Kajal: బాబు విషయంలో ఆ ఫీలింగ్ ఉన్నా.. ఇలా బ్యాలన్స్ చేస్తున్నా!

అమ్మవడం ఓ అందమైన అనుభూతి. అయితే ఇదే సమయంలో అటు పాపాయిని చూసుకోవడం, ఇటు కెరీర్‌నీ కొనసాగించడం.. అంత సులభం కాదు. ఈ క్రమంలో ఒక్కోసారి బుజ్జాయిని ఇంట్లోనే వదిలి విధులకు హాజరు కావాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు ఓ అమ్మగా తమ బిడ్డకు సమన్యాయం......

Updated : 30 Aug 2022 16:39 IST

(Photos: Instagram)

అమ్మవడం ఓ అందమైన అనుభూతి. అయితే ఇదే సమయంలో అటు పాపాయిని చూసుకోవడం, ఇటు కెరీర్‌నీ కొనసాగించడం.. అంత సులభం కాదు. ఈ క్రమంలో ఒక్కోసారి బుజ్జాయిని ఇంట్లోనే వదిలి విధులకు హాజరు కావాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు ఓ అమ్మగా తమ బిడ్డకు సమన్యాయం చేయలేకపోతున్నానే అన్న అపరాధ భావన మనసును తొలిచేస్తుంటుంది. దీన్నే ‘మామ్‌ గిల్ట్‌’ అంటారు. అయితే ప్రస్తుతం తానూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నానంటోంది టాలీవుడ్‌ ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. మేలో నీల్‌ అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ అందాల తార.. ప్రస్తుతం అటు అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే.. ఇటు షూటింగ్స్‌కీ హాజరవుతోంది. అయితే ఇలా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకునే క్రమంలో తనకెదురైన అనుభవాలు, అనుభూతుల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది కాజల్‌. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

అమ్మతనం ఎన్ని అనుభూతుల్ని పంచుతుందో అన్ని సవాళ్లనూ విసురుతుంది. ముఖ్యంగా ఇటు ఇంటిని-అటు పనిని సమన్వయం చేసుకోలేక ఎంతోమంది తల్లులు సతమతమవుతుంటారు. పాపాయిని ఇంట్లో వదిలి విధులకు హాజరయ్యే క్రమంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ప్రస్తుతం తనదీ ఇదే పరిస్థితి అంటోంది అందాల అమ్మ కాజల్‌. బాలీవుడ్‌ నటి నేహా ధూపియా నిర్వహిస్తోన్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం ‘ఫ్రీడమ్‌ టు ఫీడ్‌’లో ఇటీవలే పాల్గొన్న ఆమె.. అమ్మతనంలోని అనుభూతులు, అనుభవాల్ని ఇలా పూసగుచ్చింది.

జిమ్‌కీ వెళ్లలేకపోతున్నా!

‘వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ ఎంత సవాలుతో కూడుకున్నదో నీల్‌ పుట్టాకే నాకు అర్థమైంది. కెరీర్‌ పరంగా నేను పూర్తి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. వాటి కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలోనే అమ్మనయ్యా. ఇక తొలి 40 రోజులు మా అమ్మ ఒత్తిడితో బయటికి వెళ్లలేని పరిస్థితి! కానీ ఆ తర్వాత కొన్నిసార్లు ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. ఓ గదిలో నా బాబును అమ్మ చూసుకుంటే.. నేను మరో గదిలో షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. ఇది కాస్త కష్టంగానే అనిపించినా ఇష్టంతో చేశా. ఆ తర్వాత చిన్న చిన్న షూటింగ్స్‌ కోసం బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. నీల్‌ని ఇంటి వద్ద వదిలి వెళ్లడానికి మనసొప్పేది కాదు. వాడిని చూసుకోవడానికి ఒక మనిషి ఉన్నా.. కుటుంబ సభ్యులెవరైనా ఉంటే బాగుండేదనిపించేది. ఎవరో ఎందుకు నేనే పూర్తిగా నా బాబును చూసుకుందామనుకుంటే.. కెరీర్ పనుల రీత్యా అది కుదరట్లేదు. బయటికి వెళ్లిన ప్రతిసారీ అమ్మగా నేను నా బుజ్జాయికి తగిన సమయం కేటాయించలేకపోతున్నానన్న అపరాధ భావన (మామ్‌ గిల్ట్‌) నన్ను వేధిస్తోంది. ఈ సమస్యతో నాకు జిమ్‌కి వెళ్లడమూ కష్టంగానే ఉంది.. అయినా బ్యాలన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా’ అంటోంది కాజల్.

నొప్పిని భరిస్తూనే ఫీడింగ్‌ ఇచ్చా!

తన చిన్నారికి రొమ్ము పాలు పడుతూ ఎనలేని సంతోషాన్ని పొందుతారు మహిళలు. అయితే ఈ క్రమంలో తానూ ఎన్నో మధురానుభూతుల్ని, పలు సవాళ్లను ఎదుర్కొన్నానంటోందీ టాలీవుడ్‌ బ్యూటీ. ‘ప్రతి తల్లీ తన బిడ్డకు నేరుగా చనుబాలు పట్టాలని ఆరాటపడుతుంటుంది. నేనూ అంతే! అయితే నీల్‌ పుట్టిన తొలినాళ్లలో వాడు పాలు తాగుతున్నప్పుడు నా వక్షోజాల్లో విపరీతమైన నొప్పి వచ్చేది. దీంతో నిపుణుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకున్నా. అయితే నిపుణులైనా, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకున్నా సరే.. మనం అంతిమంగా మన చిన్నారి అవసరాల్ని దృష్టి పెట్టుకొని ముందుకెళ్లాలి. మనకు మనం మానసికంగా సిద్ధపడితేనే అది సాధ్యమవుతుంది.. అంతెందుకు.. నేనూ ఇప్పుడు షూటింగ్‌, జిమ్‌.. ఇలా ఎక్కడికెళ్లినా నా వెంటే ఓ బ్రెస్ట్‌ పంప్‌ తీసుకెళ్తున్నా.. వీలు చిక్కినప్పుడల్లా దాని సహాయంతో పాలు తీసి సమయానికి నా బిడ్డకు అందిస్తున్నా..’ అంటూ తన మాటలతో నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపింది కాజల్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని