చెత్త కుప్పల్లో ర్యాంప్ వాక్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా మోడల్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ర్యాంప్‌ వాక్‌లు, క్యాట్‌ వాక్‌లు చేస్తుంటారు. కానీ జార్ఖండ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం డంపింగ్‌ యార్డులో చెత్తపై ర్యాంప్‌ వాక్‌ చేసింది. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం, కడుపులో దేవేసే వ్యర్థాల మధ్యన ఏకంగా అరగంట పాటు కలియతిరిగింది.

Published : 02 Sep 2021 18:25 IST

(Photo: Instagram)

సాధారణంగా మోడల్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ర్యాంప్‌ వాక్‌లు, క్యాట్‌ వాక్‌లు చేస్తుంటారు. కానీ జార్ఖండ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం డంపింగ్‌ యార్డులో చెత్తపై ర్యాంప్‌ వాక్‌ చేసింది. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం, కడుపులో దేవేసే వ్యర్థాల మధ్యన ఏకంగా అరగంట పాటు కలియతిరిగింది. మరి ఫ్యాషన్ షోల్లో హొయలు ఒలికించాల్సిన ఈ ముద్దుగుమ్మ ఇలా చెత్తకుప్పల్లో ఎందుకు ర్యాంప్‌ వాక్‌ చేసిందో తెలుసుకుందాం రండి.

డంపింగ్‌ యార్డ్‌లో ఫొటోషూట్!

రాంచీ పట్టణ శివారులో ఉండే ఝిరి ప్రాంత వాసులు గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడున్న భారీ డంపింగ్‌ యార్డే దీనికి ప్రధాన కారణం. రాంచీ పట్టణంలో పోగైన చెత్తనంతా గత కొన్నేళ్లుగా ఇక్కడే తెచ్చిపడేస్తున్నారు అధికారులు. నెలకు సుమారు 18 వేల టన్నుల చెత్తను ఇక్కడే డంప్‌ చేస్తున్నారట. ఇలా గత పదేళ్లలో సుమారు 2.1 మిలియన్ల టన్నుల చెత్తను అక్కడ పోగేశారట. చెత్త నిర్వహణ, రీసైక్లింగ్‌ కూడా లేకపోవడంతో ఈ చెత్తంతా ఓ పెద్ద కొండలా పేరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. చుట్టు పక్కల ప్రజలు కూడా తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు.

కాళ్లు ఇరుక్కుపోతున్నా !

ఈ క్రమంలో డంపింగ్‌ యార్డ్‌ నిర్వహణలో అధికారులకు కనువిప్పు కలిగేలా చేయాలనుకుంది మోడల్‌ సురభి. గతంలో ‘మిస్‌ జార్ఖండ్‌’ గానూ నిలిచిన ఆమె ఈ సమస్యను ప్రభుత్వంతో పాటు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు, వివిధ రంగాల సెలబ్రిటీల దృష్టికి తీసుకెళ్లాలనుకుంది. ఇందులో భాగంగా రెడ్‌ కలర్‌ దుస్తుల్లో అందంగా ముస్తాబై ఆ చెత్తకుప్పల్లోనే ర్యాంప్‌ వాక్‌ చేసింది. ఓవైపు భరించలేని దుర్గంధం....మరోవైపు మురికి కుప్పల్లో కాళ్లు ఇరుక్కుపోతున్నా ఏకంగా అరగంట పాటు అక్కడే కలియ తిరిగింది.

స్కిన్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చాయి!

ప్రాంజల్‌ కుమార్‌ అనే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌ డ్రోన్‌ కెమెరాల సహాయంతో సురభి ఫొటోలు, వీడియోలను తీశాడు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. కొద్ది సేపట్లోనే అవి వైరల్‌గా మారాయి. ‘ఫొటోగ్రాఫర్ ఈ సమస్య గురించి నాతో చర్చించాడు. పరిష్కారం కోసం ఏదైనా చేద్దామన్నాడు. అప్పుడే ర్యాంప్‌ వాక్‌ ఆలోచన వచ్చింది. వేలాది మంది ప్రాణాలు ముడిపడి ఉండడంతో నేను కూడా రెండో ఆలోచన చేయలేదు. వెంటనే డంపింగ్‌ యార్డ్‌ ఫొటోషూట్‌కి అంగీకరించాను.
అయితే ర్యాంప్‌ వాక్‌లో భాగంగా మొదటి అడుగు వేయగానే నా రెండు కాళ్లు చెత్తకుప్పల్లో ఇరుక్కు పోయాయి. అడుగు ముందుకు వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చుట్టూ చనిపోయిన జంతువుల కళేబరాలు, శానిటరీ న్యాప్‌కిన్లు, ప్లాస్టిక్‌ బాటిల్స్, పాలిథీన్ బ్యాగులు, మెడికల్‌ వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనను భరిస్తూనే అరగంట పాటు తిరిగాను. అక్కడి క్రిములు, కీటకాల వల్ల కొన్ని స్కిన్‌ ఇన్ఫెక్షన్స్‌ కూడా వచ్చాయి. అందుకే షూట్‌ తర్వాత డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

కమిషనర్‌ స్పందించారు!

సురభి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రాంచీ మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. త్వరలోనే ఝిరిలో చెత్త రీసైక్లింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ చెత్తతో కరెంటు ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రచిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్