ఆ సమస్యలు ఆస్తమాకు దారి తీస్తాయా?

మా పాప పది రోజులుగా విపరీతమైన పొడి దగ్గుతో బాధపడుతోంది.  డాక్టర్‌ని సంప్రదిస్తే మందులు ఇచ్చారు. కానీ, వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రోజూ నెబ్యులైజర్‌ పెట్టమన్నారు. కానీ, నెబ్యులైజర్‌ పెట్టిన ఒకటి, రెండు గంటల....

Published : 10 Jun 2023 18:25 IST

మా పాప పది రోజులుగా విపరీతమైన పొడి దగ్గుతో బాధపడుతోంది.  డాక్టర్‌ని సంప్రదిస్తే మందులు ఇచ్చారు. కానీ, వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రోజూ నెబ్యులైజర్‌ పెట్టమన్నారు. కానీ, నెబ్యులైజర్‌ పెట్టిన ఒకటి, రెండు గంటల వరకు బాగానే ఉంటోంది. ఆ తర్వాత మళ్లీ పొడిదగ్గు, ఆయాసం మొదలవుతున్నాయి. పాపకున్న సమస్య ఏంటి? ఇది ఆస్తమాకు దారి తీస్తుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఒక్కోసారి వైరల్‌ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లయితే జలుబు లేదా గొంతు నొప్పితో మొదలై పొడిదగ్గులాగా వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో చేరి ఆయాసం వస్తుంటుంది. అయితే ఇప్పటికే వాటికి సంబంధించిన మందులు వాడారని చెప్పారు. అయినా దగ్గు తగ్గడం లేదని అంటున్నారు. ఏ దగ్గు అయినా వారం నుంచి 10 రోజుల్లో తగ్గకపోతే మరోసారి చెకప్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యుమోనియా, టీబీ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇందుకోసం బేసిక్ ఎక్స్‌రేతో పాటు తెమడ, కొన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా మీ పాపకు ఏ రకమైన ఇన్ఫెక్షన్‌ వచ్చిందనేది తెలుసుకోవచ్చు.

కొన్ని సందర్భాల్లో వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గిన తర్వాత కూడా దగ్గు, ఆయాసం వంటివి వస్తుంటాయి. దీనిని పోస్ట్‌ వైరల్‌ బ్రాంకియల్‌ హైపర్ రియాక్టివిటీ అంటుంటారు. ఇలాంటి కండిషన్‌ ఉన్నప్పుడు శ్వాస నాళాలు మరింత సున్నితంగా మారతాయి. దానివల్ల దుమ్ము, పొగ, చలి వంటి వాటికి శరీరం తొందరగా ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా దగ్గు, ఆయాసం వస్తుంటుంది. ఇలాంటప్పుడు నెబ్యులైజేషన్‌, ఇన్‌హేలర్స్ వాడడం వంటి వాటి వల్ల కొంత ఉపశమనం లభిస్తుంటుంది. అయితే వీటిని ఉపయోగించినంత సేపు బాగానే ఉన్నా ఆ తర్వాత సమస్య పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

అలాగే కొంతమందిలో ఇంతకుముందు అలర్జీ, ఆస్తమా.. వంటి సమస్యలుంటే కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువకాలం ఉంటాయి. కాబట్టి, వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకుంటే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్