Trishala Dutt : అవి మాసిపోవు.. చెరిగిపోవు.. అయినా అవంటే నాకిష్టం..!
మన జీవనశైలిలో చోటుచేసుకునే కొన్ని మార్పులు శరీరం, మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా బరువు పెరగడం, తగ్గడం.. వాటి తాలూకు స్ట్రెచ్‌మార్క్స్ శరీరంపై శాశ్వతంగా ఉండిపోతాయి. అయితే ఇలాంటి మార్పుల్ని సానుకూలంగా స్వీకరించినప్పుడే సంతోషంగా....
(Photos: Instagram)
మన జీవనశైలిలో చోటుచేసుకునే కొన్ని మార్పులు శరీరం, మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా బరువు పెరగడం, తగ్గడం.. వాటి తాలూకు స్ట్రెచ్‌మార్క్స్ శరీరంపై శాశ్వతంగా ఉండిపోతాయి. అయితే ఇలాంటి మార్పుల్ని సానుకూలంగా స్వీకరించినప్పుడే సంతోషంగా ఉండగలమంటోంది బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ముద్దుల కూతురు త్రిషాలా దత్. వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్ అయిన ఆమె.. ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడితో బరువు పెరిగింది. ఆపై ఆ బాధ నుంచి క్రమంగా కోలుకొని పెరిగిన బరువు తగ్గించుకుంది. అయితే ఈ క్రమంలో ఆమె శరీరంపై ఏర్పడిన స్ట్రెచ్‌మార్క్స్‌ని ప్రదర్శిస్తూ.. సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టింది త్రిషాలా. బాడీ పాజిటివిటీని చాటుతోన్న ఈ వైరల్ పోస్ట్ సారాంశమేంటో తెలుసుకుందాం రండి..
త్రిషాలా దత్.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మల ముద్దుల కూతురు. ఎనిమిదేళ్ల వయసులోనే బ్రెయిన్ ట్యూమర్‌తో తల్లిని పోగొట్టుకుంది త్రిషాలా. ఇక అప్పట్నుంచి యూఎస్‌లో తన అమ్మమ్మ-తాతయ్యల దగ్గరే పెరిగిందామె. వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్‌గా ఎదిగిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
కుంగుబాటుతో బరువు పెరిగింది!
మనసుకు నచ్చిన వాడు దూరమైతే ఆ బాధ మనల్ని కుంగదీస్తుంది. త్రిషాలా విషయంలోనూ అదే జరిగింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తన బాయ్‌ఫ్రెండ్ 2019లో మరణించడంతో కుంగుబాటుకు గురైందామె. ఈ మానసిక సమస్యతోనే ఈటింగ్ డిజార్డర్ చుట్టుముట్టి.. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లకు బానిసైంది. మరోవైపు ఉద్యోగం మానేసింది. భరించరాని బాధతో ఒక్కోసారి పబ్లిక్ ప్రదేశాల్లోనే కుప్పకూలిపోయేది. ఇలా ఆమె జీవనశైలిలో చోటుచేసుకున్న ఈ మార్పులు ఆమె విపరీతంగా బరువు పెరిగేలా చేశాయి. అయితే ఆ తర్వాత థెరపీ సహాయంతో తన మానసిక సమస్యను దూరం చేసుకున్న త్రిషాలా.. క్రమంగా తన బరువును అదుపులోకి తెచ్చుకుంది.
అందుకు సంకేతాలివి!
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. తన జీవితంలో జరిగే సంఘటనల్ని, వ్యక్తిగత విశేషాల్ని ఎప్పటికప్పుడు పంచుకోవడం ఈ బ్యూటీకి అలవాటు. ఈ క్రమంలోనే తన శరీర బరువు హెచ్చుతగ్గుల వల్ల తన శరీరంపై ఏర్పడిన స్ట్రెచ్‌మార్క్స్ ఫొటోని తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంటూ.. తన మనసులోని మాటల్ని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది త్రిషాలా.
‘ఒకానొక సమయంలో నా శరీర బరువు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ పోయింది. ఆపై అధిక బరువును తగ్గించుకున్నాక.. నా చర్మంపై ఇదిగో ఇలా శాశ్వతమైన స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడ్డాయి. ఇవి నా శరీరం మరింత దృఢమైనది అని చెప్పడానికి సంకేతాలు. ఇవి నేను కావాలని కోరి తెచ్చుకున్నవి కాదు.. నా జీవితంలోని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే క్రమంలో.. నేను పాటించిన జీవనశైలి మార్పుల కారణంగా ఇవి ఏర్పడ్డాయి. ఏదేమైనా ఇవి నాకు మాత్రమే సొంతం.. మానసిక ఒత్తిళ్లతో నేను చేసిన పోరాటానికి ఫలితమివి! ఇవి ఎప్పటికీ మాసిపోవు.. చెరిగిపోవు.. అయినా ఇవంటే నాకిష్టం. వీటిని ప్రదర్శించడానికి నేను వెనకాడను..’ అంటూ తనలోని బాడీ పాజిటివిటీని చాటుకుందీ స్టార్ కిడ్. ప్రస్తుతం త్రిషాలా పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె సవతి తల్లి మాన్యతా దత్‌తో సహా చాలామంది ఆమెను సపోర్ట్ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు.
అందుకే సినిమాల్లోకి రాలేదు!
* క్రిమినల్ లాలో డిగ్రీ పూర్తి చేసిన త్రిషాలా.. సైకాలజీలో మాస్టర్స్ చేసింది. ప్రస్తుతం యూఎస్‌లోనే సైకియాట్రిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
* సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ వారసులను కూడా చిత్ర పరిశ్రమలోకే తీసుకురావాలనుకుంటారు. కానీ త్రిషాలా విషయంలో తాను అలా అనుకోలేదంటాడు సంజయ్. ‘త్రిషాలాకు సినిమా రంగమంటే ఇష్టం. అయితే నేను మాత్రం తనని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలనుకోవట్లేదు..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడీ సీనియర్ హీరో.
* వృత్తి రీత్యా సైకియాట్రిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న త్రిషాలాకు వ్యాపారమన్నా మక్కువే. ఈ క్రమంలోనే ‘డ్రీమ్ ట్రెస్సెస్’ పేరుతో ఓ కంపెనీని స్థాపించి.. ఈ వేదికగా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ని విక్రయిస్తోందామె. ‘మహిళలు తమ భాగస్వామిపై ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్రం సాధించినప్పుడే ఎదగగలరు.. తమ పిల్లల్నీ అన్ని విషయాల్లో ప్రోత్సహించగలరు..’ అంటూ ఓ సందర్భంలో పంచుకుందామె.
* కుంగుబాటుతో విపరీతంగా బరువు పెరిగిపోయిన త్రిషాలా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, వారానికి ఐదు రోజులు సైక్లింగ్, ఈత.. వంటి వ్యాయామాలు సాధన చేస్తూ బరువు తగ్గానంటోంది. ఇక తన తల్లి పోయాక తన ఆంటీ ఎన్నానే తనకు అన్నింటా అండగా నిలిచిందని చెబుతోంది.
* ఓ సెలబ్రిటీ కిడ్‌గా సినిమాలంటే ఇష్టపడే త్రిషాలాకు.. సోనాక్షీ సిన్హా అంటే చాలా అభిమానమట! ఇక నచ్చిన సినిమా ఏంటని అడిగితే.. ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ అని చెబుతోంది.
* యూఎస్‌లోనే ఉన్నా.. తన తండ్రి సంజయ్, సవతి తల్లి మాన్యతా, ఆమె పిల్లలు షాహ్రాన్, ఇక్రాలతో టచ్‌లోనే ఉంటుంది త్రిషాలా. ఈ క్రమంలో వాళ్లతో కలిసి దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకుంటుంది.
* బరువు తగ్గాక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో తాను పాటించే ఆరోగ్యకరమైన అలవాట్లను, చేసే వ్యాయామాలను పోస్టుల రూపంలో పంచుకుంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటుంది.
* త్రిషాలా ఫ్యాషన్ ప్రియురాలు కూడా! ఆమె ఇన్‌స్టా ఫొటోల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.