Published : 01/12/2022 20:38 IST

కాటుక పెట్టుకునేటప్పుడు..!

కాటుక వల్ల కళ్లకు అందం రావడమే కాదు.. ముఖం కూడా మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. మరి అలాంటి కాటుక వల్ల కళ్లకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి? అసలు కళ్లకు కాటుక ఎలా పెట్టుకోవాలి? పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి?

కాటుక కళ్లకు మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా మహిళలందరూ కంటి అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి కాటుకను ఉపయోగిస్తారు.

చలువకు..

కాటుక.. కళ్లను హైలైట్ చేయడమే కాదు.. కంటికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. రాత్రి పూట కళ్లకు కాటుక పెట్టుకొని పడుకోవడం వల్ల కళ్లు శుభ్రపడి కంటిలో ఉండే మలినాలు తొలగిపోతాయి.

పెట్టుకునేటప్పుడు..

కళ్లకు కాటుక పెట్టుకోవడం కూడా ఓ కళే! కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపించచ్చు.

⚜ కాటుక పెట్టుకునే ముందు కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.

⚜ తర్వాత కళ్లను పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ని కళ్ల చుట్టూ మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ మీది ఆయిల్ చర్మం అయితే క్రీమ్‌కి బదులు ఫేస్ పౌడర్ ఉపయోగిస్తే సరిపోతుంది. లేదా టిష్యూ పేపర్‌తోనైనా కళ్ల చుట్టూ నీట్‌గా తుడవాలి.

⚜ మొదట కంటి కింది రెప్పకు.. తర్వాత పై రెప్పకు అప్త్లె చేసుకోవాలి. దీనికోసం మనం ఉపయోగించే పరికరం (కాజల్ టిప్) గట్టిగా, గరుకుగా, కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గరుకుగా ఉంటే కంటి లోపల గుచ్చుకునే ప్రమాదం ఉంది. కనురెప్పకు పైన, కింద ఒక లైన్‌లా కూడా కాటుక పెట్టుకోవచ్చు. దీనివల్ల కళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

⚜ కొంతమందికి కాటుక చేత్తో పెట్టుకునే అలవాటు ఉంటుంది. అలాంటివారు కాటుక పెట్టుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు. అలాగే వేళ్లకు గోళ్లు పెద్దగా లేకుండా చూసుకోవాలి.

⚜ బ్లాక్ జెల్ లైనర్ పెట్టుకుంటే కంటి అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకోవచ్చు.

⚜ కాటుకను చల్లటి ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఉంచిన కాటుకను కంటికి పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది.

⚜ తక్కువ నాణ్యత గల కాటుకను ఉపయోగించడం వల్ల అందులో ఉండే హానికారక రసాయనాలు వివిధ రకాల కంటి సమస్యలను కలుగజేస్తాయి.

మచ్చ పడకుండా..

కాటుక పెట్టుకునేటప్పుడు పొరపాటున కొన్నిసార్లు ముఖంపై ఎక్కడైనా అంటుకుంటుంది. దీనివల్ల ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడుతుంది. గట్టిగా తుడిస్తే ఆ ప్రదేశంలో మేకప్ పోయి డల్‌గా తయారవుతుంది. మరికొన్నిసార్లు కాటుక ముఖమంతా విస్తరిస్తుంది. అలాకాకుండా పెట్టుకున్న ప్రదేశం నుంచి విస్తరించకుండా.. కళ్లు ఆకర్షణీయంగా కనిపించేలా కాటుకను ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుందాం..

⚜ కాటుక పెట్టుకునే ముందు కళ్లకు ఫేస్‌పౌడర్ అప్త్లె చేసుకోవాలి. దీనివల్ల కాటుకను ఫేస్ పౌడర్ గ్రహించి మరెక్కడా అంటుకోకుండా చేస్తుంది.

⚜ కనురెప్పలు ఆయిలీగా ఉండటం వల్ల కూడా కాటుక విస్తరించి మచ్చలు పడే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే కాటుక పెట్టుకునే ముందే ఒక ఇయర్ బడ్‌ని తీసుకుని కనురెప్పలపై తుడవాలి. ఫలితంగా కాటుక విస్తరించకుండా.. కళ్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

⚜ కాటుక పెట్టుకున్న తర్వాత కళ్లను నలపకూడదు. అలాగే కాటుక మరెక్కడా అంటుకోకుండా ఉండాలంటే కాటుక పెట్టుకున్న భాగానికి కొంచెం కింది భాగంలో లిక్విడ్ లైనర్‌ని అప్త్లె చేసుకోవాలి. దీంతో కాటుక కిందికి రాకుండా ఈ లైనర్ అడ్డుకుంటుంది. దీనివల్ల కళ్లకు మంచి లుక్ కూడా వస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని