అక్కడి మహిళలు ఆ ఒక్క రోజే స్నానం చేస్తారట!

రోజుకు రెండుసార్లు స్నానం చేసినా ఒక్కోసారి చిరాకనిపిస్తుంటుంది. అలాంటిది జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం చేస్తే ఎలా ఉంటుంది? మనకు వినడానికి ఇది ఎనిమిదో వింతలా అనిపించినా.. నమీబియాలో నివసించే హింబా తెగలో మాత్రం ఇది.....

Published : 26 Jun 2022 10:34 IST

రోజుకు రెండుసార్లు స్నానం చేసినా ఒక్కోసారి చిరాకనిపిస్తుంటుంది. అలాంటిది జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం చేస్తే ఎలా ఉంటుంది? మనకు వినడానికి ఇది ఎనిమిదో వింతలా అనిపించినా.. నమీబియాలో నివసించే హింబా తెగలో మాత్రం ఇది సర్వసాధారణం. అక్కడి మహిళలు దీన్ని తరతరాల నుంచీ సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఇక మట్టితో జడలేసుకోవడం, ప్రత్యేక సందర్భాల్లో మినహా మాంసం ముట్టకపోవడం, పుట్టుక దగ్గర్నుంచి చితికి చేరే దాకా తమకంటూ ప్రత్యేకమైన పాట అల్లుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తెగ మహిళల జీవనవిధానంలో వింతలు, విశేషాలు ఎన్నో! అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

పుట్టకముందే..!

సాధారణంగా ఒక వ్యక్తి వయసును వారు పుట్టిన రోజు నుంచి లెక్కిస్తుంటారు. కానీ నమీబియాకు చెందిన హింబా తెగలో మాత్రం ఒక వ్యక్తి వయసును ఎప్పట్నుంచి లెక్కిస్తారో తెలుసా? బిడ్డను కనాలన్న ఆలోచన తల్లికి వచ్చినప్పటి నుంచే..! అంతేకాదు.. ఇక్కడ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పాట ఒకటి ఉంటుంది. దాంతోనే జీవితం మొదలవుతుంది. అందుకే బిడ్డను కనాలనే ఆలోచన రాగానే ఆ మహిళ ఒంటరిగా వెళ్లి చెట్టు కింద కూర్చొంటుంది.. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డకు సంబంధించిన పాట అల్లుకున్నాకే.. అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటుంది. ఆపై ఆ పాటను తన భర్తకు నేర్పుతుంది. ఆ తర్వాతే పిల్లల కోసం ఆ జంట ప్రయత్నిస్తారు. గర్భంతో ఉన్నన్నాళ్లూ తల్లి ఆ పాట పాడుతూనే బిడ్డతో మాట్లాడుతుంది. అంతేకాదు.. కాన్పు చేసే మంత్రసానికి, ఇతర మహిళలకు ఆ పాట నేర్పుతుంది. వారంతా ఆ పాట పాడుతూనే బిడ్డను ఈ లోకంలోకి తీసుకొస్తారు. ఆ తర్వాత బిడ్డను చూడడానికి వచ్చిన వారు కూడా అదే పాటతో ఆ బుజ్జాయిని పలకరిస్తారు.

రజస్వల సమయంలోనూ..!

ఈ పాట ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదు. జీవితంలోని సుఖదుఃఖాల్లోనూ ఆ పాటే ఆ బిడ్డకు తోడుగా ఉంటుందట! ఉదాహరణకు.. బిడ్డ ఆడుకుంటూ కింద పడిపోతే చుట్టూ ఉన్నవాళ్లంతా తనను ఓదారుస్తూ ఆ పాటే పాడతారట! ఒకవేళ ఆ బిడ్డ అమ్మాయైతే.. తను రజస్వల అయినప్పుడు కూడా తెగ వారందరూ ఒక్కచోట చేరి, ఆ పాటతోనే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. పెళ్లి సందర్భంలో, ఇతర వేడుకలప్పుడు కూడా అదే పాట పాడతారు. ఆఖరికి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కూడా అదే పాట పాడుతూ తనకు వీడ్కోలు పలుకుతారట! ఇలా పుట్టుక నుంచి చావు వరకూ ఆ వ్యక్తి జీవితంలో అమ్మ పాడిన ఆ పాట ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుందని చెబుతారు.

ఎరుపు రంగు మట్టితో..!

