టీ పాట్‌ కాదు.. హెయిర్‌స్టైల్!

‘జుట్టున్న అమ్మ ఏ కొప్పేసినా అందమే!’ అన్నట్లు.. ప్రస్తుతం ఓ విభిన్న హెయిర్‌స్టైల్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అలాగని అదేదో బన్‌, బ్రెయిడ్‌, ట్విస్ట్‌ హెయిర్‌స్టైల్‌ అనుకునేరు!

Updated : 06 Jul 2024 14:30 IST

(Photos: Instagram)

‘జుట్టున్న అమ్మ ఏ కొప్పేసినా అందమే!’ అన్నట్లు.. ప్రస్తుతం ఓ విభిన్న హెయిర్‌స్టైల్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అలాగని అదేదో బన్‌, బ్రెయిడ్‌, ట్విస్ట్‌ హెయిర్‌స్టైల్‌ అనుకునేరు! వీటన్నింటినీ తలదన్నేలా ఏకంగా జుట్టుతో ఓ టీ-పాట్‌నే సృష్టించింది ఇరాన్‌కు చెందిన సయీదే ఆర్యై అనే అమ్మాయి. మోడల్‌ జుట్టుతోనే కెటిల్‌ రూపాన్నిచ్చిన ఆమె.. హెయిర్‌స్టైల్‌ పూర్తయ్యాక అందులో నుంచే టీ పోసుకొని తాగడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే కాదు.. ఇలాంటి ఎన్నో విభిన్న హెయిర్‌స్టైల్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ. ఇంతకీ ఎవరీ సయీదే?

బ్రైడల్‌ స్పెషలిస్ట్!

సయీదే ఇరాన్‌కు చెందిన ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌. బ్రైడల్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌గా పేరుగాంచిన ఆమె.. అక్కడి వధువులకు విభిన్న హెయిర్‌ స్టైల్స్‌తో హంగులద్దుతుంటుంది. సెలబ్రిటీలకూ పార్టీకి తగినట్లుగా హెయిర్‌ డ్రస్సింగ్‌ చేస్తూ వన్నెలద్దుతుంటుంది. పోనీ టెయిల్‌, బన్‌, ట్విస్ట్‌.. ఇలా ఏ హెయిర్‌స్టైల్‌ ప్రయత్నించినా అందులోనే తనకంటూ ప్రత్యేకత, వైవిధ్యం ఉండేలా చూసుకుంటుంది సయీదే. అంతేకాదు.. ఈ క్రమంలోనే వివిధ రకాల హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ ఉపయోగించినా, ఆర్టిఫిషియల్‌ విగ్స్‌ వాడినా.. ఏమాత్రం తేడా తెలియకుండా న్యాచురల్‌గా హెయిర్‌స్టైల్‌ను తీర్చిదిద్దడంలో ఆమె దిట్ట!

ఇది ‘కెటిల్‌’ స్టైల్!

ఈ క్రమంలోనే వివిధ రకాల వస్తువులు, కళాఖండాల్నీ తలపై జుట్టుతో తీర్చిదిద్దుతుంటుంది సయీదే! అలా ఇటీవలే ఓ మోడల్‌ జుట్టుతో టీ-పాట్‌ హెయిర్‌స్టైల్‌ని రూపొందించిందామె. ఇందుకోసం.. ముందుగా వైర్లతో కెటిల్‌ రూపాన్ని తయారుచేసి.. దాని చుట్టూ మెటాలిక్‌ ఫ్రేమ్‌ను చుట్టి.. తలపై పెట్టి జుట్టుతో కెటిల్‌ను కవర్‌ చేసిందామె. మధ్యమధ్యలో జుట్టును వ్యతిరేక దిశలో దువ్వుతూ, సెట్టింగ్‌ స్ప్రేతో సెట్‌ చేస్తూ, ఆర్టిఫిషియల్‌ హెయిర్‌ లేయర్స్‌ని వాడుతూ.. ఇలా విభిన్న పద్ధతుల్ని ఫాలో అవుతూ.. టీ-పాట్‌ హెయిర్‌ స్టైల్‌ని క్రియేట్‌ చేసింది సయీదే. అంతేకాదు.. ఈ కెటిల్‌కు అదనపు హంగులద్దేందుకు.. మోడల్‌ జుట్టుతో చిన్న చిన్న జడలల్లుతూ దాని చుట్టూ అలంకరించింది కూడా! ఇక ఆఖరికి ఆ కెటిల్‌లో డికాషన్‌ని నింపి.. తిరిగి కప్‌లో పోసుకొని టీ టైమ్‌ని ఆస్వాదించిందామె. ఇలా తాను రూపొందించిన ఈ విభిన్న హెయిర్‌స్టైల్‌కి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంది సయీదే! ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆమె క్రియేటివిటీకి నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. ‘వావ్‌.. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్!’ అంటూ ఈ ఇరానియన్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

నా రూటే సెపరేటు!

అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం, లక్షల కొద్దీ వ్యూస్.. లైక్స్‌ని సొంతం చేసుకోవడంతో స్పందించిన సయీదే.. ఈ హెయిర్‌స్టైల్‌కి సంబంధించిన పలు విశేషాల్ని పంచుకుంది.

‘ఫ్యాషన్‌, స్టైల్‌ ఈ ప్రపంచానికి కొత్త కాదు. కానీ ఇందులోనే వైవిధ్యం ప్రదర్శించాలనుకున్నా. అది కూడా సహజత్వం ఉట్టిపడేలా! ఈ ఆలోచనలో నుంచే నా హెయిర్‌స్టైల్స్‌ పుట్టుకొచ్చాయి. టీ-పాట్‌ హెయిర్‌ డ్రస్సింగ్‌ కోసం నాకు రెండు రోజుల సమయం పట్టింది. మోడల్‌ జుట్టుకు రంగు వేయడం, కెటిల్‌ తరహా ఆకృతిని తయారుచేయడం, ఇతర ఆర్టిఫిషియల్‌ హెయిర్‌ మెటీరియల్స్‌ని సమకూర్చుకోవడం.. ఇలా రెండు రోజుల్లో ఈ హెయిర్‌స్టైల్‌కి అందమైన రూపం తీసుకురాగలిగా..’ అంటోందీ క్రియేటివ్‌ గర్ల్‌. ఇదే కాదు.. అక్వేరియం హెయిర్‌స్టైల్‌, సిండ్రెల్లా షూ తరహా హెయిర్‌స్టైల్‌, ఈ ఏడాది వేలంటైన్స్‌ డే సందర్భంగా హార్ట్‌ సింబల్స్‌తో ప్రత్యేకంగా రూపొందించిన హెయిర్‌స్టైల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే సయీదే క్రియేట్‌ చేసిన విభిన్న హెయిర్‌స్టైల్స్‌ చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఓ బ్రైడల్‌ సెలూన్‌ను నడుపుతోన్న ఆమె.. ఔత్సాహికులకు హెయిర్‌స్టైలింగ్‌ మెలకువలు నేర్పేందుకు ఓ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని కూడా నిర్వహిస్తోంది. మరి, సయీదే చేతిలో రూపుదిద్దుకున్న ఆ డిఫరెంట్‌ హెయిర్‌స్టైల్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్