బార్బీ బొమ్మలా మారడానికి ఏం చేసిందో తెలుసా?!
బార్బీ బొమ్మ అంటే మనందరికీ ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలకు దీన్ని బహుమతిగా ఇవ్వడం పరిపాటే! ఈ కాలంలో అయితే మరో అడుగు ముందుకేసి కానుకివ్వాలనుకునే అమ్మాయిని పోలిన బార్బీ బొమ్మను....
(Photos: Instagram)
బార్బీ బొమ్మ అంటే మనందరికీ ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలకు దీన్ని బహుమతిగా ఇవ్వడం పరిపాటే! ఈ కాలంలో అయితే మరో అడుగు ముందుకేసి కానుకివ్వాలనుకునే అమ్మాయిని పోలిన బార్బీ బొమ్మను తయారుచేయించి మరీ గిఫ్ట్‌గా అందిస్తున్నారు. అయితే ఇలా మనందరం ఈ బొమ్మ అందాన్ని చూసి మాత్రమే ఆస్వాదిస్తుంటాం. కానీ జర్మనీకి చెందిన ఓ 21 ఏళ్ల మోడల్ ఏకంగా తానే బార్బీగా మారాలనుకుంది. ఇందుకోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి మరీ పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. పూర్తిస్థాయి బార్బీ డాల్‌గా మారేందుకు చేయించుకోవాల్సిన చికిత్సలు మరికొన్నున్నాయంటోంది. మొత్తానికి తన పూర్వపు స్థితికి, ఇప్పటికి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆమె ఫొటోలు చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యపోతున్నారు. ‘ఏంటిది? పైత్యం కాకపోతే..’ అంటూ విమర్శించిన వారూ లేకపోలేదు. మరి, ఇంతకీ ఎవరా అమ్మాయి? బార్బీలా ఎందుకు మారాలనుకుంది? రండి.. తెలుసుకుందాం..!
జర్మనీలో పుట్టి పెరిగిన జెస్సిక.. అలియాస్ జెస్సీ బన్నీ ఒక ఫ్యాషన్ మోడల్. ఆమెకు చిన్నతనం నుంచి బార్బీ బొమ్మ అంటే చాలా ఇష్టం.. ఫ్యాషనబుల్‌గా తయారవడమంటే మక్కువ. అయితే ఆమె కుటుంబం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. పాశ్చాత్య దేశస్థులే అయినా అమ్మాయంటే అణకువగా ఉండాలన్న సిద్ధాంతాన్ని నమ్ముతారు వారు. అంతేకాదు.. చదువుపై శ్రద్ధ పెట్టమంటూ జెస్సీపై ఎక్కువగా ఒత్తిడి తెచ్చేవారు.
ఆ కట్టుబాట్లతో విసిగిపోయా!
అయితే జెస్సీ తన ఇష్ట ప్రకారమే ఫ్యాషనబుల్‌గా కనిపించే దుస్తులు ధరిస్తే ఆమె కుటుంబ సభ్యులకు నచ్చకపోయేది. అలాగని అవతలి వాళ్ల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తన మనసును చంపుకోలేకపోయేదాన్నని చెబుతోంది జెస్సీ.
‘మాది సంప్రదాయ కుటుంబం. డ్రస్సింగ్, చదువు విషయాల్లో ఇంట్లో వాళ్లు అస్సలు రాజీ పడకపోయేవారు. కానీ నాకేమో కొత్త కొత్త ఫ్యాషన్లు ప్రయత్నించాలని ఉండేది. అప్పుడప్పుడూ వాళ్ల ఇష్టానికి విరుద్ధంగా విభిన్న దుస్తులు ధరించేదాన్ని. ఆ సమయంలో శరీరం కనిపించిన చోటల్లా కవర్ చేసుకోవడానికి వీలుగా స్కార్ఫ్‌లు ఇచ్చేవారు. ఇలాంటి కట్టుబాట్లతో ఒక్కోసారి నన్ను చూస్తే నాకే విసుగొచ్చేది..’ అంటూ చెప్పుకొచ్చింది జెస్సీ.
అలా తొలి ప్రయత్నం సక్సెసైంది!
సాధారణంగా మనకు నచ్చిన బొమ్మ ఏదైనా మన వద్ద ఉంటే దాన్ని అపురూపంగా దాచుకుంటాం.. దాని అందాన్ని ఆస్వాదిస్తాం.. కానీ జెస్సీ మాత్రం తనకు నచ్చిన బార్బీ డాల్‌లా తన రూపాన్ని మార్చుకోవాలని అనుకుంది. ఇదే నిర్ణయాన్ని ఇంట్లో చెప్తే ససేమిరా అనడంతో ఇంట్లో నుంచి పారిపోవడానికి కూడా వెనకాడలేదామె. ‘నాకు బార్బీ డాల్ అంటే ఎంతిష్టమంటే.. నా రూపాన్నే ఈ బొమ్మలా మార్చుకునేంతలా! నిజానికి నా నిర్ణయం ఇంట్లో వాళ్లకు నచ్చదని తెలుసు.. అయినా చెప్పే ధైర్యం చేశాను. వాళ్లు ఒప్పుకోలేదు. ఇక అప్పటికే వాళ్ల కట్టుబాట్ల కారణంగా విసుగెత్తిపోయిన నేను.. 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటికొచ్చేశా.. ఆస్ట్రేలియా చేరుకున్నా.. అక్కడే నా రూపాన్ని మార్చుకునే ప్రక్రియ మొదలైంది. ముందుగా నా వక్షోజాల పరిమాణం పెంచుకునేందుకు మూడుసార్లు శస్త్రచికిత్స (బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ) చేయించుకున్నా. అమ్మానాన్న డ్రైవింగ్ పాఠాలు నేర్చుకోమని నాకు ఇచ్చిన డబ్బును ఇందుకోసం వెచ్చించా. ఈ ప్రయత్నం సక్సెసైంది.. దీంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. ఆ తర్వాత ముక్కు, పెదాలు, పిరుదుల్ని ఇంజెక్షన్స్ సహాయంతో మార్చుకున్నా. ఇందుకోసం ఇప్పటివరకు సుమారు రూ. 55.72 లక్షలు ఖర్చయ్యాయి. అయితే ఇంకా పూర్తి స్థాయి బార్బీలా మారేందుకు ఇంకొన్ని చికిత్సలు అవసరం. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నా..’ అంటోంది జెస్సీ.
ఆ సంతృప్తి చాలనిపిస్తోంది..!
బార్బీ డాల్‌లా మారే క్రమంలో ఎప్పటికప్పుడు తన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది జెస్సీ. అయితే తనలోని మార్పుల్ని చూసి చాలామంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారని చెబుతోందామె. ‘నా శారీరక మార్పుల్ని చూసి చాలామంది ప్రశంసిస్తున్నారు. అలాగని విమర్శించే వారూ లేకపోలేదు. కానీ నెగెటివ్ కామెంట్స్ కన్నా పాజిటివ్‌గా స్పందించే వారే ఎక్కువమంది ఉన్నారు. వీళ్ల మాటలు వింటుంటే ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే ఒక్కటే లోటు.. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా నా కుటుంబ సభ్యులు నన్ను అంగీకరించట్లేదు. నా శరీరాన్ని నాకు నచ్చినట్లుగా మార్చుకోవడం తప్ప నేనే తప్పూ చేయలేదు.. అయినా వాళ్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఉదయం లేచి నన్ను నేను అద్దంలో చూసుకొని సంతోషంగా, సంతృప్తిగా ఫీలవుతున్నా.. నాకు అది చాలు!’ అంటూ తన స్వీయ ప్రేమను చాటుకుంటోందీ మోడల్.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద సిలికాన్ వక్షోజాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకున్న జెస్సీ.. పెదాల విషయంలోనూ చరిత్ర సృష్టించాలనుకుంటోందట! ఇప్పుడైతే అదే ప్రయత్నాల్లో ఉన్నానని చెబుతోంది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉన్న జెస్సీని ప్రస్తుతం 89,500 మంది ఫాలో అవుతున్నారు.
లుక్కేమో గానీ.. సమస్యలే ఎక్కువ!
బార్బీ డాల్‌గా మారే క్రమంలో జెస్సీ పోస్ట్ చేసే ఫొటోల్ని చూసి ప్రశంసిస్తోన్న వారు కొందరైతే.. ‘చేజేతులా ప్రాణాల మీదికి తెచ్చుకోవడం కాకపోతే.. ఏంటిది?!’ అంటూ విమర్శిస్తున్నారు మరికొందరు. ఏదేమైనా ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలు, శస్త్రచికిత్సలు ఎన్నో రకాల అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో..
* రక్తం ఎక్కువగా కోల్పోవడం..
* పదే పదే ఇచ్చే మత్తు ఇంజెక్షన్ల వల్ల గుండె, ఊపిరితిత్తులకు ప్రమాదం.
* ఒక్కోసారి ఆ శరీర భాగంలో నరాలు, అవయవం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
* ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలూ ఎక్కువే అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్తనాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిలో 2 నుంచి 4 శాతం మంది ఇన్ఫెక్షన్లకు గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
* శరీరంపై ఎక్కడ మచ్చ పడినా ఓర్చుకోలేం. అలాంటిది ఇలాంటి సర్జరీల కారణంగా పడే మచ్చలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే అవకాశమూ లేకపోలేదు.
* నచ్చినట్లుగా శరీరాన్ని మార్చుకోవాలనుకుంటాం.. కానీ ఒక్కోసారి అది సఫలం కాక.. అటు ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతుంది.. ఇటు ఆత్మవిశ్వాసమూ దెబ్బతింటుంది.
సో.. ఎవరిలాగానో మారాలన్న తాపత్రయంతో ఇన్ని సమస్యల్లో చిక్కుకోవడం కంటే.. ఎలా ఉన్నా అంగీకరిస్తూ.. ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవడం వల్ల సంతృప్తి, ఆత్మవిశ్వాసం.. రెండూ రెట్టింపవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ విషయంపై మీ స్పందనేంటి? Contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!