‘మలేరియా అమ్మ’కి... అంతర్జాతీయ గుర్తింపు!

ప్రభుత్వ ఉద్యోగం వస్తే... కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చు అన్నది ఆమె కల. అలాగని కొలువు వచ్చింది చాల్లే అని ఆగిపోలేదు. వృత్తికి వందశాతం అంకితం అయ్యారు. కాబట్టే గిరిజనులకు ‘మలేరియా అమ్మ’ కాగలిగారు.

Updated : 18 Jun 2024 07:24 IST

ప్రభుత్వ ఉద్యోగం వస్తే... కుటుంబాన్ని చక్కగా పోషించుకోవచ్చు అన్నది ఆమె కల. అలాగని కొలువు వచ్చింది చాల్లే అని ఆగిపోలేదు. వృత్తికి వందశాతం అంకితం అయ్యారు. కాబట్టే గిరిజనులకు ‘మలేరియా అమ్మ’ కాగలిగారు. తాజాగా అదే కృషితో దక్షిణ భారతదేశం నుంచి డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు పొందిన ఏకైక మైక్రోస్కోపిస్ట్‌గా నిలిచారు... ఎం.వి. లక్ష్మీసుభద్ర. ఆవిడెవరో... ఆ స్థాయి వరకూ ఎలా చేరుకున్నారో ‘వసుంధర’తో పంచుకున్నారిలా...

మా స్వస్థలం శ్రీకాకుళం. నాన్న మంగు వెంకట రంగనాథం ఉద్యోగి, అమ్మ వెంకట ఝాన్సీ. పదోతరగతి పూర్తయ్యిందో లేదో పెళ్లైంది. కానీ మావారు జనార్దనరావు ప్రోత్సాహంతో తిరిగి చదువుకున్నా. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌సీ (మైక్రోబయాలజీ) పూర్తిచేశా. ఆపై ఓ ప్రైవేటు స్కూల్లో వైస్‌ప్రిన్సిపల్‌గా చేస్తూ ల్యాబ్‌నీ నిర్వహించేదాన్ని. అవి చేస్తూనే ప్రభుత్వ కొలువుకి ప్రయత్నించి, సాధించా. పాడేరులో పోస్టింగ్‌. అక్కడంతా గిరిజనులే. కొవిడ్‌కి ముందు అక్కడ ప్రధాన సమస్య మలేరియానే. జ్వరం తగ్గట్లేదు అనిపించగానే నా వద్దకు వచ్చేవారు. రాత్రుళ్లూ ఇంటి తలుపు కొట్టేవారు. వాళ్లకోసం ప్రత్యేకంగా ర్యాపిడ్‌ కిట్లతోపాటు కొన్ని అత్యవసర మందులూ ఇంట్లో ఉంచేదాన్ని. పరిస్థితి విషమించి ఎవరైనా కోమాలోకి వెళితే డాక్టర్లే కబురు పంపేవారు. అర్ధరాత్రి, జోరు వర్షంలో టార్చ్‌లైట్‌ వెలుగులో వెళ్లి పరీక్షలు చేసిన రోజులున్నాయి. అందుకే అక్కడివారంతా నన్ను ‘మలేరియా అమ్మ’ అని పిలిచేవారు. అలా ఎనిమిదేళ్లు పనిచేశా. ఐటీడీఏ ఉత్తమ ఉద్యోగిగా అవార్డునీ అందుకున్నా. తరవాత వైజాగ్‌ డీఎంఓ ఆఫీసుకి బదిలీ అయ్యా. అక్కడ జిల్లాస్థాయిలో కొత్తవారికి శిక్షణ, అనుభవం ఉన్నవారికి రీఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించేదాన్ని. అక్కడా మెరిట్‌ అవార్డులొచ్చాయి. ఈ సేవలకు గుర్తుగా సెంట్రల్‌ మలేరియా ల్యాబొరేటరీలో రాష్ట్రస్థాయి శిక్షకురాలిగా, క్రాస్‌చెకర్‌గా డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. మొత్తంగా ‘మైక్రోస్కోపిస్ట్‌’గా 20 ఏళ్ల ప్రయాణం నాది!

డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపెలా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)...  ‘ఎక్స్‌టర్నల్‌ కాంపిటెన్స్‌ అసెస్‌మెంట్‌ ఆన్‌ మలేరియా మైక్రోస్కోపీ’ అనే పరీక్ష నిర్వహిస్తుంది. మలేరియా మైక్రోస్కోపీలో ప్రపంచంలోనే అత్యున్నత పరీక్ష ఇది. దానిలో 90శాతంపైగా మార్కులు సాధించినవారికి ‘లెవెల్‌-1’ సర్టిఫికేషన్‌ ఇస్తుంది. దక్షిణాదిన దాన్ని సాధించిన తొలి వ్యక్తిని నేను. ఇదేమిటంటే... మనదేశంలో సెరిబ్రల్‌ మలేరియా, కాలేయంపై దాడిచేసే వైవాక్స్‌ అనే రెండు రకాల పరాన్నజీవులు ఉంటాయి. ఇవి సోకితే పరీక్షల్లో తేలికగా గుర్తించొచ్చు. ఇప్పుడు ప్రపంచమే కుగ్రామమైంది. మనదేశంలోలాగే వేరే దేశాల్లో ఇతర పరాన్నజీవులు ఉంటాయి. విదేశీయుల ద్వారా మనదేశానికి వచ్చి, సోకితే కనుక్కోవడం కష్టం. ఒక్కోసారి వ్యక్తుల మరణానికీ దారితీయొచ్చు. అవి కనిపెట్టే నిపుణులను తయారుచేసేలా ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌ఓ ఈ పరీక్షను తీసుకొచ్చింది. దేశంలో 20మంది పాల్గొంటే ముగ్గురం ఎంపికయ్యాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయిదు రకాల మలేరియా పరాన్నజీవులను గుర్తించడమే కాదు, నిర్ణీత రక్తపరిమాణంలో వాటి సంఖ్యనీ కచ్చితంగా చెప్పాలి. నిజానికి మన దగ్గర ‘తక్కువ, మధ్యస్థం, ఎక్కువ’ అని చెబితే సరిపోతుంది. కానీ ఇక్కడ కచ్చితమైన సంఖ్యనీ చెప్పాలి. సమయపరిమితి అయిదు నిమిషాలే! ఇంత కష్టమైనది కాబట్టే... ప్రపంచవ్యాప్తంగా లెవెల్‌-1 వాళ్లు 300 మందికిపైగా మాత్రమే ఉన్నారు. వాళ్లందరినీ అంతర్జాతీయ కోర్‌ గ్రూప్‌ (ఐసీజీ)లో భాగంగా చేస్తారు. కొత్త పరాన్నజీవి వచ్చినట్లు అనుమానం వస్తే మాలాంటివారిని ఆ పరిశోధనలో భాగం చేస్తారు. ఈ సర్టిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా శిక్షణనీ ఇవ్వొచ్చు.

ఇది ఊరటే...

మొదట్నుంచీ నాది సవాళ్లను స్వీకరించే తత్వం. పెళ్లయ్యాక చదువు కష్టమన్నారు. కొనసాగించి చూపించా. ప్రభుత్వ కొలువు అసాధ్యమంటే అదీ సాధించా. ఏజెన్సీలో కొలువా అని హేళనచేస్తే గుర్తింపు సాధించా. కానీ రెండేళ్ల క్రితం చేతికొచ్చిన కొడుకు గుండెపోటుతో కళ్లముందే కుప్పకూలిపోయాడు. అది తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. తిరిగి నన్ను బయటపడేసింది పనే. కానీ మా డీపీహెచ్‌ అధికారిణి పద్మావతి, మరో ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి నాపై నమ్మకం ఉంచి, ప్రభుత్వ స్పాన్సర్‌షిప్‌తో నన్నీ పరీక్షకు పంపారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయలేదు... అది సంతోషాన్నిస్తోంది. గ్రౌండ్‌లెవెల్‌ వాళ్లకి ఉత్తమ శిక్షణివ్వాలి, మరికొందరినైనా లెవెల్‌-1 స్థాయికి తీసుకెళ్లాలి. ప్రపంచంలో రెండే దేశాల్లో మలేరియా లేదు. వాటి సరసన ఏపీని నిలబెట్టాలన్నది నా ముందున్న లక్ష్యాలు.

ఎం. జగదీష్‌ కుమార్, టి. చిరంజీవి, విజయవాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్