Miss World: ఈ అందాల రాశి గురించి ఇవి మీకు తెలుసా?

‘అందమంటే వ్యక్తి శరీరాకృతిలో ఉండదు.. వారి నిష్కల్మషమైన చిరునవ్వు, గుణగణాల్లో ఉంటుంది..’ అంటోంది కొత్త ప్రపంచ సుందరి కరోలినా బీలాస్కా. తన అంతః సౌందర్యం, చక్కటి వ్యక్తిత్వంతో.. వివిధ దేశాల సుందరాంగుల్ని వెనక్కి నెట్టి 2021 ‘మిస్‌ వరల్డ్‌’గా అవతరించిందీ పోలండ్ బ్యూటీ. తద్వారా తన దేశానికి 33 ఏళ్ల తర్వాత రెండో ప్రపంచ సుందరి కిరీటాన్ని....

Published : 17 Mar 2022 16:32 IST

(Photo: Instagram)

‘అందమంటే వ్యక్తి శరీరాకృతిలో ఉండదు.. వారి నిష్కల్మషమైన చిరునవ్వు, గుణగణాల్లో ఉంటుంది..’ అంటోంది కొత్త ప్రపంచ సుందరి కరోలినా బీలాస్కా. తన అంతః సౌందర్యం, చక్కటి వ్యక్తిత్వంతో.. వివిధ దేశాల సుందరాంగుల్ని వెనక్కి నెట్టి 2021 ‘మిస్‌ వరల్డ్‌’గా అవతరించిందీ పోలండ్ బ్యూటీ. తద్వారా తన దేశానికి 33 ఏళ్ల తర్వాత రెండో ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. మేనేజ్‌మెంట్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. బిజినెస్ స్టడీస్‌లో మాస్టర్స్ చదువుతోంది. పీహెచ్‌డీ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఆమెకు మోటివేషనల్ స్పీకర్‌గానూ మారాలనుందట! ఇలా ఓవైపు చదువు, మరోవైపు మోడలింగ్‌తో బిజీగా ఉండే  అందాల రాశి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..!

కరోనా కారణంగా రెండేళ్ల పాటు వాయిదా పడ్డ ప్రపంచ సుందరి పోటీలను తాజాగా ప్యూర్టోరికో వేదికగా నిర్వహించారు. వివిధ దేశాల నుంచి 40 మంది సెమీఫైనలిస్టులు ఫైనల్‌ కోసం పోటీ పడగా.. అందులో పోలండ్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా బీలాస్కా 2021కి గాను ‘ప్రపంచ సుందరి’గా అవతరించింది. మాజీ మిస్‌ వరల్డ్‌ టోనీ ఆన్‌ సింగ్‌ కరోలినాకు కిరీటం అలంకరించింది. ఈ పోటీల్లో అమెరికా తరఫున ప్రాతినిథ్యం వహించిన ఇండో-అమెరికన్‌ శ్రీసైని తొలి రన్నరప్‌గా, ఐవరీ కోస్ట్‌ బ్యూటీ ఒలీవియా యేస్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక ఈ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్న మానస వారణాసి 13వ స్థానం దక్కించుకుంది.

నీడలేని వారి కోసం తన వంతుగా..!

పోలండ్‌లోని లోడ్జ్‌ సిటీలో జన్మించింది కరోలినా బీలాస్కా. మేనేజ్‌మెంట్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. బిజినెస్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ చదువుతోంది. పీహెచ్‌డీ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఆమెకు మోటివేషనల్‌ స్పీకర్‌గానూ మారాలనుందట! ఇలా ఓవైపు చదువు, మరోవైపు మోడలింగ్‌తో బిజీగా ఉండే ఆమెకు.. సమాజ సేవ చేయడమంటే మక్కువ! ఈ క్రమంలోనే ప్రస్తుతం లోడ్జ్‌లోని ‘Zupa Na Pietrynie’ అనే స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా పనిచేస్తోంది. నిరాశ్రయులకు కూడు, గూడు, గుడ్డ అందించడంతో పాటు సామాజిక బహిష్కరణపై పోరాడడమే ఈ ఎన్జీవో లక్ష్యం. ఇందులో భాగంగానే.. నిరాశ్రయులకు, అవసరంలో ఉన్న సుమారు 300 మందికి ప్రతి ఆదివారం భోజనం, ఫుడ్‌ ప్యాకెట్స్‌, నీళ్లు-పానీయాలు, దుస్తులు, మాస్కులు.. వంటివి అందిస్తుంటారు. అలాగే బాధితులు సంబంధిత నిపుణుల వద్ద నుంచి వైద్య చికిత్సలు, న్యాయపరమైన సలహాలు కూడా పొందచ్చు. ఇక నిరాశ్రయుల కోసం ఓ సోషల్‌ బాత్రూమ్‌ని కూడా ఇటీవలే నెలకొల్పిందీ సంస్థ. మరికొంతమందికి ప్రభుత్వ అనుమతితో వ్యాక్సిన్లు కూడా వేయిస్తోంది.

ఇలాంటి సంస్థలో భాగమై.. సమాజానికి తన వంతుగా సేవ చేయడం తన పూర్వ జన్మ సుకృతం అంటోందీ పోలండ్‌ బ్యూటీ. ‘ప్రపంచ విజేతగా నా పేరు పలకగానే నేనే నమ్మలేకపోయా.. ఒక్క క్షణం షాక్‌లోనే ఉండిపోయా. ప్రపంచ సుందరి కిరీటం అందుకోవడమంటే ఓ గొప్ప గౌరవం. నా సేవల్ని మరింత విస్తరించడానికి ఈ విధంగా నాకు సదవకాశం దొరికింది. ఈ మధురమైన క్షణాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా..’ అంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది కరోలినా.

అదే నా బ్యూటీ సీక్రెట్!

* 14 ఏళ్లకే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది కరోలినా.. ఈ క్రమంలోనే ‘ఎలైట్‌ మోడల్‌ లుక్‌ కాంపిటీషన్‌’లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది.

* 2019, నవంబర్‌లో ‘మిస్‌ పొలోనియా’గా కిరీటం అందుకున్న ఈ భామ.. తద్వారా మిస్ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించింది.

* తాజా విజయంతో తన దేశానికి సుమారు 33 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండో ప్రపంచ సుందరి కిరీటం అందించిందీ పోలండ్‌ సుందరి. మొదటిసారి 1989లో అనేటా క్రెగ్లికా ఆ దేశ తొలి మిస్‌ వరల్డ్‌గా అవతరించింది.

* పీహెచ్‌డీ పూర్తి చేశాక.. భవిష్యత్తులో టీవీ వ్యాఖ్యాతగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది కరోలినా.

* సాహసకృత్యాలంటే ఈ ముద్దుగుమ్మకు మహా ఇష్టమట. అందుకే సమయం చిక్కినప్పుడల్లా ఈత, స్కూబా డైవింగ్‌, జిప్‌ లైనింగ్‌, విండ్‌ సర్ఫింగ్‌, వైల్డ్‌ రాఫ్టింగ్‌, హైకింగ్‌.. వంటి క్రీడల్లో పాల్గొనడానికి ఆరాటపడతానంటోంది.

* ప్రయాణాలన్నా ఈ చక్కనమ్మకు భలే సరదానట! అందుకే అప్పుడప్పుడూ వీలు కుదుర్చుకొని మరీ వివిధ దేశాల్ని చుట్టొస్తుందట!

* పుస్తకాల పురుగైన కరోలినా.. నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత సామర్థ్యాలను పెంపొందించే బుక్స్‌ ఎక్కువగా చదువుతానంటోంది. జాన్‌ సి. మ్యాక్స్‌వెల్‌ తనకు ఇష్టమైన రచయిత.

* సినిమాలు చూడ్డానికీ ఇష్టపడతానంటోంది కరోలినా. ‘ఇన్టచబుల్స్‌’, ‘ది పర్‌స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’, ‘లైఫ్‌ ఇట్‌సెల్ఫ్‌’, ‘ది నోట్‌బుక్‌’.. వంటి సినిమాలు తన ఫేవరెట్ అని చెబుతుంది.

* ‘నా తల్లే నాకు స్ఫూర్తి.. సాకారమవుతోన్న నా ప్రతి కల వెనుక ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. అందుకే తనతో కలిసి ప్రయాణాలు చేయడమన్నా, సాహసకృత్యాల్లో పాల్గొనడమన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు అమ్మతో కలిసి సుమారు 32 దేశాలు తిరిగాను..’ అంటోందీ మిస్‌ వరల్డ్.

* ఒకవేళ భవిష్యత్తులో తనకు సినిమాల్లో నటించే అవకాశమొస్తే.. ఆస్ట్రేలియా నటి మార్గోట్‌ రాబీతో కలిసి నటిస్తానంటోంది. ఎందుకంటే అందరూ తనను ‘నువ్వు చూడ్డానికి మార్గోట్‌’లా ఉన్నావంటుంటారట!

* పోలిష్‌ (పోలండ్‌ జాతీయ భాష), ఇంగ్లిష్‌.. అనర్గళంగా మాట్లాడగలదు కరోలినా.

* ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ టీవీ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని మహిళా సాధికారతపై ప్రసంగించిందీ పోలండ్‌ సుందరి.

* ఫిట్‌గా ఉండడానికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటుంది కరోలినా. ఈ క్రమంలో విభిన్న వ్యాయామాలు చేయడమే కాదు.. వివిధ రకాల ఆటలూ ఆడతానంటోంది. ‘ఆటల వల్ల ఆత్మవిశ్వాసం, బాధ్యత, క్రమశిక్షణ అలవడతాయి. బృందంతో కలిసి పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది..’ అంటోందీ అందాల తార.

* సోషల్‌ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. పలు స్ఫూర్తిదాయక పోస్టులు కూడా షేర్‌ చేస్తుంటుంది. ‘నిష్కల్మషమైన చిరునవ్వే ఇంటికి వెలుగు. మన అందానికి, ఆరోగ్యానికీ అదే ముఖ్యం కూడా! అందుకే నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటా..’ అంటూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలని చెప్పకనే చెబుతోందీ స్మైలింగ్‌ బ్యూటీ.


విధికి ఎదురీది రన్నరప్‌గా..!

తాజా ప్రపంచ సుందరి పోటీల్లో ఇండో-అమెరికన్‌ శ్రీసైని మొదటి రన్నరప్‌గా నిలిచింది. అమెరికా తరఫున ప్రాతినిథ్యం వహించిన ఆమె.. గతేడాది ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ కిరీటం దక్కించుకున్న తొలి భారత సంతతి యువతిగా చరిత్ర సృష్టించింది. తద్వారా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్న తొలి భారత సంతతి మహిళగానూ ఘనత సాధించింది.

1996లో పంజాబ్‌లోని లూథియానాలో జన్మించిన ఆమె.. తనకు ఐదేళ్ల వయసున్నప్పుడే తన కుటుంబం అమెరికాలోని వాషింగ్టన్‌లో స్థిరపడింది. దురదృష్టవశాత్తూ స్కూలుకెళ్లే వయసులోనే గుండె సంబంధిత అనారోగ్యం బారిన పడిన ఆమెకు వైద్యులు పేస్‌మేకర్‌ (కృత్రిమ గుండె) అమర్చారు. డ్యాన్స్‌, ఆటలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. అయినా పట్టుబట్టి మరీ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుందామె. ఇక 12 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదం రూపంలో విధి తనకు మరో సవాలు విసిరింది. ఈ క్రమంలో ముఖం ఎడమవైపు కాలిన గాయాలైనా నిండైన ఆత్మవిశ్వాసంతో కోలుకుంది. ఆ తర్వాత మోటివేషనల్‌ స్పీకర్‌గానూ మారింది. తన అనుభవాలను అందరితో పంచుకోవడానికి పలు ఆర్టికల్స్‌ కూడా రాసింది. బాహ్య సౌందర్యంతో పాటు అందమైన మనసున్న ఆమె.. వైద్యులు వెళ్లలేని సరిహద్దు ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి.. యునిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు పొందింది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన ఈ చిన్నది.. తాను ఇక్కడి దాకా రావడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్