Periods: ఒక మెన్‌స్ట్రువల్‌ కప్ = 2,500 న్యాప్‌కిన్లు!

నెలసరి అనగానే చాలామందికి ప్యాడ్లే గుర్తొస్తాయి.. కానీ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌తో పిరియడ్స్‌ సమయంలో మరింత సౌకర్యంగా ఉండచ్చని తెలిసినా చాలామంది వీటిని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే దీన్ని శరీరం లోపల అమర్చుకోవాలి కాబట్టి అసౌకర్యంగా అనిపిస్తుందనేది చాలామంది భావన!

Updated : 13 Jun 2024 14:23 IST

(Photos : Twitter)

నెలసరి అనగానే చాలామందికి ప్యాడ్లే గుర్తొస్తాయి.. కానీ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌తో పిరియడ్స్‌ సమయంలో మరింత సౌకర్యంగా ఉండచ్చని తెలిసినా చాలామంది వీటిని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే దీన్ని శరీరం లోపల అమర్చుకోవాలి కాబట్టి అసౌకర్యంగా అనిపిస్తుందనేది చాలామంది భావన! ఇక గ్రామాల్లో నివసించే మహిళలకైతే దీనిపై కనీస అవగాహన కూడా ఉండదు. ఇలాంటి గ్రామీణ మహిళల్లో నెలసరిపై ఉన్న అపోహలు, ఆలోచనల్ని దూరం చేసి.. నెలసరి పరిశుభ్రతను పెంపొందించేందుకు నాలుగేళ్లుగా కృషి చేస్తోంది బెంగళూరుకు చెందిన ఇరా గుహ. ఈ క్రమంలోనే పర్యావరణహితమైన మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ తయారీకి శ్రీకారం చుట్టిన ఆమె.. గ్రామాల్లో నివసించే మహిళలకు వీటిని అందిస్తూ.. నెలసరి గురించి వారిలో అవగాహన పెంచుతోంది. ఇటు దేశవ్యాప్తంగా, అటు ప్రపంచ దేశాల్లోని గ్రామీణ మహిళల్ని నెలసరి పేదరికానికి దూరం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ఇరా స్ఫూర్తిదాయక ప్రయాణమిది!

బెంగళూరుకు చెందిన సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది ఇరా. ఆమె తల్లి సుజాత గ్రాఫిక్‌ డిజైనర్‌. ఓ డిజైనింగ్‌ సంస్థను నడిపేవారు. తండ్రి రామచంద్ర గుహ.. పేరు మోసిన రచయిత. పెరిగి పెద్దయ్యే క్రమంలో తల్లిదండ్రుల్నే స్ఫూర్తిగా తీసుకున్న ఆమె.. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించేది. ‘అమ్మ వ్యాపారవేత్త, నాన్న రచయిత.. సమాజంలోని సమస్యలే ఆయన రచనలకు ఆయువుపట్టు. మేం ముగ్గురం రోజూ డైనింగ్‌ టేబుల్‌ వద్దకు చేరితే చాలు.. సామాజిక సమస్యలు, రాజకీయాలు, పర్యావరణ పరిరక్షణ.. ఇవే అంశాలు చర్చకు వచ్చేవి. అలా నాకూ సామాజిక స్పృహ పెరిగింది.. పర్యావరణంపై ఇష్టం ఏర్పడింది..’ అంటోంది ఇరా.

లెక్చరర్‌ ఇచ్చిన ఐడియాతో..!
18 ఏళ్లకే పైచదువుల కోసం లండన్‌ వెళ్లిన ఇరా.. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బీఏ, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ‘పబ్లిక్‌ పాలసీ’ విభాగంలో మాస్టర్స్‌ పూర్తిచేసింది. ఆపై అక్కడే ఓ సంస్థలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగంలో చేరింది. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ ఇండియా వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలోనే తనకో అనుభవం ఎదురైందని చెబుతోంది.
‘ఓసారి ఇండియాకొచ్చినప్పుడు మా వంట మనిషి ఆరోగ్యం బాగోలేదని సెలవు తీసుకుంది. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. తాను నెలసరి సమయంలో చవక ధరకు కొన్న శ్యానిటరీ ప్యాడ్‌ని ఉపయోగించడం, దానివల్ల ర్యాషెస్‌ రావడం వల్లే అనారోగ్యానికి గురైందని తెలిసింది. అప్పుడే తనకు మెన్‌స్ట్రువల్‌ కప్‌ని పరిచయం చేశా. అప్పటికే లండన్‌లో వీటి ఉపయోగం సాధారణమైపోయింది. కానీ భారత్‌లో వీటిని తయారుచేసే సంస్థలేవీ అప్పటికి లేవనే చెప్పాలి. ఇక నేనిచ్చిన కప్‌ మా వంట మనిషికి నచ్చడంతో మరిన్ని కావాలని అడిగింది. ఇలా నేను లండన్‌ నుంచి తిరిగొచ్చినప్పుడల్లా కొన్ని మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ తీసుకొచ్చి తెలిసిన వాళ్లకు అందించేదాన్ని. అయితే ఇలా నేను భారత్‌లో కప్స్‌ పంపిణీ చేస్తున్నానని తెలుసుకున్న మా ప్రొఫెసర్‌ ఒకరు.. ‘పదే పదే ఇక్కడి నుంచి కప్స్‌ తీసుకెళ్లే బదులు.. అక్కడ నువ్వే సొంతంగా వీటిని తయారుచేయచ్చు కదా! తద్వారా ఎంతోమందికి వీటిని అందించచ్చు కదా..’ అన్నారు. ఆమె మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి..’ అంటోంది ఇరా.

‘కప్‌.. ఎవరు వాడతారు?’ అన్నారు!
ఇలా ప్రొఫెసర్‌ మాటలతో ప్రేరణ పొందిన ఇరా.. మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ తయారీ, దాని కోసం వాడే మెటీరియల్స్‌ గురించి తాను చదువుకున్న హార్వర్డ్‌ యూనివర్సిటీలోనే లోతుగా అధ్యయనం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లో ఉన్న కప్స్‌నీ పరిశీలించి.. వాటిలోని లోపాల్ని దృష్టిలో పెట్టుకొని.. సరికొత్త మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ తయారీకి సిద్ధమైందామె. ఇలా సుమారు మూడేళ్ల అధ్యయనం తర్వాత 2020లో ‘ఆసన్‌ మెన్‌స్ట్రువల్‌ కప్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించింది ఇరా.
‘నేను తయారు చేసే కప్స్‌ నాణ్యత, ఇతర అంశాలపై మహిళల ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేందుకు దేశవ్యాప్తంగా కొన్ని కప్స్‌ని ఉచితంగా పంపిణీ చేశా. లీకేజీ, అధిక రక్తస్రావం, సౌకర్యం.. తదితర అంశాలపై మహిళలు తమ ఫీడ్‌బ్యాక్‌ని బహిరంగంగానే చెప్పారు. దాన్ని బట్టి తుది కప్‌ రూపుదిద్దుకుంది. అంతేకాదు.. భారతీయ మహిళలు సంప్రదాయ ఉత్పత్తులే వాడతారు.. ఇలాంటి ఉత్పత్తులు తయారుచేయడం అనవసరం అన్న వారూ లేకపోలేదు. శరీరంలో అమర్చుకునే ఇలాంటి ఉత్పత్తుల వల్ల అసౌకర్యం కలుగుతుందని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా నా ప్రయత్నాన్ని విరమించుకోలేదు. నేను తయారుచేసిన కప్స్‌ని నేనే స్వయంగా ఉపయోగించి.. పూర్తి సౌకర్యంగా ఫీలయ్యాకే మార్కెట్లోకి విడుదల చేశా. కప్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాల్నీ మహిళలకు వివరించా. ఈ ప్రయత్నాలే వారిలో ఉన్న అపోహల్ని తొలగించి.. వీటిని వాడేలా చేశాయి..’ అంటోంది ఇరా.

ఒక కప్‌ = 2500 ప్యాడ్లు!
తాము తయారుచేసే కప్స్‌ నాణ్యతలోనే కాదు.. వాడకంలోనూ భేషే అంటోంది ఇరా.
‘హార్ట్ స్టెంట్స్ తయారీకి ఉపయోగించే నాణ్యమైన మెడికల్ గ్రేడ్ సిలికాన్‌ను మా మెన్‌స్ట్రువల్ కప్స్ కోసం వాడుతున్నాం. ఇది ఆరోగ్యానికి పూర్తి సురక్షితమైంది. అంతేకాదు.. ఒక కప్‌ పదేళ్ల వరకూ మన్నుతుంది. అంటే.. సుమారు 2,500 శ్యానిటరీ న్యాప్‌కిన్లు ఆదా చేసినట్లే! దీనివల్ల ఆరోగ్యానికే కాదు.. పర్యావరణానికీ మేలు జరుగుతుంది. మరో విషయం ఏంటంటే.. ఒక కప్పు 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణనిస్తుంది. వ్యాయామం చేసినా, ఈత కొట్టినా, పరిగెత్తినా.. సౌకర్యంగా ఉంటుంది. ఇక దీన్ని అమర్చుకున్నాక అసలు తాము నెలసరిలో ఉన్నామన్న భావనే కలగదు.. అంత సౌకర్యంగా ఉంటుంది..’ అంటూ తమ మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ గురించి చెబుతోంది ఇరా. ప్రస్తుతం తన ఉత్పత్తుల్ని ఇటు దేశవ్యాప్తంగా, అటు యూకేలోనూ విక్రయిస్తోందామె. ఒక కప్‌ కొంటే మరొకటి ఉచితంగా ఇస్తోన్న ఆమె.. ఇప్పటివరకు దేశంలోని పలు గ్రామాల్లో సుమారు 50 వేల మందికి పైగా మహిళలకు తమ ఉత్పత్తిని పరిచయం చేసింది.

‘యాప్‌’ తోడుగా..!
నెలసరి కప్స్‌ని పర్యావరణహితంగా తయారుచేయడమే కాదు.. వాటిని ఎకో-ఫ్రెండ్లీ ప్యాకింగ్‌తో వినియోగదారులకు చేరువ చేస్తోంది ఇరా. ఇదే ప్యాకింగ్‌లో ఓ మ్యాన్యువల్‌ని కూడా ఉంచుతోంది. అది కూడా గ్రామీణ మహిళలకు సులభంగా అర్థమయ్యే తమ మాతృభాషలో! ఇక దేశవ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని మహిళల్లో నెలసరిపై ఉన్న అపోహల్ని దూరం చేయడానికి.. ప్రాంతీయ భాషల్లోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందామె. ఇందుకోసం అక్కడి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వలంటీర్ల సహాయం తీసుకుంటోంది. అంతటితో ఆగకుండా.. ఇటీవలే ఓ పిరియడ్‌ ట్రాకింగ్‌ యాప్‌ను కూడా అభివృద్ధి చేసింది ఇరా. నెలసరి పరిశుభ్రత-ఆరోగ్యంపై మహిళల్లో అవగాహన పెంచేందుకు దీన్ని రూపొందించిందామె.
‘ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా అవగాహన కల్పించినా.. నెలసరి సమయంలో క్లాత్స్‌, ప్యాడ్స్‌ ఉపయోగించే మహిళలు ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో వేలాది మంది ఉన్నారు. అలాంటి వాళ్లలోనూ మార్పు తీసుకొస్తా. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెలసరి పేదరికాన్ని అంతమొందించడమే నా లక్ష్యం! అది సాధ్యమయ్యే దాకా నా ఈ ప్రయత్నం ఆగదు..’ అంటోంది ఇరా. ఇలా తన సమాజ సేవకు గుర్తింపుగా ఈ ఏడాది ‘కార్టియర్‌ విమెన్స్‌ ఇన్నొవేటివ్‌ అవార్డు’తో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలూ అందుకుందీ సోషల్‌ వారియర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్