అందుకే డాక్టర్‌తో పెళ్లి వద్దంది!

మహిళల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైన 'క్రికెట్ క్వీన్' మిథాలీ జీవితంలో చాలామందికి తెలియని ఆసక్తికర విశేషాలు ఎన్నో ఉన్నాయి.. అలాంటి వాటిలో కొన్నిటి గురించి మీ కోసం......

Published : 09 Jun 2022 18:35 IST

(Photo: Instagram)

మహిళల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైన 'క్రికెట్ క్వీన్' మిథాలీ జీవితంలో చాలామందికి తెలియని ఆసక్తికర విశేషాలు ఎన్నో ఉన్నాయి.. అలాంటి వాటిలో కొన్నిటి గురించి మీ కోసం..

మహిళా క్రికెట్లో పెద్దగా ఆదాయం లేని రోజుల్లో వైద్యుడిని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడే అవకాశం వచ్చింది మిథాలీకి. కానీ పెళ్లి తర్వాత ఆటకు దూరంగా ఉండాలని షరతు పెట్టడంతో ఆ పెళ్లి వద్దనుకుందట. ఇలా తన ఆత్మాభిమానాన్ని, ఆటపై ప్రేమను చాటుకుందీ మేటి క్రికెటర్.

అలాగే ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌లో మహిళా వ్యాఖ్యాత కోసం ఇంటర్వ్యూకు కూడా వెళ్లింది మిథాలీ. అన్ని పరీక్షల్లోనూ పాసైంది. కానీ మోకాళ్ల పైవరకు ఉండే దుస్తులు వేసుకోవాలని చెప్పగానే ఇంటికి తిరిగొచ్చేసింది.

ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ!

🟇 1999లో తన పదహారేళ్ల ప్రాయంలో ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మిథాలీ.. ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుపై 114 పరుగులు చేసిన ఈ క్రికెట్ దిగ్గజం.. ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అంతేకాదు.. డెబ్యూ మ్యాచ్‌లోనే వందకు పైగా పరుగులు చేసిన నాలుగో మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి గడించింది మిథాలీ.

🟇 2002 ప్రపంచకప్‌లో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూనే ఆ టోర్నీలో పాల్గొన్న ఈ మేటి క్రికెటర్.. ఆటపై తన అంకితభావాన్ని చాటుకుంది.

🟇 21 ఏళ్లకే భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మిథాలీ.. ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ క్రీడాకారిణిగా, మొత్తంగా ఏడో క్రీడాకారిణిగా నిలిచింది. నాటి నుంచి నేటి వరకు తన కెప్టెన్సీలో రెండుసార్లు మన మహిళల జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. తన చక్కనైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్‌తో, స్టార్ ప్లేయర్‌గా ఉన్నా జట్టు సహచరులతో స్నేహభావంతో మెలుగుతూ, వారికి క్రీడా నైపుణ్యాల్ని నేర్పిస్తూ కూల్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకుందీ స్త్టెలిష్ ప్లేయర్.

మహిళల క్రికెట్లో సచిన్! 

🟇 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో భాగంగా.. వన్డేల్లో 7805, టీ20ల్లో 2364, టెస్టుల్లో 669 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ క్రికెటర్‌.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో లీడింగ్‌ స్కోరర్‌గా నిలిచింది. అందుకే ఆమెను అభిమానులంతా ముద్దుగా ‘తెందూల్కర్‌ ఆఫ్‌ ఇండియన్‌ విమెన్స్‌ క్రికెట్‌’గా పిలుచుకుంటారు.

🟇 అంతేకాదు.. మిథాలీ ఆరాధ్య క్రికెటర్ కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కరే. ఆయన ఆటతీరును, సహచరులతో మెలిగే విధానాన్ని గ్రహించిన ఈ మేటి క్రికెటర్ క్రీడా రహస్యం కూడా అదేనంటూ అభిమానులు, క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తుంటారు.

🟇 సుమారు 23 ఏళ్ల పాటు తన జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేసిన మిథాలీ.. ఇంతటి సుదీర్ఘ కెరీర్‌ని కొనసాగించిన తొలి మహిళా క్రికెటర్‌గానూ కీర్తి గడించింది. పురుషులు, మహిళల క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు కెరీర్‌లో కొనసాగిన వారిలో నాలుగో స్థానంలో నిలిచిందీ క్రికెట్‌ దిగ్గజం.

🟇 జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా, ప్లేయర్ కోచ్‌గానూ వ్యవహరించిన ఈ హైదరాబాదీ ప్లేయర్.. ఓ క్రీడాకారిణిగా, కెప్టెన్‌గానే కాదు.. కోచ్‌గానూ తన సత్తాను చాటుకుంది.

