ప్రతికూలతల్లోనూ ప్రయత్నం ఆపద్దు!

ఏదైనా చెప్పి రాదంటారు పెద్దలు. ప్రస్తుత కరోనా రోజులు ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీంతో ఏడాదిన్నర కాలంగా ఆర్థిక స్థిరత్వం లోపించి చాలామందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి కూడా! ఇప్పుడనే కాదు.. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులోనూ పునరావృతం కావచ్చు.

Updated : 09 Aug 2021 17:25 IST

ఏదైనా చెప్పి రాదంటారు పెద్దలు. ప్రస్తుత కరోనా రోజులు ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీంతో ఏడాదిన్నర కాలంగా ఆర్థిక స్థిరత్వం లోపించి చాలామందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి కూడా! ఇప్పుడనే కాదు.. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులోనూ పునరావృతం కావచ్చు. అలాగని ఆ భయంతో అక్కడే ఆగిపోతే వెనకబడిపోతాం.. అదే ఇలాంటి ప్రతికూలతల్లోనూ సానుకూల దృక్పథంతో మనం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తే.. తప్పకుండా విజయం మనదే అంటున్నారు నిపుణులు. అందుకే ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం.. వంటి దుర్బర పరిస్థితులు ఎదురైనప్పుడు కెరీర్‌లో ఆగిపోకూడదంటే ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

తాత్కాలికమైనా పర్లేదు!

సమయం మనది కానప్పుడు ఆ సమయానికి తగ్గట్లుగానే మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీ ఉద్యోగంపై వేటు పడే ప్రమాదం ఉందని ముందే తెలిసినా లేదంటే ఇప్పటికే జాబ్‌ కోల్పోయినా.. నాకు ఫలానా కంపెనీలో ఉద్యోగమే కావాలని భీష్మించుక్కూర్చోకుండా.. కెరీర్‌లో గ్యాప్‌ రాకుండా జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తాత్కాలికమే అయినా, మీ చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా.. దానికోసం ప్రయత్నించడంలో తప్పు లేదంటున్నారు. అవసరమైతే ఆ ఉద్యోగావకాశాల కోసం కొత్త నైపుణ్యాలు సైతం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అదనపు స్కిల్స్‌, ఉద్యోగ అనుభవం ఎప్పటికీ వృథా కావు.. ఇవి మీరు భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

వాటిపై దృష్టి పెట్టండి!

ఆర్థిక మాంద్యం/ఉద్యోగ సంక్షోభం.. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఒకేసారి అన్ని రంగాలపై ప్రభావం చూపడం చాలా అరుదు. అంటే.. ఈ సమయంలో పురోగతి చెందే రంగాలు కొన్నుంటాయి. మరికొన్ని యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తాయి. ఉదాహరణకు.. కరోనా వచ్చాక కొన్ని రంగాలపై ప్రభావం పడినా.. ఆరోగ్య రంగం, ఈ-కామర్స్‌.. వంటివి బోలెడన్ని లాభాల్ని ఆర్జించాయి. కాబట్టి మీ ఉద్యోగం సంక్షోభంలో ఉన్న సమయంలో ఎప్పటికీ ఆర్థిక స్థిరత్వం ఉంటుందన్న ఇలాంటి రంగాలపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉద్యోగాలు కల్పిస్తోన్న సంస్థలేంటో తెలుసుకొని.. దానికి తగ్గ నైపుణ్యాల్ని పెంచుకోవాలంటున్నారు. అలాగే ఆయా కంపెనీల్లో/రంగాల్లో పనిచేస్తోన్న స్నేహితులు/కొలీగ్స్‌తో టచ్‌లో ఉంటూ.. వారి వద్ద మెలకువలు నేర్చుకుంటే సులభంగా ఉద్యోగం పొందచ్చు.. సంక్షోభం ప్రభావం మీపై పడకుండా జాగ్రత్తపడచ్చు.

‘రిమోట్‌’కు అలవాటు పడాలి!

కరోనా వచ్చాక పిల్లల చదువు దగ్గర్నుంచి, పెద్దల ఉద్యోగాల దాకా.. ప్రతిదీ డిజిటలైజ్‌ అయిపోయింది. అంతెందుకు.. ఏవైనా వస్తువులు కొనాలన్నా ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఉందిగా అన్న భరోసా ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడిందని చెప్పచ్చు. రిమోట్‌ వర్కింగ్‌కు ఆదరణ పెరిగిపోయింది. కరోనా తర్వాత కూడా ఇంటి నుంచే పనిచేస్తామంటున్నాయి చాలా కంపెనీలు. అందుకు తగ్గట్లే మన నైపుణ్యాల్ని కూడా మెరుగుపరచుకోవాలంటున్నారు నిపుణులు. అంటే.. వీడియో కాల్స్‌/కాన్ఫరెన్స్‌ కాల్స్‌లోనే బృంద నిర్వహణ, ఉత్పాదకతను పెంచే మార్గాలు, ఇంటి పనులు-ఆఫీస్‌ పనుల్ని సమన్వయం చేసుకోవడం.. వంటివన్నీ అలవర్చుకున్నప్పుడే కెరీర్‌కి/ఉద్యోగానికి ఏ ఢోకా లేకుండా ముందుకు సాగచ్చు.

ఆ జోన్‌ నుంచి బయటికి రండి!

కంఫర్ట్‌ జోన్‌.. కెరీర్‌కి ఇది అతిపెద్ద అడ్డుగోడ అంటున్నారు నిపుణులు. ఎంతసేపూ.. ‘నేను ఈ ఉద్యోగమైతేనే చేస్తాను’, ‘ఇంతకంటే ఎక్కువ కష్టపడడం నా వల్ల కాదు’, ‘రిస్క్‌ చేయలేను’.. అంటూ మన సౌకర్యానికే ప్రాధాన్యమిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కెరీర్‌ మందగమనంలో సాగుతుంది. సంక్షోభ సమయంలోనూ ఈ జోన్‌లో ఉన్న వారికే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనమూ మారాలంటున్నారు నిపుణులు. అదనపు బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించాలంటున్నారు. ఏ ఉద్యోగమైనా/పనైనా చేస్తుంటేనే అందులో మనకు అనుభవం వస్తుంది.. అందుకే కొత్త పనుల్ని స్వీకరించడం, సవాళ్లకు సై అనడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ కెరీర్‌ ఫలవంతంగా ముందుకు సాగుతుంది.

ధైర్యమే పెట్టుబడిగా..!

ఉద్యోగం పోయింది.. ఎంత ప్రయత్నించినా సక్సెస్‌ కావట్లేదు.. అంటారా? అయితే నిరుత్సాహపడకుండా కాస్త ఆలోచించి మీలో ఉన్న తపనేంటో తెలుసుకోమంటున్నారు నిపుణులు. అంటే.. కొంతమందికి వంటలంటే ఇష్టం ఉండచ్చు.. మరికొంతమందికి పాఠాలు చెప్పడమంటే మక్కువ ఉండచ్చు.. ఇంకొంతమంది క్రాఫ్ట్స్ చేయడంలో దిట్ట కావచ్చు. ఇలా మీలోని ఆసక్తిని బయటికి తీసి వాటినే స్వీయ ఉపాధి మార్గాలుగా మలచుకోవచ్చు. వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెట్టచ్చు.. బొమ్మలు/క్రాఫ్ట్స్‌ తయారుచేసి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌లో పెట్టి అమ్మచ్చు.. అవసరమే మనలో ఉన్న ఆలోచనల్ని తట్టిలేపుతుందన్నట్లు ఇలా ఆలోచిస్తే ఐడియాలకు కొదవేముంది! అయితే ఈ క్రమంలో కాస్త ధైర్యాన్ని కూడా కూడగట్టుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఏదైనా సక్సెస్‌ కావడానికి కొన్ని నెలలు పట్టచ్చు.. ఏళ్లు పట్టచ్చు.. అప్పటిదాకా ధైర్యం కోల్పోకుండా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మనల్ని ఆపలేవు.

ఇవన్నీ చదువుతుంటే మీరూ మీ జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు/కెరీర్‌ ఇబ్బందులు గుర్తొస్తున్నాయా? అయితే అవేంటో? మీరు వాటిని ఎలా ఎదుర్కొన్నారో వసుంధర.నెట్‌ వేదికగా పంచుకోండి.. మీరిచ్చే సలహాలు ఎంతోమందికి కెరీర్‌ టిప్స్‌గా ఉపయోగపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్