అప్పట్లో రికార్డు మెజార్టీ.. మోదీ కంటే ఎక్కువ ఓట్లు.. ఎవరీ ప్రీతమ్?

ఆమె తండ్రి కాకలు తీరిన రాజకీయ నాయకుడు.. విశేషంగా ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. తాతముత్తాతలూ రాజకీయాల్లో తలపండిన వారే! ఇలా రాజకీయాలే ఊపిరిగా భావించిన కుటుంబంలో పుట్టిన తానూ తన తండ్రి, తాతముత్తాతల అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. అయితే అకస్మాత్తుగా తన తండ్రి మరణించడంతో.. జరిగిన ఉప ఎన్నికలో అదే స్థానం నుంచి పోటీ చేసింది.

Updated : 05 Jun 2024 14:09 IST

(Photos: Instagram)

ఆమె తండ్రి కాకలు తీరిన రాజకీయ నాయకుడు.. విశేషంగా ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. తాతముత్తాతలూ రాజకీయాల్లో తలపండిన వారే! ఇలా రాజకీయాలే ఊపిరిగా భావించిన కుటుంబంలో పుట్టిన తానూ తన తండ్రి, తాతముత్తాతల అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. అయితే అకస్మాత్తుగా తన తండ్రి మరణించడంతో.. జరిగిన ఉప ఎన్నికలో అదే స్థానం నుంచి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపే కాదు.. సుమారు 6.9 లక్షల భారీ మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారామె. ఇప్పటివరకు భారత ఎన్నికల చరిత్రలోనే ఇదే భారీ మెజార్టీ కావడం విశేషం! అందులోనూ ప్రధాని మోదీ కంటే ఆమెకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కానీ తాజా ఎన్నికల ఫలితాల్లో ప్రీతమ్‌ రికార్డు బద్దలుకొట్టారు భాజపా నేత శంకర్‌ లల్వానీ. మధ్యప్రదేశ్‌ ఇందౌర్‌ నుంచి పోటీ చేసిన ఆయన 11 లక్షల భారీ మెజార్టీ సాధించారు. అయితే పదేళ్లు గడిచినా.. ఇప్పటిదాకా ప్రీతమ్‌ పేరిట ఉన్న ఈ రికార్డు, అప్పటి ఎన్నికల్లో ఆమె గెలుపు భారతీయుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఆమె ఎవరు? ఆమె రాజకీయ ప్రస్థానమేంటో తెలుసుకుందాం రండి..

దేశంలో ఎక్కడ, ఏ ఎన్నికలు జరిగినా.. 2014లో మహారాష్ట్ర బీద్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక తప్పక జ్ఞప్తికి వస్తుంది. ఎందుకంటే ఆ ఏడాది ఆ స్థానం నుంచి పోటీ చేసిన డాక్టర్‌ ప్రీతమ్‌ గోపీనాథ్‌ ముండే భారత దేశ ఎన్నికల చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌రావ్‌ శంకర్‌రావ్‌ పాటిల్‌పై 6,96,321 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు మన దేశ ఎన్నికల చరిత్రలోనే ఇదే అత్యధిక మెజార్టీగా నిలిచింది.

రికార్డు మెజార్టీతో.. చరిత్ర!

2014, మే 26న కేంద్రంలో మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర బీద్‌ లోక్‌సభ స్థానానికి భాజపా నాయకుడు గోపీనాథ్‌ ముండే ఎంపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే ఆయన తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అక్కడి ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. అయితే ఈ పదవి స్వీకరించిన తర్వాత సరిగ్గా తొమ్మిదో రోజు దిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్‌ మరణించారు. దాంతో బీద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటిదాకా రాజకీయాల్నే ఊపిరిగా భావించిన తన తండ్రి స్థానంలో తాను పోటీ చేయాలనుకున్నారు ప్రీతమ్‌. ప్రజా సేవలో ఆయన కన్న కలల్ని తాను నెరవేర్చాలనుకున్నారు. ఈ ఆలోచనతోనే బరిలోకి దిగిన ఆమె.. కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌రావ్‌ శంకర్‌రావ్‌ పాటిల్‌పై 6,96,321 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది.. సరికొత్త చరిత్ర లిఖించారు. ఈ ఎన్నికల్లో ప్రీతమ్‌కు 9,22,416 ఓట్లు రాగా, పాటిల్‌కు 2,26,095 ఓట్లు లభించాయి. ఇక అదే ఏడాది గుజరాత్‌ వదోదర నుంచి పోటీ చేసిన మోదీకి 5.70 లక్షల ఓట్లు పోలయ్యాయి. అంటే.. ప్రీతమ్‌ తనకొచ్చిన వ్యక్తిగత ఓట్ల పరంగానే కాకుండా.. మెజార్టీ విషయంలోనూ మోదీజీని అధిగమించారని చెప్పచ్చు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే నియోజక వర్గం నుంచి పోటీ పడిన ఆమె.. తన సమీప ప్రత్యర్థిపై 1,68,368 ఓట్ల మెజార్టీ సాధించి.. మరోసారి ఎంపీగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు భాజపా అభ్యర్థులు 6 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందినా.. 2014లో ప్రీతమ్‌ సాధించిన రికార్డును అందుకోలేకపోవడం గమనార్హం. అయితే తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రీతమ్‌ రికార్డును భాజపా నేత శంకర్‌ లల్వానీ బద్దలు కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడిన ఆయన.. ఏకంగా 11,75,092 ఓట్ల అఖండ మెజార్టీ సాధించారు. తద్వారా దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ నమోదు చేసి రికార్డు సృష్టించారు.


డాక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి..!

మహారాష్ట్ర బీద్‌లో 1984లో గోపీనాథ్‌ ముండే-ప్రద్న్యా ముండే దంపతులకు జన్మించారు ప్రీతమ్‌. ఆమెకు ఒక అక్క, ఒక చెల్లెలు ఉన్నారు. అక్క పంకజా ముండే కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది బీద్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రమోద్‌ మహాజన్‌కు ప్రీతమ్‌ స్వయానా మేనకోడలు.. కాగా, భాజపా నాయకురాలు పూనమ్‌ మహాజన్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ధనంజయ్‌ ముండేల కజిన్‌. రాజకీయ నేపథ్యంతో పాటు విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ప్రీతమ్‌.. వైద్య విద్య చదవాలని నిర్ణయించుకున్నారు. తన కోరిక మేరకే నవీ ముంబయిలోని ‘డాక్టర్‌ డీవై పాటిల్‌ మెడికల్‌ కాలేజీ’లో ‘Dermatology, Venereology & Leprosy’ విభాగాల్లో మెడిసిన్‌ పూర్తిచేశారు. ఆపై చర్మ వ్యాధి నిపుణురాలిగా కెరీర్‌ ప్రారంభించారు. అయితే తన కెరీర్‌ను బ్యాలన్స్‌ చేస్తూనే ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలని, తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని కాంక్షించిన ప్రీతమ్‌.. తన తండ్రి మరణానంతరం అనుకోకుండా 2014 లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ పడ్డారు. రికార్డు విజయంతో రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదనిపించారు. ఇక గతేడాది ‘భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)’ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ దేశ అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకూ ప్రీతమ్‌ తన మద్దతు తెలిపారు. ఈ నిరసనకు మద్దతిచ్చిన తొలి భాజపా నేతగా ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు.


5 కోట్లు.. 60 ఫుడ్‌ స్టాల్స్!

ఐటీ ఇంజినీర్‌ అయిన గౌరవ్ని 2009లో వివాహమాడారు ప్రీతమ్‌. ఈ జంటకు అగస్త్య అనే కొడుకున్నాడు. అయితే వీళ్ల పెళ్లి అప్పట్లో ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్’గా నిలిచింది. మరాఠా రాజు శివాజీ పాలనా కాలం నాటి సెట్టింగ్‌ థీమ్‌తో వీళ్ల పెళ్లి వేదికను ఏర్పాటుచేశారు. మోదీతో పాటు ప్రముఖ భాజపా నాయకులు, ఇతర పార్టీల నేతలు, సెలబ్రిటీలు.. ఇలా అతిరథ మహారథులతో పాటు సామాన్యులు కూడా కలిపి మొత్తంగా సుమారు 40 వేల మందికి పైగా వీళ్ల పెళ్లికి హాజరైనట్లు ఓ అంచనా! ఇక పెళ్లి వేదికలో దాదాపు 60కి పైగా ఫుడ్‌ స్టాల్స్‌నీ ఏర్పాటుచేశారట!

సహజంగానే సిగ్గరి అయిన ప్రీతమ్‌ను.. ఆమె తండ్రి గోపీనాథ్‌ 2012లో సోలాపూర్‌లోని ఓ మెడికల్‌ కాలేజీ డైరెక్టర్‌గా నియమించారు. అప్పట్నుంచే తరచూ కెమెరా ముందుకు రావడం ప్రారంభించిన ఆమె.. తన తండ్రి మరణానంతరం దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్