Updated : 23/03/2022 17:20 IST

Ashleigh Barty: అందుకు ఇదే మంచి సమయం అనుకున్నా..!

(Photo: Instagram)

ఆమె నచ్చిన ఆటను తన కెరీర్‌గా మలచుకుంది.. పిన్న వయసులోనే అరుదైన రికార్డులెన్నో అందుకుంది.. ప్రపంచ నం.1గానూ కొనసాగుతోంది.. నిజానికి ఇలా కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్న వారెవరైనా ఏం ఆలోచిస్తారు? గతంలో ఉన్న రికార్డులు చెరిపేసి కొత్త రికార్డుల్ని తమ పేరిట లిఖించుకోవాలని, అనితర సాధ్యమైన ఫీట్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాలని ఆరాటపడతారు.. కానీ ఆమె మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి.. ఆటకు గుడ్‌బై చెప్పింది. కేవలం పాతికేళ్ల వయసులోనే రిటైర్మెంట్‌ ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని షాక్‌లో ముంచెత్తింది. తనెవరో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమే.. ఆస్ట్రేలియా టెన్నిస్‌ క్వీన్‌ యాష్లే బార్టీ. సరిగ్గా కెరీర్‌లో దూకుడు మీదున్న సమయంలోనే ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె చేసిన ప్రకటనతో ఎంతోమంది విస్మయానికి గురవుతున్నారు. ఆమె వీరాభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సహచరులు ఆమెతో జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు.

యాష్లే బార్టీ.. టెన్నిస్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరిది. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం.1గా నిలిచిన రెండో ఆస్ట్రేలియా టెన్నిస్‌ క్రీడాకారిణిగా పేరుగాంచిన ఆమె.. తాజాగా ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. కెరీర్‌లో జోరు మీదున్న తరుణంలోనే యాష్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రపంచ టెన్నిస్‌ అభిమానుల్ని విస్మయానికి గురిచేస్తోంది.

అందుకే ఈ రిటైర్మెంట్!

ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో రూపంలో తాజాగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన యాష్లే.. గతేడాది నుంచే ఈ ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ‘టెన్నిస్‌ను అమితంగా ప్రేమించే నేను ఈ ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించడం చాలా కష్టంగా అనిపిస్తోంది. భావోద్వేగాలతో నిండిన క్షణమిది. ఈ ఆట నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలెన్నో అందించింది. అయితే ప్రస్తుతం నా నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా.. ఇదివరకటి లాగే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నా ఇతర కలల్ని నెరవేర్చుకోవడానికి ఇదే మంచి తరుణం అని తెలుసుకున్నా.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. జీవితంలో మనం తీసుకునే ఏ నిర్ణయానికైనా తప్పొప్పులు ఉండవు. అది మనం నమ్ముకున్న దారి అంతే!

వింబుల్డన్‌ తర్వాతే..!

నా దృష్టిలో సక్సెస్‌ అంటే.. నా బలాబలాలేంటో, లక్ష్యాలేంటో నాకు తెలియడం. ఈ లెక్కన చూస్తే వాటిని నేను అందుకున్నా.. ఇక రిటైర్మెంట్‌ ఆలోచన ఇప్పటికిప్పుడు కలిగింది కాదు.. గతేడాది వింబుల్డన్‌ గెలిచిన తర్వాత నుంచే దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టా. నిజానికి ఈ టైటిల్‌ వ్యక్తిగతంగా, క్రీడాకారిణిగా నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఒక కల కోసం మనం ఎంతగానో కష్టపడతాం.. వింబుల్డన్‌ టైటిల్‌ నాకు అలాంటి కలే! అదే నా దృక్పథాన్ని మార్చింది. టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినంత మాత్రాన ఈ ఆటపై నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు. ఇది నా జీవితంలో ఓ కీలక భాగం. ఏదేమైనా నా జీవితంలో తర్వాతి దశ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటూ తన మనసులోని భావోద్వేగాల్ని పంచుకుందీ టెన్నిస్ స్టార్.

 

యాష్‌.. నువ్వే ఒక స్ఫూర్తి!

యాష్లే రిటైర్మెంట్‌ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్‌ అభిమానులే కాదు.. ఆమె సహచరులూ షాక్‌కు గురయ్యారు. కోర్టులో, కోర్టు వెలుపల ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు  తెచ్చుకుంటున్నారు.

‘ఏమని చెప్పను ఫ్రెండ్‌.. నా మనసు భావోద్వేగంతో నిండిపోయింది. ఇకపై టూర్లలో నిన్ను మిస్సవుతా. కోర్టులో, కోర్టు వెలుపల నువ్వో అద్భుతమైన వ్యక్తివి. ఇప్పటిదాకా నీతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఏదేమైనా నీ కలలు, ఆశయాల్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అంటూ రొమేనియా టెన్నిస్‌ క్రీడాకారిణి సిమోనా హలెప్‌ స్పందించింది. సానియా కూడా.. ‘కంగ్రాట్స్‌.. నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి! గుడ్‌ లక్‌ మేట్‌!’ అంటూ కామెంట్‌ పెట్టింది. మరోవైపు డబ్ల్యూటీఏ కూడా యాష్లే అద్భుతమైన ట్రాక్‌ రికార్డుల్ని గుర్తు చేసుకుంది. ‘ఆటను అమితంగా ప్రేమించే మీరు నేటి యువతరానికి ఆదర్శం!’ అంటూ ఆమె సేవల్ని కొనియాడింది.


క్రికెట్‌ కోసం టెన్నిస్‌కు విరామం!

* క్వీన్స్‌లాండ్‌లోని ఇప్స్‌విచ్‌ సిటీలో జన్మించింది యాష్లే. టెన్నిస్‌పై మక్కువతో నాలుగేళ్ల ప్రాయంలోనే రాకెట్‌ పట్టుకుంది. ఈ క్రమంలో కోచ్‌ పర్యవేక్షణలో, ఇంట్లో గంటల తరబడి సాధన చేసేదామె.

* తన క్రీడా నైపుణ్యాల్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తనకంటే ఆరేళ్లు పెద్దవారైన అబ్బాయిలతోనూ సాధన చేసింది యాష్‌. ఆపై వారితో పోటీ పడే స్థాయికి ఎదిగింది.

* 15 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ జూనియర్‌ టైటిల్‌ గెలుచుకుంది యాష్‌. తద్వారా 1998లో జెలెనా డాకిస్‌ తర్వాత జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి ఆస్ట్రేలియన్‌ అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.

* వృత్తిపరంగా ఎదిగే క్రమంలో కొన్ని సవాళ్లు, ఒత్తిళ్లను జయించాలని గ్రహించిన ఆమె.. రెండేళ్లు టెన్నిస్‌కు విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే 2014-16 వరకు విరామం తీసుకుంది.

* టెన్నిస్‌ను అమితంగా ప్రేమించే యాష్‌కు నెట్‌బాల్‌, క్రికెట్‌ క్రీడలన్నా మక్కువే! ఈ ఇష్టంతోనే 2014లో టెన్నిస్‌కు విరామం ప్రకటించాక క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుందీ టెన్నిస్‌ ఐకాన్‌. ఈ క్రమంలోనే ‘విమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌’లో బ్రిస్బేన్‌ హీట్ జట్టు తరఫున మ్యాచ్‌లాడింది. ‘ప్రతికూల పరిస్థితుల్లో మనం తీసుకునే విరామమే.. తిరిగి మనల్ని కెరీర్‌లో దూసుకుపోయేలా’ చేస్తుందంటోందీ ఆసీస్‌ ప్లేయర్.

* రెండేళ్ల విరామం అనంతరం రెట్టింపు ఉత్సాహంతో గేమ్‌లోకి అడుగుపెట్టిన యాష్.. 2019లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరియా షరపోవాను ఓడించి.. తన మొదటి గ్రాండ్‌ స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. తద్వారా 2009లో జెలెనా డాకిస్‌ తర్వాత ఈ ఈవెంట్లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించిన మొదటి ఆస్ట్రేలియన్‌గా నిలిచింది.

* తన కెరీర్‌లో ఇప్పటిదాకా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌) గెలిచిన యాష్‌.. సింగిల్స్‌, డబుల్స్‌ కలుపుకొని మరో 15 టైటిళ్లు తన ఖాతాలో వేసుకుంది.

* తన ఆటతీరుతో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నిన్నటిదాకా ప్రపంచ నం.1గా కొనసాగిన ఆమె.. అగ్రస్థానంలో అత్యధిక రోజులు ఉన్న నాలుగో ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. 121 వారాల పాటు ఆమె ప్రపంచ నం.1గా ఉంది. స్టెఫీ గ్రాఫ్‌ (186 వారాలు), సెరెనా విలియమ్స్‌ (186 వారాలు), మార్టినా నవ్రతిలోవా (156 వారాలు).. ఆమె కంటే ముందున్నారు.

* Indigenous Tennis Ambassador గా యాష్‌ పేరును ప్రకటించింది టెన్నిస్‌ ఆస్ట్రేలియా. ఈ క్రమంలో ఆదివాసీ పిల్లల్ని టెన్నిస్‌ దిశగా ప్రోత్సహించే బాధ్యతను తన భుజాలకెత్తుకుందామె. ‘నిజానికి నేనూ ఆదివాసీ మహిళను. ఇలా చెప్పుకోవడానికి నేను గర్వపడతా..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుందీ టెన్నిస్‌ క్వీన్.

* యాష్లే డాగ్‌ లవర్‌. తన వద్ద నాలుగు కుక్కలున్నాయి. అవి తన ప్రాణమని, స్ట్రెస్‌ బస్టర్స్‌ అని చెబుతోందీ ఆసీస్‌ ప్లేయర్.

* కాఫీ తాగడమే కాదు.. పెట్టడానికీ ఇష్టపడుతుంది యాష్‌. ఈ క్రమంలో బారిస్టా (కాఫీ తయారీకి సంబంధించి వివిధ నైపుణ్యాలు కలిగి ఉండడం) అర్హత కూడా సాధించానంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని