Bansuri Swaraj: తల్లికి తగ్గ తనయ!

‘పూర్వజన్మ సుకృతం’ అంటుంటారు. ‘నేను గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాను కాబట్టే అంత గొప్ప తల్లికి కూతురిగా పుట్టే అదృష్టం నాకు దక్కింది..’ అంటున్నారు దివంగత నేత, జన హృదయ విజేత సుష్మా స్వరాజ్‌ కూతురు బన్సూరీ స్వరాజ్‌. తన కట్టూ, బొట్టూ, రాజకీయ చతురతతో....

Published : 29 Mar 2023 13:16 IST

(Photos: Twitter)

‘పూర్వజన్మ సుకృతం’ అంటుంటారు. ‘నేను గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాను కాబట్టే అంత గొప్ప తల్లికి కూతురిగా పుట్టే అదృష్టం నాకు దక్కింది..’ అంటున్నారు దివంగత నేత, జన హృదయ విజేత సుష్మా స్వరాజ్‌ కూతురు బన్సూరీ స్వరాజ్‌. తన కట్టూ, బొట్టూ, రాజకీయ చతురతతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపిన తన తల్లి.. తనకూ ప్రేరణగా నిలిచారని చెబుతున్నారు. తాజాగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బన్సూరీ. న్యాయవాద వృత్తిలో 16 ఏళ్ల అనుభవం గడించిన భారతీయ జనతా పార్టీ (దిల్లీ శాఖ) లీగల్ సెల్ కో-కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ బాధ్యతలో భాగంగా పార్టీ న్యాయ వ్యవహారాల్లో సలహాలివ్వనున్నారామె. ‘తాను వేసే ప్రతి అడుగులోనూ అమ్మ ప్రేరణ దాగుందంటో’న్న బన్సూరీ.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతల్నీ సమర్థంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్‌ లాయర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు...

(Photo: Twitter)

క్రిమినల్‌ లాయర్‌గా..!

బన్సూరీ 1984లో జన్మించారు. వార్‌విక్‌ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో బీఏ (ఆనర్స్‌) పూర్తిచేసిన ఆమె.. న్యాయవిద్యనభ్యసించడానికి లండన్‌ వెళ్లారు. అక్కడి ‘బీపీపీ లా స్కూల్‌’లో న్యాయవిద్య పూర్తిచేసిన బన్సూరీ.. ‘ఇన్నర్‌ టెంపుల్‌’ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి బారిస్టర్‌గా అర్హత సాధించారు. ఆపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సెయింట్‌ క్యాథరిన్‌ కాలేజీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు.

2007లో దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకున్న ఆమె.. న్యాయవాద వృత్తిలో 16 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గడించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతోన్న బన్సూరీ.. క్రిమినల్‌ లాయర్‌గా రియల్‌ ఎస్టేట్‌, కాంట్రాక్ట్‌, పన్నులు.. సంబంధిత కీలక కేసుల్నీ వాదించారు.

ఇలా న్యాయవాద వృత్తిలో అపార అనుభవం గడించిన బన్సూరీ.. తాజాగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే దిల్లీ భారతీయ జనతా పార్టీ లీగల్‌ సెల్‌ కో-కన్వీనర్‌గా పార్టీ ఆమెను నియమించింది. ఇందులో భాగంగా పార్టీ న్యాయ వ్యవహారాల్లో సలహాలివ్వనున్నారీ క్రిమినల్‌ లాయర్.

అయితే ఇప్పుడే కాదు.. గతంలో అనధికారికంగానూ పార్టీకి న్యాయ వ్యవహారాల్లో సలహాలిచ్చేవారు బన్సూరీ. ‘న్యాయ విషయాల్లో పార్టీకి నా సేవలు ఎప్పుడూ ఉంటాయి. అయితే ఈ తాజా బాధ్యతతో అధికారికంగా పార్టీకి సేవ చేసే అవకాశం దొరికింది. ఈ క్రమంలో నాకు అప్పగించిన బాధ్యతలు మరింత సమర్థంగా నిర్వర్తిస్తా..’ అని చెప్పుకొచ్చారు బన్సూరీ.


అది నా పూర్వజన్మ సుకృతం!

(Photo: Twitter)

దివంగత మంత్రి సుష్మా స్వరాజ్‌ కూతురైన బన్సూరీకి తన తల్లితో అనిర్వచనీయమైన ప్రేమానుబంధం ఉంది. అందుకే ఆ ప్రేమను తామిద్దరూ కలిసి దిగిన ఫొటోల రూపంలో తరచూ తెలియజేస్తుంటారు బన్సూరీ. తల్లిలాగే సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ లేడీ లాయర్‌.. అడుగడుగునా తనకు తన తల్లే ఆదర్శమని చెబుతున్నారు. ‘బహుశా.. గత జన్మలో నేను ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే అంత గొప్ప వ్యక్తికి కూతురిగా పుట్టే అదృష్టం నాకు దక్కింది. మా అమ్మే నాకు ఆదర్శం.. ప్రతి అడుగులోనూ మార్గనిర్దేశనం చేసింది. మహిళలు ఎలాంటి విషయాల్లో దృఢంగా మారాలో తరచూ చెబుతుండేది. నేటి మహిళలు ఆర్థికంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతూనే నైపుణ్యాలనూ పెంచుకోవడం ముఖ్యం. రాజకీయాల్లోనూ మహిళల పాత్ర, ప్రాధాన్యం పెరగాలి..’ అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు బన్సూరీ.


ఈ అవార్డు అమ్మకే అంకితం!

న్యాయవాదిగా పలు క్రిమినల్‌ కేసుల్లో కీలక పాత్ర పోషించిన బన్సూరీ.. మహిళల్ని చైతన్యవంతుల్ని చేసే దిశగా ఆయా వేదికలపై ప్రసంగాలు కూడా చేస్తుంటారు. ఇలా తన ప్రతిభ, పనితీరుతో పలు అవార్డులూ అందుకున్నారామె. అందులో ‘తేజస్విని అవార్డు’ ఒకటి. తన తల్లి మరణానంతరం 2021లో ఈ పురస్కారం అందుకున్న ఆమె.. దీన్ని తన తల్లికే అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

‘జీజాబాయి శివాజీకి విలువలు నేర్పినట్లుగానే, యశోద కృష్ణుడిని క్రమశిక్షణతో పెంచినట్లుగానే.. నా తల్లీ నాకు ప్రతి విషయంలో గురువుగా మారింది. ప్రస్తుతం నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం! అందుకే ఈ అవార్డును అమ్మకే అంకితం చేస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చారీ సీనియర్‌ లాయర్‌. ఇక 2019లో కన్నుమూసిన తన తల్లి సుష్మకు తానే అంతిమ సంస్కారాలు నిర్వహించి అప్పుడు వార్తల్లో నిలిచారు బన్సూరీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్