Published : 16/12/2022 21:05 IST

చలికాలంలో వెచ్చదనాన్ని పంచేలా..

సీజన్‌ను బట్టి ఇంటి అలంకరణలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం సర్వసాధారణం. ఇది చలికాలానికీ వర్తిస్తుంది. ఈ కాలంలో చల్లదనాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇంట్లో వెచ్చదనాన్నిచ్చేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలో చలికాలంలో వెచ్చగా ఉండేలా ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం..

ఫ్యాబ్రిక్ విషయంలోనూ..

చలికాలంలో ఇంట్లో తలుపులు, కిటికీలు మూసేసి ఉన్నా సరే.. చల్లగా ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో ఏ వస్తువు ముట్టుకున్నా చల్లగానే తగులుతుంది. ఆఖరికి కూర్చునే సోఫా, పడుకునే మంచం కూడా! మరి అవి చల్లగా ఉన్నాయని.. కూర్చోకుండా, పడుకోకుండా ఉండలేం కదా.. అందుకే అవి వెచ్చదనం పంచేలా తగిన ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం సోఫా కవర్లు, పిల్లో కవర్లు, బెడ్‌షీట్లు.. వంటివన్నీ మందంగా, ఉన్నితో తయారుచేసినవి ఉపయోగించాలి. అలాగే కప్పుకోవడానికి రగ్గులైతే బెటర్. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల అటు కూర్చున్నా.. ఇటు పడుకున్నా వెచ్చగా ఉంటుంది. ఫర్నిచర్ కూడా ఆకర్షణీయంగా, వెరైటీగా కనిపిస్తుంది.

వెచ్చదనం ఇలా!

ఇంట్లో వెచ్చగా ఉండాలంటే కాసేపు లైట్లు వేసి ఉంచడం, క్యాండిల్స్ వెలిగించడం.. వంటివి కూడా చేయచ్చు. అలాగే ఉదయం పూట ఇంట్లోకి ఎండ పడే అవకాశం ఉన్నట్లయితే తలుపులు, కిటికీలు కాసేపు తెరిచి ఉంచాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లో వేడిని పుట్టించవచ్చు.

సువాసనభరితంగా..

పర్యావరణహితమైన క్యాండిల్స్, అగరుబత్తీ.. వంటివి వెలిగించడం వల్ల ఇంట్లోకి రాగానే చక్కటి సువాసనలు వెదజల్లడంతో పాటు, కొంచెం వెచ్చగా కూడా అనిపిస్తుంది.

మందపాటి కర్టెన్లు..

చలికాలంలో ఇంట్లో వెచ్చగా ఉండాలంటే మనం ఉపయోగించే కర్టెన్ల పాత్ర కూడా కీలకమే. కాబట్టి శీతాకాలంలో తలుపులు, కిటికీలకు ఉపయోగించే కర్టెన్లు మందంగా ఉన్నవి ఎంచుకోవాలి. అలాగే తలుపులు, కిటికీలు మాటిమాటికీ తెరవకుండా మూసి ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల బయటి చల్లదనం లోపలికి ప్రవేశించకుండా ఇల్లంతా వెచ్చగా ఉంటుంది. అలాగే హాల్, బెడ్‌రూమ్, ఇతర గదుల్లో నేలపై పరిచే కార్పెట్లు కూడా మందంగా ఉండేలా చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని