Isha Ambani: ఐవీఎఫ్‌ పద్ధతిలో అమ్మనయ్యా!

సంతానలేమి.. మన సమాజం దీన్నో లోపంగా పరిగణిస్తుంది. పిల్లలు పుట్టకపోతే వాళ్లేదో పాపం చేసినట్లుగా వారిపై నిందలేస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టే ఆధునిక వైద్య పద్ధతులెన్నో ఈ కాలపు జంటలకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐవీఎఫ్‌ ఒకటి.

Updated : 29 Jun 2024 19:54 IST

(Photos: Instagram)

సంతానలేమి.. మన సమాజం దీన్నో లోపంగా పరిగణిస్తుంది. పిల్లలు పుట్టకపోతే వాళ్లేదో పాపం చేసినట్లుగా వారిపై నిందలేస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టే ఆధునిక వైద్య పద్ధతులెన్నో ఈ కాలపు జంటలకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐవీఎఫ్‌ ఒకటి. ఎంతోమంది దంపతులకు సంతాన భాగ్యాన్ని అందిస్తోన్న ఈ వైద్య పద్ధతిపై అపోహల్ని తొలగించి.. అవగాహన పెంచడం ఎంతో అవసరమంటోంది అంబానీ ప్రిన్సెస్‌ ఈషా అంబానీ. తానూ ఐవీఎఫ్‌ పద్ధతిలోనే తన ఇద్దరు కవలలకు జన్మనిచ్చానంటూ తన ప్రెగ్నెన్సీ సీక్రెట్‌ని ఇటీవలే ఓ సందర్భంలో బయటపెట్టింది. ఈ క్రమంలో ఈషా పంచుకున్న ఐవీఎఫ్‌ అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

నీతా-ముకేష్‌ల గారాలపట్టి ఈషా.. తన కుటుంబ నేపథ్యంతో కాకుండా.. సొంత ప్రతిభతో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన ‘టిరా బ్యూటీ’, ‘అజియో’, ‘హామ్లేస్‌’, ‘నెట్‌మెడ్‌’, ‘7-ఎలెవన్‌’.. వంటి ఐదు సంస్థలకు అధిపతిగా ఉన్న ఆమె.. తనదైన వ్యాపార దక్షతతో వాటిని లాభాల బాట పట్టిస్తోంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ పిరమాళ్‌ను పెళ్లాడిన ఆమె.. 2022లో కృష్ణ, ఆదియా అనే ఇద్దరు కవల చిన్నారులకు జన్మనిచ్చింది.


ఐవీఎఫ్.. తప్పు కాదు!

అయితే తనకూ తన తల్లిలాగే ఐవీఎఫ్‌ పద్ధతిలో కవల పిల్లలు పుట్టారంటూ తన ప్రెగ్నెన్సీ రహస్యాన్ని ఇటీవలే వోగ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది ఈషా. సాధారణంగా చాలామంది ప్రముఖులు ఇలాంటి విషయాల్ని రహస్యంగా ఉంచుతారు. కానీ ఐవీఎఫ్‌పై ఉన్న అపోహల్ని తొలగించి.. దాన్ని ఓ మామూలు విషయంలా భావించేలా చేయడానికే ఈ విషయాన్ని బయటపెట్టానంటోందీ అంబానీ ఆడపడుచు.

‘నేనూ మా అమ్మలాగే ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్భం దాల్చాను. ఈ ఆధునిక పద్ధతే నాకు కృష్ణ, ఆదియా.. వంటి కవలల్ని ప్రసాదించింది. అయితే నేను ఈ విషయాన్ని ఇంత త్వరగా ఎందుకు చెబుతున్నానంటే.. నేను ఈ పద్ధతిని ఒక కూడని విషయంగా కాకుండా సాధారణంగానే పరిగణించాను కాబట్టి! మనం దీని గురించి ఎంత బహిరంగంగా మాట్లాడితే.. ఇది అంత సాధారణ విషయంగా కనిపిస్తుంది. చాలామంది ఐవీఎఫ్‌ను గుట్టు చప్పుడు కాకుండా చేయించుకుంటారు. కానీ అందులో అంత ప్రైవసీ పాటించాల్సిన అవసరం లేదు. అలాగే అదేదో సిగ్గుపడాల్సిన అంశమూ కాదు. నిజానికి ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఐవీఎఫ్‌ చికిత్స తీసుకున్న వాళ్లు శారీరకంగా ఎంతో ఒత్తిడికి గురవుతారు. మానసికంగానూ డిస్టర్బ్‌ అవుతారు. సంతాన భాగ్యాన్ని ప్రసాదించే వైద్య పరిజ్ఞానం ఉన్నప్పుడు.. మనం దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు?! ఐవీఎఫ్‌ అనేది దాచి ఉంచాల్సిన అంశం కాదు.. సంతోషంగా నలుగురితో పంచుకోవాల్సిన విషయం. అప్పుడే ఈ తరహా చికిత్స తీసుకున్న వాళ్లను సులభంగా గుర్తించగలుగుతాం. వాళ్లతో చర్చించడం, వారి సలహాలు తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ మరింత సులభతరమవుతుంది..’ అంది ఈషా.

గతంలో నీతా అంబానీ కూడా.. తాను ఎప్పటికీ తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పారని, ఆపై తన ఫ్యామిలీ డాక్టర్‌ సలహా మేరకు తానూ ఐవీఎఫ్‌ పద్ధతితో కవలలు ఈషా, ఆకాశ్‌లకు జన్మనిచ్చినట్లు చెప్పిన సంగతి తెలిసిందే!


‘కార్బీ బార్బీ’ గర్ల్!

ఇటీవల వోగ్‌ పత్రిక జులై-ఆగస్టు ఎడిషన్‌ కవర్‌ పేజీపై మెరిసింది ఈషా. ఈ క్రమంలో విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించి బార్బీ డాల్‌లా మెరిసిపోయిన ఈ బిజినెస్‌ క్వీన్‌.. తనకు కార్బోహైడ్రేట్లున్న ఆహార పదార్థాలంటే ఇష్టమంటోంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్‌ ఈషాను ‘కార్బీ బార్బీ’ అంటూ పిలుస్తున్నారు.

‘ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, బటర్డ్‌ టోస్ట్‌, వడా పావ్‌.. ఇలా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల్ని ఇష్టపడుతుంటా. మాష్‌ చేసిన బంగాళాదుంపలు, మ్యాగీ న్యూడుల్స్‌ నా ప్లేట్‌లో తప్పకుండా ఉండాల్సిందే! నేను మా బామ్మ దగ్గర గుజరాతీ థాలీ ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలని ఎప్పుడూ ఆరాటపడేదాన్ని. ఎందుకంటే ఈ థాలీలో మూడు రకాల కాయగూరలు, పప్పు, మొలకెత్తిన గింజలు, బీన్స్‌, పూరీ, రోటీ, అన్నం, పాపడ్‌, స్వీట్‌.. ఉంటాయి. ఇవన్నీ కార్బోహైడ్రేట్లు నిండి ఉన్నవే! అయితే ఏది తీసుకున్నా పోషకాలు ఎక్కువగా ఉండేలా, రుచి తగ్గకుండా చూసుకుంటా. ఈ క్రమంలో కొన్ని వంటకాలు స్వయంగా నేర్చుకున్నా. ఇలా నచ్చినవి తీసుకుంటూనే ఫిట్‌గా ఉండేందుకు యోగా, పిలాటిస్.. వంటి వ్యాయామాలు చేస్తా. హూలాహూప్‌ చేయడం నాకు చిన్నతనం నుంచే అలవాటుంది. భలే సరదాగా ఉంటుందీ ఎక్సర్‌సైజ్‌..’ అంటూ తన ఆరోగ్య రహస్యాల్ని బయటపెట్టిందీ బిజినెస్‌ లేడీ.