హింబా తెగకు చెందిన స్త్రీల ఆహార్యం, అలవాట్లు ఎంతో భిన్నంగా ఉంటాయి. స్త్రీలంతా స్థానికంగా లభించే హెమటైట్‌ అనే ఎరుపు రంగు రాళ్లను దంచి, వాటిని పొడి చేస్తారు. దీన్ని జంతువుల కొవ్వుతో కలిపి మంటపై కాలుస్తారు. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు శరీరానికి పూసుకుంటారు. అమ్మాయిలకు యుక్తవయసు వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని పూసుకోవడం ప్రారంభిస్తారు. దీనివల్ల ఎండ నుంచి, దోమల నుంచి రక్షణ లభిస్తుందని, చర్మం తేమగా ఉంటుందని వారు చెబుతారు.
ఇక వీరి కేశాలంకరణ మరింత వింతగా అనిపిస్తుంటుంది. వయసొచ్చిన అమ్మాయిలకు రెండు జడలు వేస్తారు. ఇక ఆ అమ్మాయి రజస్వల అయ్యాక మట్టితో అల్లుకునే జడలు వేసుకోవడం ప్రారంభిస్తుంది. ఎరుపు రంగు రాళ్లతో చేసిన మిశ్రమం, గొర్రె వెంట్రుకలతో ఈ జడలను అల్లుకుంటారు. దీనివల్ల తాము అందంగా కనిపిస్తామన్నది వారి భావన. పెళ్లై, పిల్లలున్న మహిళలు గొర్రె చర్మంతో చేసిన కిరీటాన్ని ధరిస్తారు. పెళ్లై, పిల్లలున్నారనడానికి ఈ కిరీటమే నిదర్శనమని వారు చెబుతారు.

కష్టమంతా మహిళలదే..!

హింబా తెగలో మగవారి కంటే మహిళలే ఎక్కువగా కష్టపడతారట! పశువుల్ని మేపడం, పాలు పితకడం, సుదూర ప్రాంతాల నుంచి నీరు మోసుకురావడం, ఇల్లు నిర్మించడం, పిల్లల్ని పెంచడం.. వంటివన్నీ మహిళలే చేస్తారట! మగవారు బయటకు వెళ్లి.. వ్యవసాయం, ఇతర పనులు చేస్తారట! వీరి వివాహాలు కూడా చిన్నతనంలోనే జరిగిపోతాయని చెబుతున్నారు. పిల్లలు పుట్టగానే వారిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో తండ్రి నిర్ణయిస్తాడట! రజస్వల కాగానే అమ్మాయికి పెళ్లి చేసేస్తారు.

అప్పుడు తప్ప మాంసం ముట్టరు!

హింబా ప్రజలు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు పాటిస్తారని వాళ్లు తినే పదార్థాల్ని బట్టి అర్థమవుతుంది. వీరు సాధారణంగా వేడినీటిలో జొన్న లేదా మొక్కజొన్న పిండిని ఉడికించి.. అందులో నూనె, ఉప్పు కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటారట! అక్కడ ఎక్కువగా పండించే పంటలు కావడంతో.. ఈ రెండు రకాల ధాన్యాలనే దంచి వాటి పిండిని ఉడికించుకొని తింటుంటారు. అప్పుడప్పుడూ పెళ్లిళ్ల సమయంలో, ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో మాంసం ముట్టరట!

స్నానం.. ఆ ఒక్క రోజే!

హింబా స్త్రీలు వారి జీవిత కాలంలో ఒకే ఒక్క రోజు స్నానం చేస్తారట. అది కూడా.. వాళ్ల పెళ్లి రోజు! అలా అయితే చెమట వాసన రాదూ.. అంటారా? అందుకూ వాళ్లు ఒక చిట్కా పాటిస్తామంటున్నారు. నిప్పుల మీద కొన్ని రకాల మొక్కల ఆకులు, వేర్లు, కాండాలను వేసి వాటి నుంచి పొగ వచ్చేలా చేస్తారు. ఆ పొగ శరీరమంతా విస్తరించేలా చూసుకుంటారు. లేదంటే ఆ మూలికల్ని కొన్ని నీటిలో వేసుకొని మరిగించుకుంటారు. ఇలా వచ్చిన ఆవిరిని శరీరానికి పట్టిస్తారు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరం నుంచి చెమట వచ్చి శరీరం శుభ్రపడుతుందనేది వారి నమ్మకం. ఇక తలను, వెంట్రుకలను శుభ్రం చేసుకోవడానికి వంట చేయగా వచ్చిన బూడిదను ఉపయోగిస్తారట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్