు. అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాటిని అధిగమించి.. స్టోన్‌ పెయింటర్‌గా ఎదిగింది. ఇప్పుడు ఆమె పెయింటింగ్స్‌కు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ అభిమానులున్నారు. ప్రత్యేక అవసరాలున్నా.. తన ప్రతిభతో ఇలాంటి ఎంతోమందిలో చైతన్యం తీసుకొస్తోన్న నేహల్‌ స్ఫూర్తి గాథ మీకోసం..!

ప్రతిభ, కష్టపడేతత్వం, అంకితభావం.. తన జీవితంలో ఈ మూడు సూత్రాల్ని నమ్మింది నేహల్‌. అయితే ఆమె అందరు పిల్లల్లా సాధారణమైన అమ్మాయి కాదు.. ప్రత్యేక అవసరాలున్న చిన్నారి. సీమ, అనుపమ్‌ తివారీ దంపతులకు తొలి సంతానమైన నేహల్‌కు రెండేళ్ల వయసులో ఆటిజం ఉందని గుర్తించారు ఆమె తల్లిదండ్రులు. అప్పటికి ఈ సమస్యపై అవగాహన అంతంతమాత్రమే! పైగా ఇంటర్నెట్‌లోనూ పూర్తి సమాచారం అందుబాటులో లేదు. అలాంటి సమయంలో పిల్లల వైద్య నిపుణుల సలహా మేరకు తన విషయంలో తన తల్లిదండ్రులు పలు చిట్కాలు పాటించారంటోంది నేహల్‌.

ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా!

‘ఆటిజం కారణంగా.. మాటలు ఆలస్యంగా రావడం, అతి చురుగ్గా ఉండడం, పిలిస్తే పలకకపోవడం, ఐ-కాంటాక్ట్‌ లేకపోవడం.. వంటి లక్షణాలు చిన్నతనంలో నాకు సవాలుగా మారాయి. మరోవైపు నా మనసులోని భావాల్ని వ్యక్తం చేయడానికీ ఇబ్బంది పడేదాన్ని. నాకున్న హైపర్‌ యాక్టివ్‌నెస్‌ వల్ల స్కూల్లో కొన్ని చేదు సంఘటనలూ ఎదుర్కొన్నా. ఇలాంటి సమయంలో నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. నిపుణుల సలహా మేరకు పలు నైపుణ్యాల్ని నాతో సాధన చేయించారు. అందులో స్టోన్‌ పెయింటింగ్‌ ఒకటి. స్కూల్లో ఖాళీ దొరికినప్పుడల్లా వివిధ రకాల పెయింటింగ్స్‌ వేస్తూ గడిపేదాన్ని. దాంతో నాకు తెలియకుండానే నా మనసు ఆనందంతో నిండిపోయేది. అలా దీనిపై క్రమంగా ఆసక్తి పెరిగింది. ఇంటర్‌ పూర్తయ్యాక ఈ కళపై మరింత శ్రద్ధ పెట్టా.. పూర్తి మెలకువలు నేర్చుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది నేహల్‌.

అదంత సులభం కాదు!

ముంబయిలోని సెయింట్ జేవియర్స్‌ కాలేజీలో ఐటీ విభాగంలో బీఎస్సీ పూర్తిచేసిన నేహల్.. ప్రస్తుతం ‘EY India’ సంస్థలో అసోసియేట్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. మరోవైపు తన ప్రవృత్తి అయిన స్టోన్‌ పెయింటింగ్‌నూ కొనసాగిస్తోంది.
‘ఆటిజంతో భాష, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. ఆ సమయంలో రాళ్లపై పెయింటింగ్‌ వేస్తూ నా భావాల్ని వ్యక్తం చేసేదాన్ని. అలా ఈ కళ నా ప్రవృత్తిగా మారిపోయింది. నదిలో దొరికే పాలిష్‌ చేయని రాళ్లను పెయింటింగ్‌ కోసం ఉపయోగిస్తున్నా. వీటిపై అక్రిలిక్‌ కలర్స్‌తో అందమైన బొమ్మలు తీర్చిదిద్దుతున్నా. అయితే రాళ్లపై పెయింటింగ్‌ వేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇవి రంగుల్ని పీల్చుకోలేవు.. వాటిపై రంగు పూసినా అది ఇట్టే జారిపోతుంది. అందుకే అక్రిలిక్‌ కలర్స్‌ వాడుతున్నా. వాటితో రాళ్లపై డిజైన్లు వేశాక.. అవి పూర్తిగా ఆరిపోవడానికి సుమారు 15 రోజుల సమయం పడుతుంది. ఆపై ఆఖర్లో వాటిపై నుంచి వార్నిష్‌తో మరో లేయర్‌ అప్లై చేస్తా. తద్వారా డిజైన్‌ అందంగా కనిపిస్తుంది.. ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇలా తీర్చిదిద్దిన స్టోన్‌ పెయింటింగ్స్‌ని ఇంట్లో అలంకరణ వస్తువులుగా ఉపయోగించచ్చు.. ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగానూ అందించచ్చు..’ అంటోన్న నేహల్‌.. తాను వేసిన అందమైన పెయింటింగ్స్‌ని దేశవ్యాప్తంగా పలు ఎగ్జిబిషన్లలో ప్రదర్శించి ఎంతోమంది ప్రశంసలందుకుంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా తన పెయింటింగ్స్‌ని విక్రయిస్తోన్న నేహల్‌.. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. డబ్బూ సంపాదిస్తోంది. శారీరక, మానసిక లోపాలున్నా.. మనలోని ప్రత్యేకతలతోనే వాటిని అధిగమించచ్చని నిరూపిస్తోన్న నేహల్‌ కథ.. ఇలాంటి సమస్యలతో బాధపడుతోన్న ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!





Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్