కర్లీ హెయిర్‌.. నాకిష్టం!

కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లు ‘తమది గడ్డి జుట్టు.. ఎంత దువ్వినా పిచ్చుక గూడే’ అంటూ విసుక్కుంటుంటారు. ఇలాంటి వాళ్లకు ఓ చక్కటి చిట్కా చెప్పింది ఈషా.

‘నా జుట్టు కాస్త కర్లీగా ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్నప్పుడు జుట్టు కోసం ఎలాంటి స్టైలింగ్‌ టిప్స్‌ పాటించను. దాంతో అది మరింత చిక్కులు పడిపోయి గడ్డిలాగా కనిపిస్తుంది. నిజానికి నాకు అలా ఉండడమే ఇష్టం. అయితే మన దేశంలో చాలావరకు వాతావరణ పరిస్థితులు వేడిగా, లేదంటే తేమ/జిడ్డుతో కూడుకొని ఉంటాయి. వీటి ప్రభావంతో ఆయిలీ జుట్టు పిచ్చుక గూడులా మారిపోతుంది. దాంతో ఎంత దువ్వినా దువ్వనట్లుగానే కనిపిస్తుంది. అందుకే చాలామంది కర్లీ హెయిర్‌ తమ అందాన్ని దెబ్బతీస్తుందని భావిస్తుంటారు. కానీ నేను మాత్రం అలా అనుకోను. తరచూ జుట్టుకు నూనె రాసి.. కింది వైపు దువ్వేస్తాను.. అంతే.. నా జుట్టు నా అధీనంలోకి వచ్చేస్తుంది. కర్లీ హెయిర్‌ను కంట్రోల్‌ చేయాలంటే ఇదో చక్కటి చిట్కా! ఇక అందం విషయానికొస్తే నేను ఎలాంటి బ్యూటీ రొటీన్‌ని పాటించను. చర్మంపై ఎలాంటి ప్రయోగాలూ చేయను. గాలి పీల్చుకునేలా దాన్ని అలా వదిలేస్తుంటా..’ అని చెబుతోంది ఈషా.


వాళ్లే నా బెస్ట్‌ ఫ్రెండ్స్!

అందరికీ కుటుంబం వెలుపల ఫ్రెండ్స్‌ ఉంటే.. తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రం తన ఇంట్లోనే ఉన్నారంటోంది ఈషా. వాళ్లెవరో కాదు.. తన ఇద్దరు మరదళ్లు శ్లోకా మెహతా, రాధికా మర్చంట్.
‘శ్లోక నా చిన్ననాటి స్నేహితురాలు. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇద్దరం అక్కచెల్లెళ్లలాగే పెరిగాం. ఇలా నా ప్రాణ స్నేహితురాలు నా సోదరుడు ఆకాశ్‌కు భార్య అవడం, నాకు మరదలవడం నా అదృష్టం. ఇప్పటికీ మేం కలిసిన ప్రతిసారీ చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటాం. ఎంతో సరదాగా గడుపుతాం. ఇక త్వరలోనే నా మరో బెస్ట్‌ ఫ్రెండ్‌ రాధిక కూడా మా కుటుంబంలోకి అడుగుపెట్టబోతోంది. నా దృష్టిలో అనంత్‌ ఎప్పుడూ పసివాడే.. అందుకే తనకు కాబోయే భార్య రాధికనూ ఓ తల్లి కోణంలో నుంచే చూస్తా. నేను, అమ్మ, శ్లోక, రాధిక.. నా ప్రాణ స్నేహితుల్లో వీళ్లే ముందు వరుసలో ఉంటారు..’ అంటూ తన కుటుంబం గురించి చెబుతోందీ అంబానీ యువరాణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్