Published : 15/01/2022 15:33 IST

పద పదవే వయ్యారి గాలిపటమా..!

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. నేల రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతే.. ఆకాశం గాలిపటాలతో నిండిపోతుంది. అలా ఆ సప్తవర్ణాల గాలిపటాలు నింగిలో ఎగురుతుంటే.. ఆకాశానికి కూడా పండగ కళ వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఎక్కడ చూసినా 'గాలిపటమా పద పద పద' అంటూ వాటిని ఎగరేసే వారే కనిపిస్తారు.. ఎవరి నోట విన్నా 'ఖీంచ్', 'డీల్' లాంటి పదాలే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి.. ఆనందాల కాంతి.. ఆ ఆనందాన్ని మరింత వెల్లివిరిసేలా చేసేదే గాలిపటం. ఈ పండగ వేళ గాలిపటం గురించి కొన్ని ముచ్చట్లు.. మీకోసం..

అక్కడి నుంచి..

మొట్టమొదటి గాలిపటం చైనాలో పట్టువస్త్రంతో తయారైందట. కాలక్రమంలో గాలిపటాలు మన దేశంలోనూ ఎగరడం ప్రారంభించాయి. ముందు సన్నని వస్త్రంతో, ఆ తర్వాత కాగితంతో గాలిపటాలను తయారుచేయడం ప్రారంభమైంది. మనదేశంలో గుజరాత్‌లో గాలి పటాల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. నిజాం నవాబులు కూడా గాలిపటాల సంస్కృతిని బాగా ప్రోత్సహించడంతో తెలంగాణలో కూడా అవి ఎక్కువగా కనిపించేవట. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సందడిలో తమ వంతు భాగం పంచుకుంటున్నాయి పతంగులు. వీటిని ఎగరేయడం అంటే ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ సరదానే.. అందుకే గాలిపటాల సందడిలో ఆడవారి పాత్ర లేదు అనుకోవడానికి లేదు. ఆసక్తి, నేర్పు ఉంటే చాలు.. గాలిపటం ఎగరేయడం చాలా సులువు.

సంక్రాంతి.. పతంగుల కాంతి..

గాలిపటాలు ఎగరేయడానికి ప్రత్యేకంగా ఒక సమయమంటూ ఏం లేకపోయినా.. మన దేశంలో సంక్రాంతి సమయంలో పతంగులు ఎగరేయడం ఎక్కువగా జరుగుతుంది. అయితే దీని వెనుక కూడా ఒక కారణం ఉంది.. పూర్వకాలంలో గాలిపటాలను రోజంతా కాకుండా కేవలం ఉదయం వేళలోనే ఎగరేసేవారు. సంక్రాంతి చలికాలంలో వస్తుంది. ఆ కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి మన శరీరాన్ని తాకే సమయం కూడా తక్కువే. అందుకే లేలేత సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ పతంగులను ఎగరేయడం వల్ల సూర్యరశ్మి నుంచి విటమిన్ 'డి' ఎక్కువగా అందడమే కాకుండా.. ఎండ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మనం పొందచ్చు. అంతేకాదు.. ఈ సమయంలో గాలి ఒకే దిశగా సాగడం వల్ల గాలిపటాలు ఎగరేయడానికి సులువుగా ఉంటుందని కూడా చెబుతారు.

ఎన్నెన్నో వర్ణాలు..!

చిన్నప్పుడు వార్తాపత్రికలను చింపి కొబ్బరి ఈనెలు, ఉడకబెట్టిన మైదాపిండిని ఉపయోగించి పతంగులు తయారు చేసుకోవడం మనందరికీ తెలిసిందే. కేవలం ఇంట్లో చేసుకోవడమే కాదు.. మార్కెట్లో కొని ఎగరేసే గాలిపటాల్లోనూ ఒకటీ, రెండు కాదు.. కొన్ని వేల రకాలున్నాయి. వాటిలో కొన్నింటికి విభిన్నమైన పేర్లు కూడా ఉన్నాయి. గుడ్లందార్, గుడ్డి లంగోటి, అద్దా వంటివి మన దగ్గర సాధారణంగా వినిపించే పేర్లు.. గుడ్లందార్ అంటే రెండు కళ్లున్న గాలిపటం, ఒంటికన్ను ఉన్న దాన్ని గుడ్డి లంగోటి అంటారు. అద్దా అంటే చాలా పెద్ద పతంగి అని అర్థం. ఇవే కాదు.. విభిన్నమైన రకాల్లో ఎన్నో గాలిపటాలు మన వద్ద లభిస్తుంటాయి. అయితే కాలం మారిపోవడంతో ఇప్పుడు ఇలాంటి సంప్రదాయ పతంగుల కంటే విభిన్నమైన ఆకృతుల్లో తయారు చేసిన పతంగులే ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అభిమాన తారలు, నేతల చిత్రాలతో కూడిన పతంగులు; కార్టూన్ బొమ్మలతో కూడిన గాలిపటాలు, సామాజిక అంశాల్ని స్పృశించేలా ఉండే పతంగులు కూడా ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. పగలే కాదు.. రాత్రి పూట ఎగరేయడానికి కూడా ప్రత్యేకమైన గాలిపటాలు లభిస్తాయి. చిన్న చిన్న ఎల్‌ఈడీ లైట్లతో వెలిగిపోతూ ఎగిరే పతంగులు చీకట్లో మిలమిలా మెరిసే నక్షత్రాలను తలపిస్తాయి.

పతంగుల పండగలు..

గాలిపటాలపై అన్ని దేశాల వారికీ ఆసక్తి ఎక్కువే. అందుకే వాటిని సాధారణంగా ఎగరేయడమే కాదు.. పోటీలు పెట్టుకొని మరీ పతంగుల్ని ఆకాశపుటంచుల్ని తాకేలా చేస్తారు. మన దేశంలో ఏటా సంక్రాంతి, ఉత్తరాయనం సందర్భంగా గుజరాత్‌లోని సబర్మతీ నదీ తీరంలో జరిగే 'ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్'కి దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారు. కేవలం మన దేశం నుంచే కాదు.. అమెరికా, బ్రిటన్, చైనా, జపాన్, ఇండోనేషియా, ఇటలీ, మలేషియా వంటి దేశాల నుంచి వచ్చిన పోటీదారులు కూడా ఇందులో పాల్గొంటారు. 2013లో ప్రారంభమైన ఈ ఫెస్టివల్ ప్రపంచంలోనే ఎక్కువమంది హాజరయ్యే కైట్ ఫెస్టివల్‌గా పేరు తెచ్చుకుంది. ఇదే కాదు.. ఇంకా ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో పతంగుల పండగలు జరుగుతూ ఉంటాయి. అమెరికాలో ఏటా మార్చిలో జరిగే కైట్ ఫెస్టివల్ ప్రాచీనమైనది. ఇది 1929 నుంచి ప్రతి సంవత్సరం కొనసాగుతోంది. ఇక సింగపూర్‌లో ఎన్‌టీయూసీ ఇన్‌కం కైట్ ఫెస్టివల్, యూకేలో బ్రిస్టల్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, చైనాలో జరిగే వీఫండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, ఇండోనేషియాలో బాలి కైట్ ఫెస్టివల్, అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగే బ్లోసమ్ కైట్ ఫెస్టివల్, జకార్తాలో జరిగే పంగాండరన్, జపాన్‌లో ఉచ్చిండా, ఇషివాకా.. మొదలైన వాటిని ప్రముఖ పతంగుల పండగలుగా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ సంస్థల ఆధ్వర్యంలో పతంగుల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది కూడా వీటన్నిటికీ తాత్కాలికంగా బ్రేక్ పడిందనే చెప్పాలి.

పతంగి నేర్పే పాఠాలెన్నో..!

నింగికి నిచ్చెన వేయాలని, ఆకాశంలో పక్షిలా విహరించాలని మనిషికి ఏనాటి నుంచో కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి గాలిపటాన్ని ఓ మార్గంగా మార్చుకున్నాడని చెప్పుకోవచ్చు. అందుకే ఆకాశంలోకి తాను స్వయంగా వెళ్లలేక అక్కడికి చేరుకోవడానికి గాలిపటాన్ని ఓ మార్గంగా చేసుకున్నాడేమో అనిపిస్తుంది. అంతేకాదు.. ఈ గాలిపటం మనకు ఎన్నో జీవిత పాఠాలను కూడా బోధిస్తుంది.

* మన లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని.. దానివల్లే పైకి ఎదగడం సాధ్యమవుతుందని గాలిపటం చెబుతుంది. అంతేకాదు.. మన జీవిత గమనాన్ని కూడా గాలిపటంతో పోల్చవచ్చు.

* గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఎలాగైతే పట్టు బిగిస్తామో.. మన జీవితంపై కూడా అలాగే పట్టు బిగించి ముందుకు సాగాలి. అలాగే దిశను, వేగాన్ని నియంత్రించుకోవాలి. అయితే మరీ బిగబట్టినా.. లేదా అలా వదిలేసినా.. గాలిపటం కింద పడినట్టే జీవితమూ సమస్యల్లో పడుతుంది.

* గట్టిగా వీచే గాలితో పాటు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న మన పతంగిని కట్ చేయడానికి వచ్చే మరో గాలిపటంలా అప్పుడప్పుడూ మన జీవితంలోనూ అనేక సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిపైనే శ్రద్ధ పెట్టి సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. జీవితంలో అన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగవు. కానీ అన్నింటినీ భరిస్తూ.. శ్రద్ధగా పైకి ఎదగడానికి ప్రయత్నించాలని చెబుతుంది గాలిపటం.

* ఇవే కాదు.. పతంగులు ఎగరేయడం బృంద స్ఫూర్తిని కూడా పెంచుతుంది. వీటిని ఎగరేసే సమయంలో ఒకరితో ఒకరు పోటీపడడం వల్ల ఆరోగ్యకరమైన పోటీ అలవడితే, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఎగరేయడం వల్ల బృంద స్ఫూర్తి పెరుగుతుంది.

చూశారుగా.. రంగురంగుల గాలిపటం గురించి కొన్ని ముచ్చట్లు.. మరి, మీరూ సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగరేయడానికి రడీ అవుతున్నారా? అయితే రోడ్డు, మిద్దెలపై, లేదా రోడ్డు పక్కన కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగరేయండి. అలాగే పతంగుల కోసం పదునుగా ఉండే మాంజాలను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించడం వల్ల అవి పక్షులకు ఎలాంటి నష్టాన్ని కలిగించకుండా జాగ్రత్త పడచ్చు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం వహించకండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని