Published : 18/06/2022 12:50 IST

Shivani Rajasekhar: అది నా చిన్నప్పటి కల.. ఇప్పుడు నిజం కాబోతోంది!

(Photos: Instagram)

‘సినిమా అంటేనే ట్యాలెంట్‌.. ఇక్కడ మనల్ని మనం నిరూపించుకోవడం తప్ప.. సినీ నేపథ్యాలు, స్టార్‌ కిడ్‌ హోదాలు కుదరవం’టోంది నటీనటులు రాజశేఖర్‌-జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌. చిన్నతనం నుంచీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కన్న ఈ చక్కనమ్మకు మరో కల కూడా ఉండేదట! అదే.. అందాల పోటీల్లో పాల్గొనాలని! అది ఇప్పుడు సాకారమవుతోందంటూ సంబరపడిపోతోందీ స్టార్‌ డాటర్‌. మనదేశంలో ఏటా జరిగే ప్రముఖ సౌందర్య పోటీల్లో పాల్గొనడానికి ఇటీవలే ఎంపికైన శివానీ.. ఈ రేసులో పాల్గొనేందుకు పూర్తిగా సన్నద్ధమయ్యానని.. ‘ప్రతిభను నిరూపించుకొని అందాల కిరీటం అందుకోవడమే తరువాయి!’ అని చెబుతోంది. ఈ నేపథ్యంలో తన గురించి వివిధ సందర్భాల్లో ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీ కోసం..!

అమ్మానాన్నలే మా పిల్లర్లు!

నా చిన్ననాటి జ్ఞాపకాల్లో నాకు కొన్ని ఇప్పటికీ గుర్తే. పాటలు పాడడం, డ్యాన్స్‌ చేయడం, చక్కగా డ్రస్‌ చేసుకోవడం.. వంటివి ఎక్కువగా చేసేదాన్ని. అమ్మానాన్నలిద్దరూ సినీ రంగంలోనే ఉండడంతో షూటింగ్స్‌, సెట్స్‌లోనే ఎక్కువగా గడిపేదాన్ని. మరోవైపు వాళ్లు తమ పనిని ఆస్వాదించడంతో నాకూ ఈ రంగంలోకి రావాలని ఆసక్తి కలిగింది. అయితే మా అభిరుచుల్ని వారు ఏనాడూ కాదనలేదు. నేను, చెల్లి సినిమాల్లోకి వస్తామని చెప్పినప్పుడు ఆశ్చర్యపోలేదు.. అడ్డు చెప్పలేదు. మీకు ఏది ఇష్టమో అదే చేయమని ప్రోత్సహించారు. అందుకే వాళ్లు మా జీవితాలకు మూల స్తంభాలు!

‘ఐరన్‌ లెగ్‌’ అంటారేమోనని భయపడ్డా!

సినిమా పరిశ్రమంలో ఐరన్‌ లెగ్‌, బ్యాడ్‌ లక్‌ అనే పదాలు తరచుగా వినిపిస్తుంటాయి. కెరీర్‌ ప్రారంభంలో నాపైనా ఇలాంటి ముద్ర వేస్తారేమోనని చాలా భయపడ్డా. ఎందుకంటే నేను తెలుగులో సంతకం చేసిన తొలి సినిమా ‘టూ స్టేట్స్‌’ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత విష్ణు విశాల్‌తో నేను తమిళంలో నటించిన తొలి సినిమా చిత్రీకరణకు కూడా బ్రేక్‌ పడింది. దీంతో అందరూ నా గురించి బ్యాడ్‌లక్‌, ఐరన్‌ లెగ్‌ అని రాస్తారేమోనని భయపడ్డా. ఈ ఒత్తిడితోనే కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. దీన్నుంచి బయటపడడం అంత సులభం కాలేదు. అప్పుడు నాన్న మాటలే నాకు ఔషధంలా పనిచేశాయి. కెరీర్‌కి ప్రత్యామ్నాయం ఉండాలని, మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదని నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. అవే నన్ను డిప్రెషన్‌ నుంచి బయటపడేశాయి. ఇప్పుడు నేను నా రెండో కెరీర్‌గా వైద్య విద్యను ఎంచుకున్నా. ప్రస్తుతం మెడిసిన్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింతా లేదు.. అలాగని సినిమా కెరీర్‌ని వదిలిపెడతానని నేను చెప్పట్లేదు. సినిమాలు, మెడిసిన్‌.. ఈ రెండూ నాకు రెండు కళ్లు.