భరతనాట్యమంటే ఎంతో ఇష్టం!

🟇 పదేళ్ల వయసులో మిథాలీ చాలా ఆలస్యంగా నిద్ర లేచేది. ఆ బద్ధకాన్ని వదిలించాలనే ఉద్దేశంతోనే మిథాలీ తండ్రి దొరై రాజ్ సికింద్రాబాద్‌లోని ఓ స్పోర్ట్స్ అకాడమీలో ఆమెను చేర్పించారు.

🟇 అలా పదేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఆమెకు అంతకుముందు క్రికెటన్నా, ఇతర క్రీడాంశాలన్నా అస్సలు ఇష్టముండేది కాదట. అందరమ్మాయిల్లాగే తానూ భరతనాట్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపేదాన్నని చెబుతుందీ మేటి క్రికెటర్.

🟇 చిన్నతనం నుంచీ భరతనాట్యంపై విపరీతమైన ఆసక్తి కనబరిచే మిథాలీ.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ నృత్యాన్ని నేర్చుకుంది. అంతేనా.. కొన్ని స్టేజి పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చింది. ఇక తన చూపు క్రికెట్‌ పైకి మళ్లిన తర్వాత కూడా తన అభిరుచిని వదల్లేదామె. కాస్త కష్టమైనా రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో నాట్యం సాధన చేస్తూ తనలోని మక్కువను చాటేదీ క్రికెటర్.

🟇 క్రికెట్‌లో మిథాలీ ప్రతిభను గుర్తించిన మాజీ పేసర్ జ్యోతి ప్రసాద్ ఆమెకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించేందుకు ఆమె తల్లిదండ్రులను అతి కష్టమ్మీద ఒప్పించి మరో కోచ్ సంపత్‌కుమార్ దగ్గరికి పంపించారు. ఆమె ఆటతీరు గమనించిన సంపత్ భవిష్యత్తులో మిథాలీ మహిళల క్రికెట్లో రికార్డులు సృష్టిస్తుందని ముందుగానే వూహించారు. పదహారేళ్ల వయసు వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయిలో మిథాలీ ఆడడం చూడాలనుకొన్నారాయన. కానీ అది నెరవేరడానికి ముందే ఓ ప్రమాదంలో చనిపోయారు.

క్రికెట్లోకి రాకపోయుంటే... 

🟇 ఒకవేళ మీరు క్రికెటర్ కాకపోయుంటే? అని అడిగితే.. ‘సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి సేవ చేయడమంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. అలాగే భరతనాట్యాన్నీ ప్రేమిస్తా. నేను క్రికెట్‌లోకి రాకపోతే సివిల్ సర్వీసెస్‌లో చేరేదాన్ని. అలాగే భరత నాట్యాన్నీ కొనసాగించేదాన్ని..’ అని చెబుతుందీ క్రికెట్ బ్యూటీ.

🟇 తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు, రికార్డులు, అవార్డులు-రివార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ పవర్‌ఫుల్ క్రికెటర్.. ‘విజ్డెన్ ఇండియా క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి గడించింది. 2015 ఏప్రిల్‌లో ఆమె ఈ అవార్డును అందుకుంది.

పుస్తకాలు వదలదు!

మిథాలీకి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ప్రతి మ్యాచ్‌లో తాను బ్యాటింగ్‌కు వెళ్లే ముందు పుస్తకాలు చదువుతూ వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం తనకు అలవాటు. జీవితంలో మరింత ఎత్తుకు ఎదగడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని నమ్మే ఈ క్రికెటర్.. క్రైమ్, చరిత్ర, ఆత్మకథలు, ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతానంటోంది. 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ప్రముఖ పర్షియన్ కవి జలాలుద్దీన్ రూమీ రచించిన ‘ది ఎసెన్షియల్ రూమీ’ అనే పుస్తకాన్ని చదువుతూ మీడియా కంటికి చిక్కింది. అప్పుడు ఆ ఫొటో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇష్టాలు ఇవీ!

🟇 ఫేవరెట్ క్రికెటర్ - సచిన్ తెందూల్కర్, రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్

🟇 నటులు - షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్

🟇 నటీమణులు - కాజోల్, అనుష్కా శర్మ

🟇 వ్యాఖ్యాత (కామెంటేటర్) - నాజర్ హుస్సేన్

🟇 ఆహారం - సోన్ పాపిడి

🟇 రంగు - నలుపు

🟇 ప్రదేశం - లండన్

🟇 అలవాట్లు - వ్యాయామం, నాట్యం, పుస్తకాలు చదవడం

🟇 కుటుంబ నేపథ్యం - తమిళ కుటుంబం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్