ఆమె స్వయంకృషికి మోదీ ప్రశంసలు!

గతంలోలా మహిళలు ఇప్పుడు వంటింటికే పరిమితమై ఉండాలనుకోవట్లేదు. భర్తలపైనే పూర్తిగా ఆధారపడకుండా తమకంటూ ఓ జీతం, జీవితం ఉండాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభా పాటవాలను చాటుతూ ఆర్థిక సాధికారత దిశగా అడుగులేస్తున్నారు.

Published : 27 Sep 2021 18:39 IST

గతంలోలా మహిళలు ఇప్పుడు వంటింటికే పరిమితమై ఉండాలనుకోవట్లేదు. భర్తలపైనే పూర్తిగా ఆధారపడకుండా తమకంటూ ఓ జీతం, జీవితం ఉండాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభా పాటవాలను చాటుతూ ఆర్థిక సాధికారత దిశగా అడుగులేస్తున్నారు.

మోదీ మాటల్లో మీరా!

జార్ఖండ్‌కు చెందిన మీరా దేవి అనే మహిళ ఈ కోవకే చెందుతుంది. గిరిజన తెగకు చెందిన ఆమె వెదురుతో అద్భుతమైన కళాకృతులు తయారుచేస్తోంది. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. అదేవిధంగా తన విద్యను మరికొంతమంది మహిళలకు నేర్పుతూ వారి ఉపాధికి బాటలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మీరాను ప్రత్యేకంగా అభినందించారు. సొంతకాళ్లపై నిలబడిన ఆమె నేటి తరం మహిళలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

వెదురుతో అందమైన కళాకృతులు!

జార్ఖండ్‌లో మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కుంతి జిల్లాలోని కేలో గ్రామం కూడా ఒకటి. గిరిజనులు ఎక్కువగా నివసించే ఈ గ్రామంలో అభివృద్ధి అంతంతమాత్రమే! అయితే ఇక్కడి మహిళలు మాత్రం తమ పనితనంతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. వెదురుతో అద్భుతమైన కళాకృతులు తయారుచేస్తూ వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో తమ ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు. అయితే ఈ గిరిజన మహిళలు తమ సొంతకాళ్లపై నిలబడడం వెనక 35 ఏళ్ల మీరా కృషి ఎంతో ఉంది. 

అలా ఆదాయం పెంచుకున్నాను!

మీరా భర్త బిర్సా మంజి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని ఆదాయం అంతంతమాత్రమే! ఈ క్రమంలో ఇద్దరు పిల్లల చదువులకు తోడు ఇతర ఖర్చుల కోసం వెదురు బుట్టలు తయారుచేసి విక్రయించడం ప్రారంభించింది మీరా. ‘నేను మొదట్లో వెదురు బుట్టలు తయారుచేసి స్థానిక మార్కెట్‌లో విక్రయించాను. పెద్దగా ఆదాయం రాలేదు. అయితే 2018లో రాంచీ కేంద్రంగా ఉన్న ‘మహిళా వికాస్‌ సంస్థ’లో చేరి వెదురు ఉత్పత్తులకు సంబంధించి మరింత శిక్షణ తీసుకున్నాను. వెదురుతో అందమైన బొమ్మలు, పెన్సిల్/పెన్‌ స్టాండ్స్‌, లాంతర్లు, దీపాలు, అలంకరణ వస్తువులను తయారుచేసి విక్రయించాను. ‘జార్ఖండ్‌ స్టేట్‌ లైవ్లీ హుడ్‌ ప్రమోషన్‌ సొసైటీ’ నా ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించింది. ఆదాయం బాగా రావడంతో మా గ్రామంలోని మహిళలు కూడా నా దారిలో నడవాలనుకున్నారు. వారి ఆసక్తిని గమనించి వెదురు కళాకృతుల తయారీలో పూర్తి శిక్షణ ఇచ్చాను. ఆ తర్వాత మా గ్రామంలోని మహిళలంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఈ ఉత్పత్తులను తయారుచేయడం ప్రారంభించాం. వివిధ ఎగ్జిబిషన్లలో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటుచేసి మా ఉత్పత్తులను విక్రయించాం. దీంతో మా ఆదాయం బాగా పెరిగింది. నెలకు 10-15వేల దాకా వచ్చేవి.’

ఆకాశంలో తేలుతున్నట్లు అనిపించింది!

‘అయితే కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా మా వ్యాపారం బాగా దెబ్బతింది.  ప్రారంభంలో 150 మందికి పైగా నా వద్ద శిక్షణ తీసుకునేవారు. అందులో పురుషులు కూడా ఉండేవారు. కానీ ప్రస్తుతం నాతో పాటు మరో 12 మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. దీనికి తోడు మా ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కరువైంది. అందుకే అనుకున్నంత ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. వారు తోడ్పాటునందిస్తే రాష్ట్రమంతటా మా కళాకృతుల తయారీని విస్తరిస్తాం. దీని వల్ల మరికొంతమందికి ఉపాధి దొరుకుతుంది. గతంలో మా గ్రామంలోని మహిళలను చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఇక తాజాగా ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా మా సమస్యలను నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన మా స్వయం కృషిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా వెదురుతో నేను తయారుచేసి పంపించిన బహుమతి చాలా బావుందన్నారు. ఆ సమయంలో ఆకాశంలో తేలుతున్నట్లు అనిపించింది..’ అని చెప్పుకొచ్చింది మీరా.

మీరాకు ఆ శక్తి సామర్థ్యాలున్నాయి!

‘మహిళలు ఆర్థిక సాధికారత, స్వాతంత్ర్యం సాధించాలని మీరా కోరుకుంటోంది. అందుకే ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ తన సొంతకాళ్లపై నిలబడింది. వెదురుతో అద్భుతమైన కళాకృతులు, ఉత్పత్తులు తయారుచేస్తూనే మరికొంత మంది మహిళలకు ఉపాధి కల్పించింది. ఆమె తలచుకుంటే నెలకు యాభై వేల రూపాయల నుంచి లక్ష వరకు సంపాదించే శక్తి సామర్థ్యాలున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా ఆమెకు సహాయ సహకారాలు అందించాలి’ అని ఆ గ్రామానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్