స్టార్‌ హోదా కాదు.. ట్యాలెంట్‌ ముఖ్యం!

స్టార్‌ కిడ్స్‌కి ఎలాంటి కష్టాలూ ఉండవని, అవకాశాలు వాటంతటవే వస్తాయని చాలామంది అనుకుంటారు. ఇతరుల సంగతేమో గానీ.. నా విషయంలో, నా చెల్లి శివాత్మిక విషయంలో మాత్రం ఇలా జరగలేదు. ఎన్నో సవాళ్లు దాటుకొనే తెర పైకి వచ్చాం. చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలతో సెట్స్‌కి, షూటింగ్స్‌కి వెళ్లడం వల్ల దర్శకనిర్మాతలతో పరిచయాలు పెరిగాయి. ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలుగుతాం. అదొక్కటే మాకుండే సానుకూలాంశం. అంతేకానీ.. అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో మా ప్రతిభను నిరూపించుకోవాల్సిందే! నేను, శివాత్మిక చాలా సినిమాలకు ఆడిషన్లు ఇచ్చాం. ఎన్నోసార్లు తిరస్కరణలు సైతం ఎదుర్కొన్నాం. అమ్మానాన్నల ప్రోత్సాహం, మా ధైర్యంతోనే ఇలాంటి ప్రతికూలతల నుంచి సులభంగా బయటపడగలిగాం.

అమ్మ.. హోమ్‌ మినిస్టర్‌!

నేను, చెల్లి.. డాడీస్‌ గర్ల్స్‌. ముగ్గురం కలిసి అప్పుడప్పుడూ అమ్మను టీజ్‌ చేస్తుంటాం. ఇంత పెద్దవాళ్లమైనా.. ఎంత అల్లరి చేసినా అమ్మ ముద్దు చేస్తుంటుంది. తనకు ఓపిక ఎక్కువ. నేనూ తనలా ఓపిగ్గా ఉండడానికి ప్రయత్నిస్తుంటా.

తను లేకుండా నేను లేను!

నేను, శివాత్మిక.. ఇద్దరం మంచి స్నేహితులం. ఒకరం లేకుండా ఇంకొకరం అసంపూర్ణమని చెప్పాలి. అంతెందుకు.. ఇప్పటికీ ఒకే గదిని పంచుకుంటాం. పనుల్లో సహాయం చేసుకుంటాం. నిజంగా మేమిద్దరం అక్కచెల్లెళ్లమవడం మా అదృష్టమని చెప్పాలి. నటన విషయంలో మేమిద్దరం ఒకరితో ఒకరం పోటీ పడం. ఎందుకంటే ఎవరి ట్యాలెంట్‌, శ్రమ వారిది. అంతిమంగా ప్రేక్షకులతో ‘ది బెస్ట్‌’ అనిపించుకుంటే చాలు.

అందుకే అక్కడి నుంచి..!

చిన్నతనం నుంచీ నటనతో సమానంగా అందాల కిరీటాన్నీ ప్రేమించా. ఎప్పటికైనా అందాల పోటీల్లో దేశం తరఫున పాల్గొనాలని కలలు కన్నా. ఆ కల తీరే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ‘మిస్‌ ఇండియా’ పోటీలకు ఎంపికైన ఎనిమిది మందిలో నేనూ ఉన్నా. ఈ పోటీల్లో తెలంగాణ, తమిళనాడు.. రెండు రాష్ట్రాల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నా. తమిళనాడుతో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే!

గతేడాది ‘అద్భుతం’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన శివానీ.. ఇటీవలే ‘శేఖర్‌’తో మరోసారి మన ముందుకొచ్చింది. ప్రస్తుతం ‘ఆర్టికల్‌-15’ అనే తమిళ రీమేక్‌లో నటిస్తోంది. మరోవైపు ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌సిరీస్‌లోనూ భాగమైంది.

మరి, తన చిన్ననాటి కలను నిజం చేసుకునే క్రమంలో ‘మిస్‌ ఇండియా’ తుది దశ పోటీలకు ఎంపికైన శివానీ టైటిల్‌ గెలిస్తే.. దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఆమెకు అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు సినీ విశ్లేషకులు. ఏదేమైనా అందాల కిరీటం గెలవడమే లక్ష్యంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోన్న ఈ స్టార్‌ డాటర్‌కు మనమూ బెస్ట్‌ విషెస్‌ చెబుదాం..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి